గిన్నెనిండా పండ్లు… పాడుకోవడానికి పిల్లనగ్రోవి
ప్రపంచం చాలా త్వరగా మారిపో తుంది. మనుషులు కూడా అదేవిధంగా మారుతున్నారు. ప్రపంచం మనుషులే కాదు విలువలు కూడా అదేవిధంగా మారిపోతున్నాయి. ఈ విధంగా మారడానికి కారణాలు అనేకం. అందరం రోజూ తిట్టిపోసే ప్రపంచీకరణ కావొచ్చు. సాంకేతిక అభివృద్ధి కావొచ్చు. కారణాలు ఏవైనా కావొచ్చు. కానీ మనుషుల దృక్కోణం మారిపోయింది. ఇప్పుడు కొలబద్దలు కూడా మారిపోయాయి.
విలువలు ఇంత త్వరగా మారతాయని ఎవరూ ఊహించలేదు. ముందు ఒక తరం మారితే విలువలు మారేవి. ఇప్పుడు ఒకటి రెండు సంవత్సరాలకే విలువలు మారిపోతున్నాయి. అంచనాలూ మారిపోతున్నాయి. మరీ ముఖ్యంగా విలువలు అంతరించిపోయాయి. అవినీతి అనేది మన జీవితంలో విడదీయరాని అనుబంధంగా మారిపోయింది. ప్రజలు అవినీతిలో నీతిని కోరుకుంటున్నారు. బహుశా కొంతకాలానికి అవినీతిలో కూడా నీతి వుండకపోవచ్చు. లంచం తీసుకోవడంలో ఎలాంటి తప్పు కన్పించడం లేదు. డబ్బు కోసం అమ్ముడుపోవడం కూడా అతి మామూలు విషయంగా మారిపోయింది. జైలుకెళ్లినవాడు, అవినీతికి పాల్పడినవాడు తాను తప్పు చేయలేదని అనుకుంటే తప్పులేదు. కానీ ప్రజలు కూడా అదేవిధంగా భావిస్తున్నారని అన్పించినప్పుడు బాధ కలుగుతుంది.
‘ఎంతైతే సరిపోతుంది?’ గతంలో ఈ ప్రశ్న తరచూ విన్పించకపోయేది. కానీ ఇప్పుడు తరచూ విన్పిస్తుంది. ఎంతైనా సరిపోవడం లేదు. ఎప్పుడో విన్న ఓ కవితా చరణం గుర్తుకొస్తుంది.
‘రహిమే ఇత్‌నా దీజీయే
జా మై కుటుంబ సమయ్
ఆప్ బీ బుకాన్ న రహూ
సాదూ నా బుకా జాయే!
(ఓ భగవాన్! మా కుటుంబం కలిసి వుండే విధంగా చూడు. ఆకలిత అలమటించకుండా చూడు. సాధువుకి భోజనం మేం తిరస్కరించకుండా చూడు)
ఇప్పుడు ఎవరూ ఈ విధంగా కోరుకోవడం లేదు. కలలు మారిపోయాయి. కోరికలు పెరిగిపోయాయి. మనిషికి ఒక్కగది సరిపోని పరిస్థితి. ఒక్క మనిషి పది గదులు. కుటుంబానికి ఒక్క కారు సరిపోవడం లేదు. ఒక్కొక్కరికి రెండు కార్లు అవసరం పడుతున్నాయి. రెండు కాళ్లకి రెండు వేల చెప్పుల జతలు. రెండు చేతులకి కొన్ని వందల గాజులు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో.
మన రాజకీయ నాయకుల ఆస్తిపాస్తులను చూస్తే ఆశ్చర్యం కాదు గగుర్పాటు కలుగుతుంది. కొన్ని సంవత్సరాల వ్యవధిలోనే ఆశ్చర్యం కొలిపేవిధంగా ఆస్తులు, ఐశ్వర్యాన్ని పోగు చేసుకుంటున్నారు. ఇది ఒక రాజకీయ నాయకులకే పరిమితం కాలేదు. దేశంలోని అన్ని వ్యవస్థలకి అంటువ్యాధిలా సోకింది. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు చివరికి న్యాయమూర్తులూ కూడా ఆస్తిపాస్తులని సంపాదించడంలో పోటీ పడుతున్నారు. అవినీతి పోటీల ఎవరూ మినహాయింపుగా కన్పించడం లేదు. మేమేమి తక్కువ కాదని ఇప్పుడు క్రీడాకారులు కూడా ఇందులో పాలు పంచుకుంటున్నారు. ఒక్కొక్కరికి ఒక్కో పద్ధతి. అవినీతికి పాల్పడటంలో ఒక్కొక్కరిది ఒక్కో కోణం. అవినీతికి పాల్పడని వ్యక్తులని అమాయకులుగా, అనామకులుగా చూసే పరిస్థితి ఏర్పడిరది.
కాలంతో పాటూ మాటలు, వ్యాఖ్యలు కూడా మారిపోతున్నాయి. గతంలో లంచం ఇస్తే ‘వద్దు, వద్దు.. నాకు పిల్లలున్నారు’ అనేవాళ్లు. ఇప్పుడు దాని పద్ధతి కొంచం మారింది. ‘నాకు కావాలి. నాకు పిల్లలున్నారు. వాళ్ల గురించి నేను ఆలోచించాలి’ ఇదీ పద్ధతి.
ఎన్ని స్కాములు. ఎన్ని వేల లక్షల కోట్ల రూపాయలు దోపిడీ.. తెలిసినవి కొన్ని తెలియనివి ఎన్నో. ఎటు చూసినా ఏవో కొత్త స్కాముల పేర్లు. కొత్త వ్యక్తుల ప్రమేయం. ఈ మధ్య క్రికెట్ స్కాం తరువాత తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ ఆట ఆడటం మాన్పిస్తారా? ఇది లాభసాటిగా ఉందని ప్రోత్సహిస్తారా? అన్న సందేహాలు కూడా కొంత మంది వెలిబుచ్చుతున్నారు.
లంచాలు తీసుకునేవాడి పద్ధతి చాలా గమ్మత్తుగా వుంటుంది. వాకి వాదన ప్రకారం ఈ ప్రపంచంలో అంతా అవినీతి వుంది. అందరూ అవినీతి పరులే. నేనొక్కడినే కాదు. ప్రపంచమే ఈ విధంగా వుంటే నేనుమాత్రం ఏం చేయగలను. అందరు నడుస్తున్న దారిలోనే నేను నడవాలి కదా! ఇదీ వాళ్ల ధోరణి.
అవినీతికి పాల్పడుతున్న వ్యక్తులు ఒక్కొక్కరికి ఒక్కో సిద్ధాంతం వుంటుంది. పాశ్చాత్య దేశాల ప్రభావం వల్ల ఇలాంటి పరిస్థితి ఏర్పడిరదని కొందరు, ప్రభుత్వం చేస్తున్న ఆర్థిక సంస్కరణ వల్ల ఈ పరిస్థితి ఏర్పడిరదని మరికొందరు, ప్రపంచీకరణ, సరళీకరణ ఇట్లా అవినీతి పెరగడానికి కారణమంటూ ఒక్కొక్కరూ ఒక్కో కారణం చూపిస్తారు. ఒక్కోదాని మీద నీంద మోపుతారు. దీనికి కారణం తాము కాదు పైన చెప్పిన విషయాలు కారణమని బుకాయిస్తారు.
మరికొంత మంది మన ప్రజాస్వామ్య పద్ధతిపైన నిందలు వేస్తారు. ఎన్నికలలోని అవినీతి వల్ల రాజకీయ నాయకులు అవినీతికి పాల్పడుతున్నారు. వాళ్లు అవినీతికి పాల్పడం వల్ల బ్యూరోక్రసిలో అవినీతిని వాళ్లు ప్రోత్సహిస్తున్నారని కూడా కొంత మంది మాట్లాడుతారు. అవినీతికి పాల్పడిన వ్యక్తులని సత్వరంగా శిక్షించే వ్యవస్థ లేకపోవడం గురించి మరికొంత మంది మాట్లాడుతారు. వీటన్నింటి సమ్మిళితమే అవినీతి.
అవినీతి పెరిగిపోవడాన్ని కాస్త జాగ్రత్తగా గమనిస్తే కొన్ని కారణాలు కన్పిస్తున్నాయి అవినీతికి పాల్పడితే పట్టుకునే వ్యవస్థ లేదు. వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడినా పట్టుకునే పటిష్టమైన వ్యవస్థ లేదు. ఒకవేళ పట్టుకున్నా సత్వరంగా శిక్షవేసే పరిస్థితిలో కోర్టులు లేవు. ఎవరి కారణాలు వారికి వుండవచ్చు. స్కామ్‌ల కేసుల నిరూపణ అంత సులభం కాదు. కొన్ని వందల వేల డాక్యుమెంట్లు వుంటాయి. కొన్ని వందల మంది సాక్షులు వుంటారు. విచారణ పూర్తి కావడం అంత సులవుకాదు.
గతంలో పోలీసులంటే భయం వుండేది. కోర్టులంటే భయం వుండేది. వీటితో బాటూ ఇంట్లోని పెద్దవాళ్లంటే భయం వుండేది. ఇప్పుడు కుటుంబ పెద్దే అవినీతికి పాల్పడుతుంటే కుటుంబ సభ్యులకి ఏం భయం వుంటుంది. వీరందరితో బాటూ గతంలో అందరికీ దేవుడంటే భయం వుండేది. ఇప్పుడు అలాంటి భయాలు పూర్తిగా లేకుండా పోయాయి. పైపెచ్చు లక్షల కోట్లు సంపాదించిన వ్యక్తి దేవుడికి వజ్ర కిరీటాలని బహుమతిగా ఇస్తున్నాడు. ఇప్పుడు ఎవరికి ఎవరి గురించి భయం లేదు.
ప్రపంచం కుగ్రామంగా మారిపోయిన కాలంలో మనం కొన్ని వందల సంవత్సరాలుగా మనం ఏర్పాటు చేసుకున్న కట్టుబాట్లు, నడవడికలు ఇప్పుడు అసంబద్ధంగా అన్పిస్తున్నాయి. అవి అన్నీ కూడా నేటి ప్రపంచప్రమాణంలో స్పీడ్ బ్రేకర్లుగా, ఆటంకాలు కన్పిస్తున్నాయి. విపరీతమైన సంపద కాంక్ష ఇప్పుడు పెరిగిపోయింది.
‘దొంగతనం చేసే ముందు ఎవరైనా చూస్తున్నారా?’ అని ఏ దొంగైనా పరికిస్తాడు. కానీ ఇప్పుడు అవినీతికి పాల్పడుతున్న వ్యక్తులు ఈ విషయాలని పట్టించుకోవడం లేదు. ఈ సందర్భంగా నాకు ఒక్క విషయం గుర్తుకొస్తుంది. ఈ మధ్య కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్‌లో, కార్పొరేట్ దుకాణాల్లో ఒక బోర్డు కన్పిస్తుంది. ‘మీరు ఎలక్ట్రానిక్ స్కానర్‌లో వున్నారు’ ఎవరైనా ఏదైనా తప్పు చేయకుండా అది ఉపయోగపడుతుంది. ఎవరూ చూడటం లేదని అనుకున్నప్పుడు ఎవరైనా తప్పులు చేయడానికి అవకాశం వుంది. తప్పులు చేయకుండా నిరోధించడానికి ఇది ఉపయోగపడుతుంది.
మనం కూడా కాస్మిక్ పర్యవేక్షణలో వున్నాం కదా? అని ఎవరైనా భగవంతుని విషయం చెబితే అందరూ అతన్ని పిచ్చివాడిగా చూస్తున్నారు. ఇక్కడ విచిత్రమైన విషయం ఏమంటే దేశవ్యాప్తంగా భక్తి విపరీతంగా పెరిగింది. అవినీతితో పోటీ పడుతుంది. కానీ ఎవరికీ భయం లేదు. ఈ సందర్భంగా ఓ తెలుగు కవిత గుర్తుకొస్తుంది.
పైన చెప్పిన హిందీ కవిత లాంటిదే! మనిషి బతకడానికి ఏం కావాలి? ‘ఒక ప్రశ్న ` ఓ జవాబు’ కవిత ఇలా ఉంటుంది.
రెండు బంగళాలు
నాలుగు కార్లు
నగరంలో ఓ ఇల్లూ
నాలుగు ఫ్లాట్లు
బ్యాంక్ బాలెన్స్
పది డెబిట్ కార్డులు
ఇదీ మిత్రమా!
నా ముప్పై ఏళ్ల పురోగతి
మరి నువ్వు’
ప్రశ్నార్థకంగా చూశాడు
నా వైపు
ఏం వుంది!
కొన్ని వందల కవిత్వాలు
కొన్ని పదుల కథలు
మరికొన్ని వందల వ్యాసాలు
మోపెడు డైరీలు
దాన్నిండా
గీతలు అక్షరాలు
కొట్టివేతలు
పక్షులూ,
పద చిత్రాలు
జీవిత చిత్రణలు, మరెన్నో జీవన రేఖలు
ధ్వనులూ, ప్రతి ధ్వనులూ
ఉత్ప్రేక్షలు, ఉపమానాలు
మరి కొన్ని లెక్చర్ నోట్స్
ఇదే
నా ఆస్తి
ఇంకా
మా ఇద్దరు పిల్లలు
ఇదే నా జీవితం
ఇంతే కాదు మిత్రమా!
ఓ టేబిల్, ఓ కుర్చీ
గిన్నె నిండా పండ్లు
పాడుకోవడానికి పిల్లన గ్రోవీ
ఇంతకన్నా
ఇంకా
ఏం కావాలి చెప్పు
ఈ కవిత సారాంశం ఓ మిత్రుడికి చెబితే ఇలా అన్నాడు. నువ్వు సంపాదించలేక ఓ బహానా వెతుకున్నావని. అది బహానా కాదు. వాస్తవం. ఈ అభిప్రాయానికి భవిష్యత్తు తనం వస్తుందన్న ఆశ నాకుంది. అప్పుడు అవినీతి అంతరించకపోయినా తగ్గుముఖం పడుతుందన్న విశ్వాసం కాకుంది.
(మిత్రుడు, సీనియర్ న్యాయవాది సరసాని సత్యంరెడ్డికి కృతజ్ఞతలతో)