గొర్రెల పంపిణీని సద్వినియోగం చేసుకోవాలి
కర్నూలు,జూలై4(జనం సాక్షి ): జిల్లాలోని చెంచులకు వందశాతం సబ్సిడీతో ఎస్టీ సబ్‌ప్లాన్ కింద మినీ గొర్రెల యూనిట్లు పంపిణీ చేస్తున్నట్లు పశుసంవర్ధకశాఖ జాయింట్ డైరెక్టర్ సుదర్శన్‌కుమార్ తెలిపారు. చెంచులకు 250 యూనిట్లను పంపిణీ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. దీనిని ఉపయోగించుకుని ఆర్థికంగా లబ్ది పొందానల్నారు. యూనిట్ కాస్ట్ రూ.30వేలు ఉండగా రూ.22,500 ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందని, మిగిలిన రూ.7,500 ఐటీడీఏ భరిస్తుందని తెలిపారు. ఆళ్లగడ్డ మండలానికి 16 యూనిట్లు, రుద్రవరం ఏడు యూనిట్లు, జూపాడుబంగ్లా 3, నందికొట్కూరు 4, ఆత్మకూరు 109, బండి ఆత్మకూరు 26, కొత్తపల్లి 18, మహానంది 1, పాణ్యం 10, శ్రీశైలానికి 26, వెలుగోడుకు 30 ప్రకారం మొత్తం 250 యూనిట్లు మంజూరయ్యాయని తెలిపారు. వీటిని పారదర్శకంగా పంపిణీ చేయాలని కిందిస్థాయి అధికారులను ఆదేశించారు.