గౌరీ కేసులో దర్యాప్తు ముమ్మరం

ఒక్కొక్కరినే అరెస్ట్‌ చేస్తున్న సిట్‌

బెంగళూరు,జూన్‌5(జనం సాక్షి): సీనియరు పాత్రికేయురాలు గౌరీ లంకేశ్‌ హత్య కేసులో దర్యాప్తు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. అనుమానితలు వేటలోనే పోలీసులు ఉన్నారు. ఇప్పటివరకు పలువురిని అరెస్ట్‌ చేసి విచారణ చేస్తున్నా అసలు హంతకుల జాడ తెలియరాలేదు. గౌరీ లంకేశ్‌ హత్యకు గురైన తొమ్మిది నెలల తరువాత నిందితులు ఒక్కరొక్కరినే సిట్‌ అదుపులోకి తీసుకుంటోంది. గౌరీ హత్యకు బుల్లెట్లు ఎక్కడ కొనుగోలు చేశారు? హత్యలో ఎంత మంది పాల్గొన్నారు? హత్య వెనుక సూత్రధారి ఎవరు తదితర అంశాలను గుర్తించేందుకు విచారణను తీవ్రం చేశారు. ఇదిలావుంటే ఈ కేసులో మరో అనుమానితుడు ప్రవీణ్‌ కుమార్‌ అలియాస్‌ సుజిత్‌ను ప్రత్యేక దర్యాప్తు దళం అరెస్టు చేసింది. అతని నుంచి మరిన్ని వివరాలను రాబట్టేందుకు అనువుగా న్యాయమూర్తి ముందు హాజరు పరచిన అధికారులు.. అనంతరం అదుపులోకి తీసుకున్నారు. రహస్య ప్రదేశానికి తరలించి విచారణ ప్రారంభించారు. గౌరీ హత్య కేసులో కె.టి.నవీన్‌కుమార్‌ అలియాస్‌ హళట్టె మంజ మొదటి నిందితుడు. ప్రవీణ్‌ రెండో నిందితుడిగా ఇప్పటికే అభియోగపత్రంలో పోలీసులు పేరు చేర్చారు. మరో ముగ్గురు అనుమానితులను ప్రత్యేక దర్యాప్తు దళం అదుపులోకి తీసుకుని విచారిస్తుండడం ప్రస్తావనార్హం. ప్రవీణ్‌ నుంచి రూ.22,931 నగదు, రెండు సంచులు, రెండు సిమ్‌ కార్డులు, నాలుగు చరవాణులు, రెండు బ్యాటరీ ఛార్జర్లు, మూడు పాస్‌పోర్టు ఫొటోలు, ఆయా టెలికాం ఆపరేటర్ల రీఛార్జ్‌ టాప్‌ అప్‌ ఓచర్లు, చరవాణి సంఖ్యలను రాసి ఉన్న చిన్న డైరీలు, హిందీ, ఆంగ్లంలో రాసుకున్న కొన్ని అంశాలు, అమోల్‌ కాళే పేరిట ఉన్న డ్రైవింగ్‌ లైసెన్సు నకలు ప్రతిని స్వాధీనపరచుకున్నారు. సాహితీవేత్త ఎం.ఎం.కలబురిగి, విలేకరి గౌరీ లంకేశ్‌ హత్య కేసులతో పాటు, మరోసాహితీవేత్త కె.ఎస్‌.భగవాన్‌ను హత్య చేసేందుకు నిందితులు క్రమం తప్పకుండా గోవా, మహారాష్ట్ర, విజయపుర, బెళగావి, బెంగళూరు, మైసూరు తదితర ప్రాంతాల్లో సమావేశమయ్యేవారని ప్రత్యేక దర్యాప్తు దళం అధికారులు గుర్తించారు.

———————————-