గుట్టుగా గుట్కా

 కట్టడి చేయకపోతే మాఫియాగా మారే అవకాశం…
……………………………………….
మణుగూరు, జూలై 4, (జనంసాక్షి) : దినదినాభివృద్ధి చెందుతున్న మణుగూరులో రోజురోజుకు గుట్కా చాపకింద నీరులా చేరుతోంది. దీంతో యువత చెడుదోవ పడుతున్నారు. బీదర్ నుంచి తెచ్చి విపరీతంగా మణుగూరు టౌన్, పీవీ కాలనీ, తోగ్గూడెం, అశ్వాపురం, ఏడూళ్లబయ్యారం చుట్టు పక్కల ప్రాంతాల్లో గుట్కాలను సరఫరా చేస్తుండటంతో మూడు నెలల కాలంలో డాన్లుగా మారిన వ్యాపారులను పోలీసులు కట్టడి చేశారు. అయినప్పటికీ గోలీసోడా వ్యాపారంతో మొదలైన ఏనాటి అన్నదమ్ములు తెల్లవారుజామున 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కొనసాగిస్తూ మార్కెట్లో పాన్ షాపులు నిర్వహిస్తూ రిటైలర్ గుట్కా డాన్లుగా మారుతున్నారని తెలుస్తోంది. ఇతర రాష్ట్రాల నుంచి మణుగూరుకు తెచ్చి రిటైలర్లకు గుట్కా విక్రయించే డాన్ల భరతం పట్టిన పోలీసులు మణుగూరు పట్టణంలో మెయిన్ సెంటర్లైనా సురక్షా బస్టాండ్, పూలమార్కెట్, అంబేద్కర్ సెంటర్లోని రిటైలర్ల భరతం పడితే గుట్కా రహిత మణుగూరుగా మారే అవకాశం ఉందని పలువురు చర్చించుకుంటున్నారు.
కట్టడి చేయకపోతే డాన్లుగా :
గత కొంతకాలంగా మణుగూరులోని నిఘా ఉన్న ఇంతకముందు గుట్కా వ్యాపారం చేసిన వ్యక్తులను మణుగూరు సీఐ ముత్యం రమేష్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వారి ఆట కట్టించి భారీ మొత్తంలో సరుకును కోర్టుకు స్వాధీనపరిచారు. ఈ మధ్య కూడా రాజీవ్ గాంధీనగర్ లోని ఓ ఇంట్లో నిల్వ ఉంచిన పెద్ద మొత్తంలో గుట్కా స్వాధీనం చేసుకున్నారు. అయినా గుట్కా మార్కెట్లో లభ్యమవుతుండడంపై స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు. పెద్ద మొత్తంలో సరుకును తెచ్చి మణుగూరులోని ఏనాటి అన్నదమ్ములే రిటైల్ గా చుట్టుపక్కల ప్రాంతాలకు తరలిస్తున్నారని తెలుస్తోంది. తెల్లవారుజామున 4గంటలకు మొదలైన వ్యాపారం రాత్రి 11 గంటల వరకు సాగుతూ మూడు అంబర్లు ఆరు నిషేధిత జర్ధాలు అన్నచందంగా కొనసాగుతూ ముగ్గురు ఏనాటి అన్నదమ్ములు మూడు స్టేర్ల బిల్డింగులకు అధిపతులుగా మారారని తెలుస్తోంది. కఠిన హెచ్చరికలు ఉన్నా లోకల్ మొత్తం మనదే కదా అనుకుంటున్నారో తెలీదు కానీ చాలాసార్లు పోలీసుల చేతికి చిక్కి పోలీసులు హెచ్చరించినా వారి పద్ధతిలో మార్పు రావడంలేదని మార్కెట్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. గుట్కా వ్యాపారంతో లాభాల ఆర్జనే ధ్యేయంగా యువత ఆరోగ్యం పాడు చేయడమే లక్ష్యంగా సాగుతున్న ఏనాటి అన్నదమ్ముల్లో మార్పు రానట్లు తెలుస్తోంది. పెద్ద మొత్తంలో వేరే ప్రాంతాల నుంచి సరుకు తెచ్చి ఇక్కడ అమ్మే వారిని కట్టడి చేసిన పోలీసులు వారు సరుకు తీసుకురాకపోవడంతో మార్కెట్లో, పల్లె ప్రాంతాల్లో గుట్కా ఉపయోగం తగ్గినట్లు భావిస్తున్నారు. కానీ భద్రాచలం వంటి ప్రాంతాల నుంచి సరుకు తెచ్చి చాపకింద నీరులా రిటైల్ వ్యాపారం చేస్తూ అన్ని పల్లె ప్రాంతాల వ్యాపారులకు మూడు నాలుగు ప్యాకెట్ల ద్వారా ఇస్తూ సమాజాన్ని మరింత ఊబిలోకి నెడుతున్న ఏనాటి అన్నదమ్ములపై నిఘా పెంచి గుట్కా విక్రయాలను పూర్తిగా నిలిపివేయాలని పలువురు కోరుతున్నారు.