గుల్బర్గ్‌ సోసైటీ కేసులో 24 మందికి శిక్ష ఖరారు

3

న్యూఢిల్లీ,జూన్‌ 6(జనంసాక్షి): 2002 గుల్బర్గ్‌ సొసైటీ మారణ¬మం కేసులో 24 మందికి శిక్ష ఖరారైంది.ప్రత్యేక కోర్టు జడ్జి పీబీ దేశాయ్‌ 66 మంది నిందితుల్లో 24 మందిని దోషులుగా తేల్చారు.  మిగిలిన 36 మందిని నిర్దోషులుగా తేలుస్తూ కోర్టు తీర్పునిచ్చింది. 24 మంది దోషులకు శిక్ష ఖరారుపై విచారణను ప్రత్యేక సిట్‌ కోర్టు జూన్‌9కి వాయిదా వేసింది. గుల్బర్గ్‌ సొసైటీలో జరిగిన దాడికి ఎటువంటి ప్రణాళికలు రచించలేదని, అప్పటికప్పుడు దాడి జరిగినట్లు కోర్టు తెలిపింది. దీనివెనక కుట్ర లేదని స్పష్టం చేసింది. నిందితుల్లో ఐదుగురు మరణించగా ఒకరి ఆచూకీ లేకుండా పోయింది. దోషులుగా తేల్చిన 24 మందిలో 11 మందిపై హత్య కేసును నమోదు చేయగా, 13 మందిపై సాధారణ కేసులు నమోదు చేశారు.దాదాపు ఏడేళ్ల పాటు కోర్టులో నలిగిన ఈ కేసును నలుగురు జడ్జిలు విచారించారు. 2002లో గోద్రా అల్లర్లలో సబర్మతి ఎక్స్‌ ప్రెస్‌ కు నిప్పంటించిన తర్వాతి రోజు 30 విల్లాలు, 10 అపార్ట్‌ మెంట్‌ బ్లాక్‌ లు ఉండే గుల్బర్గ్‌ సొసైటీలో అల్లర్లు చెలరేగాయి. ఈ ఘటనలో కాంగ్రెస్‌ మాజీ ఎంపీ ఎహ్సాన్‌ జాఫ్రీని దుండగులు చంపారు. ఘటనా స్థలంలో 31 శవాలు లభ్యంకాగా, జాఫ్రీ, పార్శీ బాలుడు అజార్‌ మోదీల ఆచూకీ లేకుండా పోయింది. వీరిలో 30 మంది మరణించగా ముజఫర్‌ షేక్‌ అనే బాలుడు బతికి బయటపడ్డాడు. అతని కుటుంబసభ్యులు ఆయన పేరును వివేక్‌ గా మార్చివేశారు. సుప్రీంకోర్టు వేసిన తొమ్మిది ప్రత్యేక సిట్‌ కోర్టుల్లో గుల్బర్గ్‌ కేసు ఎనిమిదోది.