గూడు కూలుస్తామంటే ఆ కుటుంబం గుండె చెదిరింది

మునిసిపల్‌ కార్యాలయం ఎదుట నిప్పంటించుకొని
సామూహిక ఆత్మహత్యాయత్నం
ఒకరి మృతి.. నలుగురి పరిస్థితి విషమం
రాజ్‌కోట్‌, (జనంసాక్షి) :
\తలదాచుకునే కాసింత చోటును కూల్చేస్తామంటే ఆ కుటుంబం గుండె చెదిరింది. గూడు కూలిస్తే దిక్కులేని పక్షుల్లా ఎక్కడికి పోతామంటూ తమకు ఆ పరిస్థితి కల్పించిన మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఎదుట బుధవారం ఐదుగురు కుటుంబ సభ్యులు సామూహికంగా నిప్పంటించుకొని ఆత్మహత్యా యత్నం చేశారు. కుటుంబ యజమాని కొది ్దసేపటి తర్వాత మృతి చెందగా, నలుగురు తీవ్రగాయాలతో చావు బతుకుల మధ్య కొట్టుమి ట్టాడుతున్నారు. రాజ్‌కోట్‌లోని చోటునగర్‌ సమీపంలో రియాధార్‌ ప్రాంతంలో భరత్‌మాన్‌ సింగ్‌(40) తన కుటుంబ సభ్యులతో కలిసి కొన్నేళ్లుగా నివాసముంటున్నాడు. ఆయన నిర్మిం చుకుంటున్న ఇంటికి ఎలాంటి అనుమతులు లేవని అధికారులు పలుమార్లు హెచ్చరించారు. అతడు నివాసం ఏర్పరుచుకున్న స్థలంతో పాటు మరికొంత స్థలాన్ని చోటునగర్‌ కో ఆపరేటివ్‌ హౌసింగ్‌ సొసైటీకి కేటాయించారు. ఈ నిర్మాణానికి ఎలాంటి అనుమతులు లేవని హౌసింగ్‌ సొసైటీ పలుమార్లు కార్పొరేషన్‌ అధికారులకు ఫిర్యాదు చేసింది. దీనిపై ఇరువర్గాలు కోర్టుకు వెళ్లగా ప్రస్తుతం కేసు నడుస్తోంది. ఈనేపథ్యంలో స్థలాన్ని ఖాళీ చేయకుంటే ఇంటిని కూల్చేస్తామని పలుమార్లు అధికారులు హెచ్చరించారు. ఇటీవల హెచ్చరికలు తీవ్రమయ్యాయి. ఈ నేపథ్యంలో భరత్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి మునిసిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయానికి చేరుకున్నాడు. వెంట తెచ్చుకున్న కిరోసిన్‌ను పైన పోసుకొని నిప్పంటించుకున్నారు. అక్కడే ఉన్న సిబ్బంది, స్థానికులు మంటలు ఆర్పి వారిని రాజ్‌కోట్‌ సివిల్‌ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ భరత్‌ మాన్‌సింగ్‌ మృతిచెందగా, అతడి భార్య పిల్లలు రేఖ, ఆశ, వసుమతి, గిరీశ్‌ మాన్‌సింగ్‌ తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నట్లు పోలీసు కమిషనర్‌ హెచ్‌పీ సింగ్‌ తెలిపారు.  కుటుంబం ఆత్మహత్యాయత్నంపై గుజరాత్‌ ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ గురువారం బంద్‌కు పిలుపునిచ్చింది. నగర కాంగ్రెస్‌ అధ్యక్షుడు జస్వంత్‌ భత్తి ఈ విషయం వెల్లడించారు. ఈ ఘటనపై స్థానిక మేయర్‌ జనక్‌ కోటక్‌ వివరణ ఇస్తూ కార్పొరేషన్‌కు, కుటుంబం ఆత్మహత్యాయత్నానికి సంబంధం లేదన్నాడు. అధికారులెవరూ అతడి కుటుంబాన్ని వేధించలేదని చెప్పాడు. కాంగ్రెస్‌ పార్టీ బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్‌ చేసింది.