గోదావరిలో అడుగంటిన నీరు
పట్టణ ప్రజలకు మంచినీటిపై ఆందోళన
ప్రత్యామ్నాయ చర్యలకు దిగిన అధికారులు
భద్రాద్రికొత్తగూడెం,జనవరి31(జనంసాక్షి): భద్రాచలం వద్ద గోదావరి ఎడారిని తలపిస్తోంది. దీంతో పట్టణ నమంచినీటి సరఫరాకు అప్పుడే ఇక్కట్లుమొదలయ్యాయి. గోదావరి నీటిని భద్రాచలంలోని వివిధ కాలనీలకు తరలించి పట్టణ వాసులకు తాగునీటిని అందిస్తున్నారు. పట్టణంలోని సుమారు 4వేల కనెక్షన్ల ద్వారా ఈశాఖ మంచినీటిని ప్రజలకు అందజేస్తోంది. ఇటీవల మిషన్ భగీరథ ద్వారా 55 కిలోవిూటర్లకు డిస్టిబ్యూష్రన్ లైన్ల ద్వారా నీటిని అందించే పక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 35 కిలోవిూటర్ల వరకు పైపులైన్ నిర్మాణం జరిగింది. ఏప్రిల్ 1 నుంచి మిషన్ భగీరథ స్కీమ్ పట్టణంలో తాగునీటి సరఫరా స్కీమ్ మళ్లించనున్నారు. గోదావరిలో నీటిమట్టం ప్రస్తుతం 6.2 అడుగులు ఉందని, గతంతో పోలిస్తే కొద్దిగా తగ్గుముఖం పట్టిన మాట వాస్తవమని ఇరిగేషన్ ఏఈ ఏ.వెంకటేశ్వర్లు తెలిపారు. ఇంకా ఎండా కాలం ప్రారంభం కాకముందే గోదావరిలో ఇసుక మేటలు వేశాయి. పట్టణంలో తాగునీటికి గోదావరి నీళ్లే ఆధారం కావడంతో ప్రస్తుత నీటి మట్టాలు చూస్తే ఆందోళన కలుగుతోంది. కాగా నీటిని అందించే ఇన్‌వెల్ వద్ద నీరు మరింత తగ్గుముఖం పట్టింది. మోటార్లకు నీళ్లు అందడంలేదు. అధికారులు ప్రత్యమ్నయం చర్యలు చేపట్టి ఇన్ వెల్ సవిూపంలో ఉన్న ఇసుక తిన్నెలను తొలగించి గోదావరి నీటిని తిరిగి మళ్లించేందుకు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. గత కొద్ది రోజులుగా గోదావరి నీటిమట్టం స్వల్పంగా తగ్గుతూ వస్తోంది. భద్రాచలం వద్ద నిర్మిస్తున్న రెండవ వంతెన పక్కనే గోదావరి నుంచి నీటిని మళ్లించే ఇన్‌వెల్ ఉంది. ఇక్కడ మోటార్ల నుంచి నీటిని తోడి పట్టణానికి సరఫరా చేస్తుంటారు. అయితే ఈ ఇన్‌వెల్ సవిూపంలో నీటి నిల్వలు బాగా పడిపోయాయి. దీనికి పక్కనే ఇసుక మేటలు భారీగా వేయడంతో నీళ్లు ఇన్ వెల్ సవిూపంలోకి రాకుండా ఆమడ దూరంలో నీళ్లు మర్లుతున్నాయి. దీంతో ఇన్ వెల్ వద్ద ఉన్న మూడు మోటార్లకు నీరు అందడంలేదు.
యథావిధిగా నీటిని సరఫరా చేసేందుకు అధికారులు ప్రత్యామ్నాయ చర్యలపై నిమగ్నమయ్యారు.