గొర్రెలకు ఉచితంగా మందుల పంపిణీ

జనగామ,నవంబర్‌29(జ‌నంసాక్షి): ప్రభుత్వం గొల్ల కుర్మల ఆర్థికాభివృద్ధికి గొర్రెల యూనిట్లను అందజేసిందని వాటిని సద్వినియోగం చేసుకోవాలని పశుసంవర్ధకశాఖ జిల్లా అధికారులు అన్నారు.  వైటర్నరీ డిస్పెన్సరీలు, ఎల్‌ఎస్‌యూలలో నిండుగా మందులున్నాయని ప్రైవేటు వైద్యం చేయించవద్దని కోరారు. గొర్రెలకు ఏ వ్యాధులు సోకినా వెంటనే సంబంధిత సిబ్బందికి సమాచారం అందించాలన్నారు. గడ్డి పెంపకంపై దృష్టిపెట్టాలని సూచించారు. ఆయా గ్రామాల్లో గొర్రెలకు మందులు అందించి అవగాహన కల్పించారు. నట్టల నివారణ మందు పంపిణీ చేసి పశువులకు సాధారణ చికిత్స చేశారు. మందలను పెంచితే లబ్ధిదారులకు పేరు వస్తుందని ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని వివరించారు. ఇదిలావుంటే ఇప్పటివరకు 16వేలకుపైగా గొర్రె పిల్లలు పుట్టాయని పశుసంవర్థక శాఖ అధికారులు చెబుతున్నారు. సబ్సిడీపై గొర్రెలను పొందిన లబ్ధిదారులు వాటిని చిన్న పిల్లల మాదిరిగా కాపాడుకుంటున్నారు. ప్రతీ మందలో నాలుగు నుంచి పది గొర్రెలు ఈనాయని అధికారులు చెబుతున్నారు. గొర్రెలకు, గొ ర్రె పిల్లలకు వ్యాధులు సోకకుండా లబ్ధిదారులు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు ఎప్పటికప్పుడు చెబుతున్నారు. మంద వద్దకే వచ్చి వైద్యం చేసేందుకు సంచార పశువైద్యశాల వాహనం కూడా అందుబాటులో ఉంచి, వైద్యసేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నారు.  గ్రామాల్లో తిరిగి కుల వృత్తిని చేపట్టిన గొల్లకురుమలు గొర్రెల మందలు, పిల్లలను చూసి సంబరపడిపోతున్నారు. గొర్రెలను ఇవ్వడమే కాకుండా వాటి సంరక్షణ కోసం కావలసిన వైద్యసదుపాయాలు కల్పించడం సంతోషంగా ఉందంటున్నారు. ప్రతీ మందలో గొర్రెలు ఈని సంఖ్య పెరుగుతోందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.