గుట్టకు మహర్దశ

1

మాస్టర్‌ ప్లాన్‌పై సీఎం కేసీఆర్‌ సమీక్ష

హైదరాబాద్‌,ఫిబ్రవరి24(జనంసాక్షి): యాదగిరిగుట్ట అభివృద్ధికి శరవేగంగా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ యాదగిరి గుట్ట అభివృద్ధిపై సచివాలయంలో  ఉన్నతస్థాయి సవిూక్ష జరిపారు. బుధవారం సీఎం యాదగిరి గుట్టకు వెళ్లనున్నారు. గుట్ట అభివృద్ధికి రూపొందించిన నమూనాలను పరిశీలించారు. నమూనా రూపకల్పన డిజైన్లు, ప్రణాళికలపై అధికారులతో చర్చించారు. శుక్రవారం  స్వామివారి కల్యాణానికి సీఎం పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఆగమశాస్త్రాన్ని అనుసరించి ఆలయ అభివృద్ధి పనులు చేపట్టాలని సీఎం సూచించారు. స్వర్ణదేవాలయం, అక్షరధామ్‌ ఆలయాలనూ పరిశీలించాలని సీఎం సూచించారు. గుట్టపైకి వెళ్లేందుకు, వచ్చేందుకు వేర్వేరు మార్గాలు నిర్మించాలని సూచించారు. ఒకే చోట భారీ పార్కింగ్‌ సదుపాయం కల్పించాలని అధికారులను సీఎం ఆదేశించారు. జి. కిషన్‌రావు ప్రత్యేక అధికారిగా యాదగిరి గుట్ట పట్టణాభివృద్ధి సంస్థ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వీటన్నటిని చర్చించేందుకు ముఖ్యమంత్రి యాదగిరిగుట్టకు వెళ్లనున్నారు. యాదగిరిగుట్ట అభివృద్ధిపై అక్కడి అధికారులతో సీఎం సమావేశమై చర్చించనున్నారు. ఆలయ పరిసరాలను పరిశీలించనున్నారు. ప్రస్తుతం అక్కడ బ్ర¬్మత్సవాలు జరుగుతున్నాయి. బ్ర¬్మత్సవాల్లో భాగంగా ఈ నెల 27న స్వామి వారికి సీఎం కేసీఆర్‌ పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. తిరుమల తిరుపతి తరహాలో యాదగిరిని అభివృద్ధి చేయాలని సీఎం కేసీఆర్‌ ఇప్పటికే నిర్ణయించారు.  గుట్ట అభివృద్ధి కోసం ఈ బడ్జెట్‌లో రూ.100కోట్లు కేటాయించనున్నట్లు సీఎం కేసీఆర్‌ తెలిపారు. గుట్టపైకి వెళ్లేందుకు రెండు ఘాట్‌ రోడ్లను నిర్మించాలని, గుట్ట అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీని ఏర్పాటు చేయాలని కేసీఆర్‌ ఆదేశించినట్లు తెలిసింది. గుట్ట అభివృద్ధిపై రూపొందించిన నమూనాలను సీఎం పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎం పలు నిర్ణయాలు తీసుకున్నారు. యాదగిరి గుట్ట వారసత్వ ట్రస్టు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వందేళ్ల నాటి పురాతన దేవాలయాన్ని తలపించే విధంగా గుట్ట డిజైన్‌ రూపొందించాలని అధికారులకు సీఎం సూచించారు.

దేవాలయం ఎలివేషన్‌లో అద్భుతమైన శిల్పకళలు ఉండాలని సీఎం సూచించారు. యాదగిరి గుట్ట దేవాలయ పునర్‌నిర్మాణం ఆగమశాస్త్ర నిబంధనలకు లోబడి ఉండాలన్నారు. పంజాబ్‌లోని అమృత్‌సర్‌ దేవాలయం ఢిల్లీ అక్షర్‌ధామ్‌ ఆలయాల నిర్మాణాలను అధ్యయనం చేసి డిజైన్‌లు రూపొందించాలని ఆదేశించారు. గుట్టలో సెంట్రలైజ్‌డ్‌ పార్కింగ్‌ ఏర్పాటు చేయాలని, గుట్టపైకి వెళ్లేందుకు రెండు లైన్ల రహదారిని నిర్మించాలని సూచించారు. యాత్రికుల సౌకర్యం కోసం విశ్రాంతి గదులు, వసతి గృహాలు, సకల సౌకర్యాలతో భక్తులకు బస ఏర్పాట్లు చేయాలన్నారు. గుడి చుట్టూ ఉన్న 10 ఎకరాల స్థలంలో 5 ఎకరాల విస్తీర్ణంలో కళ్యాణమండపం, యాగశాల ఏర్పాటు చేయాలని అధికారులకు సీఎం సూచించారు. సమావేశంలో స్పెషల్‌ ఆఫీసర్‌ జి. కిషన్‌రావు, స్తపతి సౌందర్య రాజన్‌, ఆర్కిటెక్ట్‌లు పాల్గొన్నారు. త్వరలోనే స్పెషల్‌ ఆఫీసర్‌ జి. కిషన్‌రావు నేతృత్వంలో యాదగిరి గుట్ట అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఏర్పాటు చేస్తామని సీఎం ప్రకటించారు.

ఆలయాల మొక్కులకోసం నిధులు

తెలంగాన ఏర్పాటు కోసం ఆలయాల్లో మొక్కులు చెల్లించడానికి తెలంగాణ ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. తిరుపతి వెంకన్న సాలెగ్రామ హారం కోసం రూ. 5 కోట్లు, భద్రకాళి అమ్మవారి రెండు కిలోల కిరీటానికి రూ. 57 లక్షలు, కురవి వీరభద్రస్వామి బంగారు విూసాలకు రూ. 75 వేలు, పద్మావతి అమ్మవారి ముక్కుపుడకకు రూ. 45 వేలు, కనకదుర్గ అమ్మవారి మొక్కు కోసం రూ. 45 వేలు మంజూరు చేసింది. నిధుల మంజూరుకు దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వీటిని ఆయా దేవాలయాలకు స్వయంగా అందచేస్తానని సిఎం కెసిఆర్‌ గతంలోనే ప్రకటించారు.