గాంధీజయంతి నాటికి బహిరంగ మలవిసర్జిత గ్రామాలు

జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌గాంధీహన్మంతు

భద్రాద్రి కొత్తగూడెం,జూన్‌19(జ‌నం సాక్షి): అన్ని మండలాల్లో మరుగుదొడ్ల నిర్మాణాలను అక్టోబర్‌ 2 నాటికి పూర్తి చేసి బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాగా చేసేందుకు అందరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌గాంధీహన్మంతు చెప్పారు. మండలాలకు అడ్వాన్స్‌గా ఇచ్చిన డబ్బులతో త్వరితగతిన పూర్తి చేసి ప్రభుత్వం నుంచి విడుదల చేసిన వెంటనే డీఆర్‌డీఏకు తిరిగి చెల్లించాలని స్పష్టం చేశారు. స్వచ్ఛభారత్‌లో భాగంగా జిల్లాలోని అన్ని మండలాల్లో అక్టోబర్‌ 2 గాంధీ జయంతి నాటి కల్లా వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అడ్వాన్సులు ఇచ్చిన లబ్ధిదారులకు ఇంకా పది వేల మందికి మరుగుదొడ్లు నిర్మించాలని, ప్రగతి తక్కువగా ఉన్న మండలాల ఎంపీడీవోలు వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. ఓడీఎఫ్‌ పంచాయతీలుగా ఎంపికైన పంచాయతీల్లో తడి చెత్త, పొడి చెత్తలను వేరు చేసే ప్రాజెక్టుల భాగంగా బూర్గంపాడు మండలంలోని నాగినేనిప్రోలు గ్రామాన్ని పైలెట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేశారన్నారు. అదేవిధంగా రెండో గ్రామపంచాయతీగా ములకలపల్లి మండలంలోని చాపరాలపల్లిని, మూడో పంచాయతీగా దమ్మపేట మండలంలోని గండుగులపల్లి, మందాలపల్లిలలో ఈకార్యక్రమాలు నిర్వహించేందుకు సెర్ఫ్‌ సంస్థ ముందుకొచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమాలను విధిగా నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హరితహారంలో భాగంగా మండలంలో తయారు చేటీన ప్రణాళికలను వెబ్‌సైట్‌లో పొందుపార్చలని అధికారులకు సూచించారు. ఈఏడాది జిల్లాలో 98 లక్షల మొక్కలను హరితహారం కింద నాటేందుకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. డీఆర్‌డీఏ ద్వారా ఏర్పాటు చేసిన నర్సరీల్లో పెంచిన మొక్కల నిర్వహణకు జవాబు దారితో కూడిన వ్యక్తిని నియమించి నిర్దేశిత నమూనాలలో మొక్కల వివరాలను క్రోడీకరించి పారదర్శకతతో మొక్కలను సంబంధిత విభాగాలకు ఒట్వాడా చేయాలని చెప్పారు.