గవర్నర్ ‘సౌ’ నంబర్‌కు ఫోన్
– స్పందించిన అధికారులు
హైదరాబాద్,మే 21(జనంసాక్షి): గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల పనితీరుపై గవర్నర్ నరసింహన్ ప్రశంసల జల్లు కురిపించారు. రాజ్ భవన్లో ఎప్పుడూ అధికారులు, నాయకులతో బిజీగా ఉండే నరసింహన్ ఒక్కసారిగా సామాన్యుడి అవతారమెత్తారు. జీహెచ్‌ఎంసీ ఎమర్జెన్సీ నంబర్‌కు శనివారం ఆయన స్వయంగా ఫోన్ చేసి సామాన్య పౌరుడిలా ఫిర్యాదు చేశారు. నగరంలో శుక్రవారం కురిసిన భారీగా గాలులకు రాజ్ భవన్ రోడ్డులో చెట్లు కూలి అసౌకర్యంగా ఉందంటూ నరసింహన్ ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు వెంటనే రంగంలోకి దిగి కూలి పోయిన చెట్లను తొలగించారు. తానూ సామాన్య పౌరుడిలా ఫోన్ చేసినా వెంటనే సిబ్బంది స్పందించారంటూ తిరిగి నరసింహన్ ఎమర్జెన్సీ నంబర్‌కు ఫోన్ చేసి అధికారులను ప్రత్యేకంగా అభినందించారు.