గ్రామగ్రామాన కాంగ్రెస్‌ను బహిష్కరిస్తూ తీర్మానం

టీ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌
హైదరాబాద్‌, జూన్‌ 27 (జనంసాక్షి) :
తెలంగాణ ఇవ్వకపోతే గ్రామగ్రామాన కాంగ్రెస్‌ను బహిష్కరిస్తూ తీర్మానం చేస్తామని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడేంత వరకు అధికార కాంగ్రెస్‌ పార్టీపై ఒత్తిడి కొనసాగిస్తూనే ఉంటామని పేర్కొన్నారు. గురువారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డితో ఆయన భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, వచ్చే నెల 4న ఢల్లీిలో నిర్వహిస్తున్న రౌండ్‌ టేబుల్‌ సమావేశంపై కిషన్‌రెడ్డితో చర్చించినట్టు తెలిపారు. ముఖ్యంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వకపోతే గ్రామ గ్రామాన కాంగ్రెస్‌ పార్టీని బహిష్కరించాలని తీర్మానాలు చేస్తామని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా పార్లమెంట్‌లో తెలంగాణపై బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ కాంగ్రెస్‌ ప్రజా ప్రతినిధులు నిజాం కాలేజీలో సమావేశం పేరుతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ముఖ్యంగా జాతీయ స్థాయిలో కాంగ్రెసేతర పక్షాలతో తెలంగాణపై చర్చిస్తామని అన్నారు. తెలంగాణ ప్రజలు ఎలాంటి ప్యాకేజీలు కోరుకోవడం లేదని, హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాల తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకుంటున్నారని అన్నారు. కిషన్‌రెడ్డి మాట్లాడుతూ, ఓట్లు, నోట్లు పేరుతో తెలంగాణ ఉద్యమానికి నష్టం కలిగిస్తున్నదని విమర్శించారు. ఎన్నికలకు ముందే తెలంగాణ ప్రక్రియను ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల సమయంలో ఓట్ల గురించి ఆలోచించాలి కానీ తెలంగాణ ఏర్పడే ముందు నోట్ల గురించి ఆలోచిస్తే తెలంగాణ ఉద్యమానికే నష్టమని అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకే తెలంగాణ జేఏసీ స్వతంత్రంగా వ్యవహరిస్తోందని తాను భావిస్తున్నట్టు తెలిపారు. ఉద్యమాన్ని నీరుగార్చే విధంగా తెలంగాణ జేఏసీ నేతలు రాజకీయ పార్టీల్లో ఇప్పటి నుంచే చేరడం తగదని అన్నారు. ఎన్నికల సమయంలో చేరితే తమకు అభ్యంతరం లేదని అన్నారు. తెలంగాణ బిల్లుపై రాష్ట్రపతి సంతకం పెట్టే వరకు తమ ఉద్యమం కొనసాగిస్తామని కిషన్‌రెడ్డి స్పష్టంచేశారు. ప్యాకేజీల పేరుతో తెలంగాణ ప్రజలను మభ్యపెట్టేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోందని విమర్శించారు. కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని కిషన్‌రెడ్డి అన్నారు. ముఖ్యంగా తెలంగాణ ఆత్మగౌరవం కోసం విద్యార్థులు సంఘటితం కావాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ రాలేదని ఆత్మహత్యలకు పాల్పడితే ఉద్యమానికే తీవ్ర నష్టమని అన్నారు. విద్యార్థులు రాజకీయ శక్తిగా ఎదిగి ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసి తెలంగాణ ఏర్పాటు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.