గుజరాత్‌ మాజీ డీజీపీ ఆర్‌బీ శ్రీకుమార్‌కు ముందస్తు బెయిల్‌ మంజూరు

తిరువనంతపురం,ఆగస్ట్‌13(జనంసాక్షి): 1994 నాటి ఇస్రో గూఢచర్యం కేసులో గుజరాత్‌ మాజీ డీజీపీ ఆర్‌బీ శ్రీకుమార్‌కు కేరళ హైకోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. ఈ కేసులో శ్రీకుమార్‌ ఏడో నిందితుడిగా ఉన్నాడు. 1994లో అప్పటి ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్‌పై దేశద్రోహం కేసు నమోదైంది. ఇస్రో మిషన్‌లకు సంబంధించిన రహస్య సమాచారాన్ని పాకిస్థాన్‌కు చేరవేసినట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. అయితే, కేరళ పోలీసులు తనపై కుట్రచేసి కేసులో ఇరికించారని, తాను ఎవరికీ ఏ సమాచారం ఇవ్వలేదని నంబి నారాయణన్‌ తన వాదనలు వినిపించారు. దాంతో సుప్రీంకోర్టు నంబి నారాయణన్‌పై ఆరోపణలు నిజమో కాదో నిర్ధారించేందుకు ఒక అత్యున్నత స్థాయి కమిటీని వేసింది. అనంతరం ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా కేసు దర్యాప్తు బాధ్యతలను సీబీఐకి అప్పగించింది. కేసు దర్యాప్తు చేసిన సీబీఐ నంబి నారాయణన్‌పై వచ్చిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని స్పష్టంచేసింది. కేరళ పోలీసులు కుట్రపూరితంగానే నంబి నారాయణన్‌ను కేసులో ఇరికించారని వెల్లడిరచింది. ఈ మేరకు గుజరాత్‌ మాజీ డీజీపీ శ్రీకుమార్‌, ఇంటెలిజెన్స్‌ బ్యూరో మాజీ అధికారి పీఎస్‌ జయప్రకాశ్‌, ఇద్దరు కేరళ మాజీ పోలీస్‌ అధికారులు ఎస్‌ విజయన్‌, థంపి ఎస్‌ దుర్గదత్‌లను నిందితులుగా చేరుస్తూ గత ఏప్రిల్‌లో సుప్రీంకోర్టులో చార్జిషీట్‌ దాఖలుచేసింది. దాంతో వారంతా ముందస్తు బెయిల్‌ కోసం కేరళ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఇవాళ ఆ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు నిందితులందరికీ బెయిల్‌ మంజూరు చేసింది.