గాంధీ వారసుడిని

అహ్మదాబాద్‌, డిసెంబర్‌ 11 :

తాను గాంధీ వారసుడినని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్‌ గాంధీ అన్నారు. మంగళవారం జామ్‌నగర్‌ లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీపై నిప్పులు చెరిగారు. ఎక్కడా మోడి పేరును ప్రస్తావించకుండానే ఆరోపణలు గుప్పించారు. ప్రజలు గాడ్సే వారసత్వాన్ని అధికారం నుంచి దూరంగా తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. ముఖ్య మంత్రి, ప్రభుత్వం ఆమ్‌ ఆద్మీ గురించి పట్టించుకోవడం లేదని విమర్శించారు. ముఖ్యమంత్రి ఎప్పుడూ తన సొంత కలల గురించే ఆలోచిస్తారని.. ప్రజల గురించి పట్టించుకోరని మండిపడ్డారు. గుజరాత్‌లో నిరుద్యోగ సమస్య అధికంగా ఉందని, ప్రజలు నీటి సమస్యలతో ఇబ్బందులకు ఎదుర్కొం టున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ, గుజరాత్‌ వెలిగిపోతోందని బీజేపీ ప్రచారం చేసుకుంటోందని ఆరోపించారు. దేశంలో గుజరాత్‌ రాష్ట్రానిది చాలా కీలకపాత్ర అని రాహుల్‌ అన్నారు. మహాత్ముడు పుట్టిన రాష్ట్రం ఇదేనని గుర్తు చేశారు. గుజరాతే దేశానికి స్వాతంత్య్రం తెప్పించిందని వ్యాఖ్యానించారు. టెలికాం విప్లవానికి ఇక్కడే భీజం పడిందన్నారు. నాటి ప్రధాని రాజీవ్‌గాంధీ, శ్యామ్‌ పిట్రోడా కలిసి టెలికాం విప్లవానికి నాంది పలికారని తెలిపారు. రాజకీయాల్లో మహాత్ముడే తనకు ఆదర్శమని, మహాత్మాగాంధీయే తన రాజకీయ గురువు అని రాహుల్‌

వెల్లడించారు. యూపీఏ సర్కారు ప్రజా సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తోందన్నారు. ఉపాధి హామీ పతకం ద్వారా కోట్లాది మందికి ఉపాధి కల్పిస్తోందన్నారు. ప్రజలు అవినీతి గురించి మాట్లాడుతున్నారంటే.. దానికి కారణం యూపీఏ తీసుకువచ్చిన సమాచార హక్కు చట్టం వల్లేనన్నారు. ఈ చట్టం వల్ల సామాన్యుడు తన వాణిని విని వినిపించే అవకాశం కల్పించామన్నానరు. కానీ, గుజరాత్‌ ప్రభుత్వం అవినీతి దాచిపెడుతూ, అవినీతిపరులను కాపాడుతోందని దుయ్యబట్టారు. గుజరాత్‌ ప్రజల స్వరం వినిపించడం లేదని, పేదల కష్టాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. హక్కుల కోసం పోరాటం చేయాలని గాంధీజీ పిలుపునిచ్చారని గుర్తు చేశారు. మన కోసం మనం పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. గుజరాత్‌ ప్రభుత్వం సామాన్య పౌరులను పట్టించుకోవడం లేదని రాహుల్‌ ఆరోపించారు. ముఖ్యమంత్రి తన సొంత కలల గురించే మాట్లాడుతారు తప్ప ప్రజల వాణి మాత్రం పట్టించుకోరన్నారు. నిజమైన నాయకుడు ప్రజల కలలపై దృష్టి సారిస్తాడు కానీ, సొంత ఆలోచనలపై కాదన్నారు. ప్రజలను గాలికొదిలేసి, గొప్పలు చెప్పుకుంటోందని విమర్శించారు.

తాము లోక్‌పాల్‌ బిల్లు తీసుకువస్తే.. దాన్ని బీజేపీ అడ్డుకుందని ఆరోపించారు. గుజరాత్‌లో లోకాయుక్తను ఎందుకు నియమించలేదని ప్రశ్నించారు. 14 వేల ఆర్టీఐ దరఖాస్తులు పెండింగ్‌లో ఎందుకు ఉన్నాయని నిలదీశారు. గుజరాత్‌ సర్కారు అవినీతిని దాచిపెడుతోందని విమర్శించారు. గుజరాత్‌ వెలిగిపోతుందని చెప్పుకొంటూ.. మూడు రోజులకోసారి కేవలం 25 నిమిషాల పాటు మాత్రమే మంచి నీళ్లు సరఫరా చేస్తున్నారని విమర్శించారు. ఈ రాష్టాన్న్రి పాలించేది ఒక్కరు కాదని, ప్రజలంతా అని అన్నారు.  ప్రజలను పట్టించుకోని ప్రభుత్వానికి గురువారం జరిగే ఎన్నికల్లో బుద్ధిచ్చేలా తీర్పునివ్వాలని పిలుపునిచ్చారు.