గిరిజనుల సంక్షేమం లక్ష్యంగా నిర్ణయాలు

` అభివృద్ధి విషయంలో ప్రభుత్వానికి సలహాలు
` గిరిజన సలహా మండలి సమావేశంలో మంత్రి అడ్లూరి
` కేసీఆర్‌ పాలనలో ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులు దుర్వినియోగం
` గిరిజన సంక్షేమశాఖ మంత్రి సీతక్క
హైదరాబాద్‌(జనంసాక్షి): గిరిజన సలహా మండలి గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి విషయంలో ప్రభుత్వానికి సలహాలిస్తుందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ అన్నారు. ఈ సమావేశం ద్వారా ఆయా లక్ష్యాలను సాధించడం ద్వారా గిరిజనులకు న్యాయం చేసే అవకాశం దక్కిందని అన్నారు.హైదరాబాద్‌ మాసబ్‌ ట్యాంక్‌ గిరిజన సంక్షేమ శాఖలో సోమవారం 7వ గిరిజన సలహా మండలి సమావేశం జరిగింది. రాజ్యాంగబద్ధమైన ఈ సలహా మండలిలో 16 అజెండా అంశాలతో పాటు- పలు అదనపు అజెండా అంశాల విూద చర్చ జరిగింది. ఎస్సీ ఎస్టీ మైనారిటీ వికలాంగుల శాఖామాత్యులు అడ్లూరి లక్ష్‌మణ్‌ కుమార్‌ అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో రాష్ట్రంలోని అందరు గిరిజన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు, -టైకార్‌, జేసీసీ ఛైర్మన్లు పాల్గొన్నారు. ఈసమావేశంలో అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ మాట్లాడుతూ రాజ్యాంగం ప్రకారం ఏర్పాటైన సలహా మండలి సభ్యులు చర్చించి సలహాలిచ్చిన అంశాలన్నింటిని పరిగణనలోకి తీసుకున్నామని, అందుకు వారికి ధన్యవాదాలు తెలియజేశారు. సభ్యులు ఇంకా కొత్త అజెండాలు ఇస్తే వాటిని తర్వాత వచ్చే గిరిజన సలహా మండలి అజెండా అంశాలుగా చేరుస్తామన్నారు. ఈ రోజు చర్చించిన అంశాలు కొన్నింటిని పరిష్కరించుకోవడానికి ప్రధానమంత్రి సమయం తీసుకొని కలుస్తామన్నారు. సమావేశంలో పాల్గొన్న పంచాయితీరాజ్‌ శాఖామాత్యులు డా. దనసరి అనసూయ సీతక్క మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల విషయంలో గిరిజనులందరికీ అవసరాన్నిబట్టి కేటాయింపులు జరగాలని, ప్రత్యేకించి ఆదిమవాసులకు ప్రత్యేక వెసులుబాట్లు కల్పించాలని, ఐటీడీఏలను బలోపేతం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉప సభాపతి రామచంద్రు నాయక్‌, ఎంపీలు గొడం నగేశ్‌, బలరాం నాయక్‌, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి డా. ఎ. శరత్‌, అదనపు సంచాలకులు వి. సర్వేశ్వర్‌ రెడ్డి, గిరిజన సాంస్కృతిక పరిశోధన శిక్షణ సంస్థ సంచాలకులు డా. వి. సముజ్వల తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
కేసీఆర్‌ పాలనలో ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులు దుర్వినియోగం:మంత్రి సీతక్క
గిరిజన సంక్షేమం విషయంలో గత కేసీఆర్‌ ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దుతున్నామని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎస్టీ సబ్‌ ప్లాన్‌ నిధులను పక్కదారి పట్టించిందని ధ్వజమెత్తారు. ఆదివాసి గిరిజన ప్రాంతాలకు రోడ్లు, బ్రిడ్జిలు అవసరమని.. కానీ గతంలో నిధులు పక్కదారి పట్టించడంతో గర్భిణుల ప్రసవవేదన వంటి వార్తలు వస్తున్నాయని చెప్పు కొచ్చారు. హైదరాబాద్‌లో ఇవా(సోమవారం) మంత్రి సీతక్క విూడియాతో మాట్లాడారు. ఏ ప్రభుత్వమైనా నిధులను పక్కదారి పట్టించవద్దని మంత్రి సీతక్క సూచించారు. ఎస్టీలకు కేటాయించిన నిధులను వారికే ఖర్చు చేయాలని కోరారు. కేటాయించిన నిధులను అదే అసెంబ్లీ నియోజకవర్గంలో, అదే జిల్లాలో సర్దుబాటు- చేయాలి.. తప్ప మైదాన ప్రాంతాలకు తరలించవద్దని ఆకాంక్షించారు. సబ్‌ ఎª`లాన్‌ నిధులను పక్కదారి పట్టిస్తే ఏజెన్సీ ఏరియా వెనకబాటులోనే మగ్గిపోతుందని మంత్రి సీతక్క తెలిపారు.అందుకే ఎస్టీలకు కేటాయించిన ప్రతి పైసా వారికి ఖర్చు చేయాలని సూచించారు. ఎస్టీల్లో ఎక్కువమందికి ఉండటానికి ఇండ్లు లేవని తెలిపారు. కాబట్టి ఎస్టీల ఇండ్ల నిర్మాణం కోసం బడ్జెట్‌ నిధులను పెంచే అంశాన్ని పరిశీలిస్తున్నామని అన్నారు. ఎస్టీలకు ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కనీస స్థల అర్హతను సడలించాలనే డిమాండ్‌ ఉందని గుర్తుచేశారు. సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి పరిష్కరిస్తామని మంత్రి సీతక్క పేర్కొన్నారు.