గిరిజన విశ్వవిద్యాలయ స్థల సేకరణలో నిర్లక్ష్యం
ఏడేళ్లయినా పూర్తికాని భూసేకరణ లక్ష్యం
నిర్మాణాలపై అనుమానాలు వ్యక్తం చేసిన అజయ్ శర్మ
విజయనగరం,ఆగస్ట్7(జనంసాక్షి): గిరిజన విశ్వవిద్యాలయ స్థల సేకరణ ఏడేళ్లయినా పూర్తికాలేదని ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక కన్వీనర్ అజయ శర్మమండిపడ్డారు. దత్తిరాజేరు మెంటాడ మండలాల్లో నిర్మించనున్న గిరిజన విశ్వవిద్యాలయం నిర్మాణం ఎప్పటికి పూర్తి చేస్తుందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆయన ప్రశ్నించారు. ఈ రెండు మండలాల్లో సేకరించిన స్థలాలను వారి బృందంతో శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా శర్మ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం స్థలం సేకరించి కేంద్ర ప్రభుత్వానికి అప్పజెప్పిన వెంటనే యూనివర్సిటీ పనులు ప్రారంభించాలని, అలా జరగకుండా ఈ రెండు ప్రభుత్వాలు నిర్లక్ష్య ధోరణి వ్యవహరిస్తున్నాయని ఆయన విమర్శించారు. ఇలా అయితే గిరిజనులు ఎప్పుడు అభివృద్ధి అవుతారని, వారికి ఉన్నత విద్య ఎప్పుడు అందుబాటులోకి వస్తుందని ఆయన దుయ్యబట్టారు. ఆంధప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 ప్రకారం ఐఏఎమ్, పెట్రోలిఎం యూనివర్సిటీలతో పాటు గిరిజన యూనివర్సిటీ కూడా కేంద్ర ప్రభుత్వమే నిర్వహించాలని ఆయన తెలిపారు. గిరిజన యూనివర్సిటీ మాత్రం ఇప్పటికీ కూడా ఎక్కడా స్థల సేకరణ కూడా జరగలేదని, మిగిలిన రెండు విద్యాసంస్థల నత్త నడకన మాత్రమే పనులు సాగుతున్నాయని ఆయన అన్నారు. రెండు తెలుగు రాష్టాల్లో కూడా యూనివర్సిటీకి స్థల సేకరణ జరగకపోవడం విడ్డూరంగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 2017లో కొత్తవలస వద్ద యూనివర్సిటీ నిర్మాణం కోసం స్థల సేకరణ చేసి కాంపౌండ్ వాల్ కూడా కట్టడం జరిగిందని, అనంతరం సాలూరు వద్దకు మార్చారని, వివిధ ప్రాంతాల పేర్లతో కాలయాపన చేస్తున్నారే తప్ప నిర్మాణానికి కట్టుదిట్టమైన చర్యలు ప్రభుత్వాలు తీసుకోకపోవడం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు. దేశంలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న
అమర్ కట్టం గిరిజన యూనివర్సిటీకి మూడేళ్ల క్రితం తమ బృందం పరిశీలన చేసింది అని, అక్కడి గిరిజనుల్లో ఉన్నతమైన విద్యను అభ్యసిస్తున్నారు అని ఆయన అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి ఇక్కడ గిరిజన విశ్వవిద్యాలయ పనులను తొందరగా ప్రారంభించి గిరిజన అభివృద్ధికి పాటు పడతారని ఆయన డిమాండ్ చేశారు. యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కె విజయగౌరి మాట్లాడుతూ గిరిజనుల పట్ల ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే యూనివర్సిటీ నిర్మాణం అతి తొందరలో పూర్తి చేసి నిరూపించుకోవాలని అన్నారు. ఈ బృందంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం శ్రీనివాస, ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ఆర్గనైజింగ్ సెక్రటరీ సత్యనారాయణ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జి శ్రీనివాస్, కౌలు రైతుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కోటి రాములు, కుంటినవల గ్రామ సర్పంచ్ రమేష్ నాయుడు ఉన్నారు.