గోదావరి జలాలతో పెరిగిన వ్యవసాయం

చెరువులు నీటితో కళకళ లాడుతున్నాయి

మరోమారు గెలిపిస్తే మరింత అభివృద్ది: ఎర్రబెల్లి

జనగామ,నవంబర్‌22(జ‌నంసాక్షి): జనగామ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు గోదావరి జలాలతో చెరువులు నింపే కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్‌ ఆశీస్సులతో ఒక యజ్ఞంలా చేపడుతున్న ఫలితంగా రైతులు సంతోషంగా ఉన్నారని ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయకర్‌ రావు అన్నారు. ప్రతీఏటా గోదావరి జలాలతో చెరువులను నింపుతున్నఫలితంగా గతేడాది యాసంగిలో జనగామ మార్కెట్‌కు 1.50లక్షల మెట్రిక్‌ టన్నుల వరిధాన్యం వచ్చిందన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఏ పనిచేయని ప్రతిపక్షాలు రాష్ట్రంలో రైతులు, కార్మికులు, అన్నివర్గాల సంక్షేమానికి పాడుపడుతుంటే చూసి ఒర్వలేక అవాకులు చవాకులు పేలుతున్నారన్నారు. మనకు రావాల్సిన 400టీఎంసీల నీటివాటాను ఆంధ్రా పాలకులు వాడుకుంటున్న ఫలితంగా తెలంగాణ రాష్ట్రం 4లక్షల ఎకరాల సాగును నష్టపోతుందని, అలాంటి అంశాలు మాట్లాడకుండా

ప్రతిపక్షాలు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారంతో విషం చిమ్ముతున్నాయని అన్నారు.

అభివృద్ధిలో భాగస్వాములయ్యేందుకు టీడీపీ ముఖ్యనేతలు, కాంగ్రెస్‌ నేతలు టీఆర్‌ఎస్‌లో చేరిన వారిని

చూసి ప్రతిపక్షాలు సోయి తెచ్చుకోవాలని ఆయన హితవు పలికారు. పాలకుర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడంతో పాటు అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి కృషిచేశామని, ఈ ఎన్నికల్లో తనకు మరోమారు ఓటు వేసి ఆదరించాలని కోరారు. ఆయా గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ చేసిన అభివృద్ధిని వివరిస్తూ ప్రచారం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్నారు. అర్హులైన వారికి డబుల్‌బెడ్‌రూం నిర్మించి ఇస్తామన్నారు. రూ. వెయ్యి ఆసరా పింఛన్‌ రూ.2016కు పెంచుతామన్నారు. రైతు బంధు ఆర్థిక సహాయాన్ని రూ.8 వేల నుంచి రూ.10వేలకు పెంచుతామన్నారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి కింద ప్రతినెలా రూ. 3016 అందిస్తామన్నారు. మహాకూటమి నాయకులు మాయమాటలు చెప్పి రూ.2 లక్షల రుణమాఫీ అని గ్రామాల్లోకి వస్తారని… వారికి ఓటుతో గుణపాఠం చెప్పాలన్నారు. ఎన్నికల అనంతరం రూ.లక్ష ఒకేసారి రుణమాఫీ చేస్తామన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మహిళల సంక్షేమానికి కృషిచేస్తోందన్నారు. వారి కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తున్నామన్నారు. అంతకు ముందు ఆయా గ్రామాల్లో ఎర్రబెల్లికి ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు.