గోదాముల సంఖ్య పెరుగుతున్న ఇంకా నిల్వ సమస్యలే
పంటల దిగుబడి కూడా కారణమంటున్న అధికారులు
ఆదిలాబాద్,జూన్27(జనం సాక్షి): తెలంగాణ ఏర్పడ్డ తరవాత ప్రభుత్వం ఆయా జిల్లాల్లో పెద్ద ఎత్తున గోదాముల నిర్మాణాన్ని చేపట్టింది. గోదాముల సంఖ్యను భారీగా పెంచింది.అయినా పంట ఉత్పత్తులు పెరగడమో లేక పక్కాఆ లెక్కలు చేయడం వల్లనో గోదాములు మాత్రం ధాన్యంకు తగ్గట్లుగా సరిపోవడం లేదని తేలింది. ఇంతకాలం మభ్యపెడుతూ వచ్చిన పాలకుల తీరు తెలంగాణ ఏర్పడ్డ తరవాత తెలిసి పోయింది. గతేడాది, మొన్నీమధ్య ధాన్యం కొనుగోళ్లను గ్రామాల వారీగా చేపట్టిన తరవాత ఇంకా గోదాముల కొరత ఏర్పడుతోంది. ఆదిలాబాద్ జిల్లాలో గోదాముల సౌకర్యం లేకపోవడం కారణంగా కందుల కొనుగోళ్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ సమస్యను పక్కన పెట్టి చూపడంతో ప్రైవేట్ వ్యాపారులు ఇదే అదనుగా రైతుల నుంచి తక్కువ ధరలకు కందులు కొనుగోళ్లు చేస్తున్నారు. జిల్లాలో పండే కంది పంటను దృష్టిలో ఉంచుకుని ముందస్తుగా కనీస జాగ్రత్తలు పాటించినట్లైతే ఇప్పుడు ఇటువంటి ఇబ్బందులు ఉండేవి కావని రైతు నాయకులు అంటున్నారు. అయితే గోదాముల సంఖ్య పెంచినా లెక్కకు మిక్కిలి కందులు,ఇతర పంటలు వస్తున్నాయని మార్క్‌ఫెడ్ అధికారులు అంటున్నారు. ఇక్కడ నిల్వ చేసుకోవడానికి గోదాములు లేకపోవడం వల్లే నిజామాబాద్‌కు తరలించడానికి గతేడాది కమిషనర్‌కు లేఖ పంపారు. అయినా రైతులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకున్నారు. ఇక్కడి గోదాములు నిండిపోవడంతో నిజామాబాద్‌కు కందులను రవాణా చేయడానికి అనుమతి ఇవ్వాలని మార్క్‌ఫెడ్ అధికారులు ప్రభుత్వానికి లేఖ పంపారు. గోదాములు నిండిపోవడంతో ఆరుబయటనే నిల్వ చేసుకోవాల్సి వచ్చింది. పదుల సంఖ్యలో కందుల లారీలు రహదారులపై వరుస కట్టాయి. మార్కెట్‌లో నిల్వలు అక్కడే ఉండిపోయాయి. కొనుగోలు చేసిన కందులను నిల్వ చేసుకోవడంలో అధికారులకు ముందు చూపులేకుండా పోయింది. ఇతర జిల్లాల నుంచి వచ్చే కందులను ఆదిలాబాద్ గోదాముల్లో నిల్వ చేయడంతో ఇక్కడ కొనుగోలు చేసిన కందుల నిల్వకు చోటు కరవైంది. కొనుగోలు చేసిన కందులను నిల్వ చేసుకునే విషయంలో అధికారులకు.. పాలకులకు ముందు చూపులేకుండా పోయింది. వాస్తవానికి జిల్లాలో కొనుగోలు చేసే పంటను నిల్వ చేసుకునే అంత సామర్థ్యం కలిగిన గోదాములు లేవు. 25వేల మెట్రిక్ టన్నుల కందిపంట దిగుబడి వచ్చే అవకాశం ఉండగా .. 20వేల మెట్రిక్ టన్నులను మాత్రమే నిల్వ చేసుకునే వీలుంది. నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, ఆసిఫాబాద్ వంటి ప్రాంతాల్లో మార్క్‌ఫెడ్ కొనుగోలు చేసిన కందులను కూడా ఆదిలాబాద్ పట్టణంలోని సీడబ్ల్యూసీ గోదాముల్లోనే నిల్వ చేశారు. నిజామాబాద్‌లో గోదాములున్నా.. అక్కడి నుంచి ఆదిలాబాద్‌కు ఎందుకు తీసుకొచ్చారనేది తెలియదు. నిర్మల్‌కు సవిూపంలోనే ఆర్మూర్‌లో గోదాములున్నాయి. కానీ నిర్మల్‌లో కొనుగోలు చేసిన కందులను ఆదిలాబాద్‌కు పంపారు. ఇక ఆసిఫాబాద్‌లో కొనుగోలు చేసిన కందులను నిల్వ చేసుకోవడానికి మంచిర్యాలలో సీడబ్ల్యూసీ గోదాములున్నా.. ఆదిలాబాద్‌కు రవాణ చేసారు. రవాణ ఖర్చులను దృష్టిలో పెట్టుకుని స్థానికంగా అందుబాటులో ఉన్న సీడబ్ల్యూసీ, ఎస్‌డబ్ల్యూసీ గోదాముల్లో నిల్వ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం చెబుతుంది. మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో ఉన్న గోదాములను పత్తి నిల్వలకు అద్దెకు ఇచ్చేసి ఇప్పుడు వెతుకులాడటం మరింత విచిత్రంగా ఉంది. అన్ని చోట్లా మార్కెట్ యార్డుల్లో కొత్తగా గోదాములు నిర్మించినా.. వాటిని ఉపయోగించకుండా రవాణ ఖర్చులు పెంచేలా చేసి ప్రభుత్వంపైన భారం మోపారు.ఆదిలాబాద్ జిల్లాలో గత యేడాది దాదాపు 30వేల హెక్టార్లలో కంది పంట సాగు చేశారు. దాదాపు 25వేల మెట్రిక్ టన్నులకు పైగా కంది పంట దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. జనవరి నుంచి ఆదిలాబాద్, జైనథ్, ఇచ్చోడ, బోథ్, ఇంద్రవెల్లి, జైనూర్ ప్రాంతాల్లో ఎఫ్‌సీఐ ఆధ్వర్యంలో మార్క్‌ఫెడ్ అధికారులు కందులు కొనుగోలు చేస్తున్నారు. కొనుగోలు చేసిన కందులను సీడబ్ల్యూసీ, ఎస్‌డబ్ల్యూసీ గోదాముల్లో నిల్వ చేయాల్సి ఉంటుంది. ఆదిలాబాద్ పట్టణంలో 20వేల మెట్రిక్ టన్నుల నిల్వ చేసుకునే గోదాములు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ దశలో పంటలకు అనుగుణంగా గ్రామస్థాయిలో గోదాముల సంఖ్యను పెంచాల్సి ఉంది.
—————-