గోధుమలు, వాల్‌నట్స్‌పై దిగుమతి సుంకం పెంపు

న్యూఢిల్లీ, మే24(జ‌నం సాక్షి) : విదేశీ దిగుమతుల సెగ నుంచి దేశీయ రైతులను ఆదుకునేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే గోధుమలు, వాల్‌నట్స్‌ దిగుమతులపై సుంకాన్ని పెంచేసింది. గోధుమలపై కస్టమ్స్‌ సుంకాన్ని 30శాతానికి, వాల్‌నట్స్‌పై 100శాతానికి పెంచుతున్నట్లు సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎక్సైజ్‌ అండ్‌ కస్టమ్స్‌(సీబీఈసీ) బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత నోటిఫికేషన్‌ జారీ చేసింది.ప్రస్తుతం గోధుమ దిగుమతులపై 20 శాతం సుంకం ఉండగా.. తాజాగా దాన్ని 30శాతానికి పెంచారు. ఇక వాల్‌నట్స్‌పై సుంకాన్ని 30శాతం నుంచి 100శాతానికి పెంచారు. ఈ ఏడాది దేశంలో గోధుమ ఉత్పత్తి రికార్డు స్థాయిలో ఉంది. మరోవైపు రష్యా లాంటి దేశాల్లోనూ గోధుమలు ఎక్కువగానే పండాయి. ఇలాంటి పరిస్థితుల్లో అంతర్జాతీయ మార్కెట్ల నుంచి తక్కువ ధరకే గోధుమలను దిగుమతి చేసుకుంటే.. దేశీయ రైతులకు గిట్టుబాటు కాదని ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలోనే దిగుమతి సుంకాలను పెంచేసింది. ఈ విధానంతో విదేశాల నుంచి గోధుమలు, వాల్‌ నట్స్‌ను దిగుమతి చేసుకోవటం వ్యాపారులకు కొంత భారం కానుంది.