గ్రామస్థాయికి భూసేకరణం
ప్రముఖ సామాజికవేత్త అన్నాహజారే
ఉత్తరప్రదేశ్, ఫిబ్రవరి 27(జనంసాక్షి): ”ప్రధాని నరేంద్రమోదీకి నేనంటే మంట…. భూ సేకరణ బిల్లుపై నా సలహాలను ఆయన అంగీకరించర”ని సామాజిక కార్యకర్త, అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అన్నా హజారే చెప్పారు. బలవంతపు భూ సేకరణకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని ఆయన ఆరోపించారు. అందుకే తమ ఉద్యమాన్ని గ్రామాల్లోకి తీసుకువెళ్లేందుకు సిద్ధమయ్యామని బిజ్నోర్‌లో ఆయన తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్ ప్రాంతంలో అన్నా హజారే పర్యటించారు. అక్కడ బహిరంగ సభలో ప్రసంగించారు. భూసేకరణ బిల్లుకు వ్యతిరేకంగా సాగిస్తున్న ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆయన ప్రకటించారు. ఉద్యమాన్ని గ్రామ గ్రామానికి విస్తరించేందుకు 8 మందితో కూడిన కమిటీ వేస్తామని ఆయన ప్రకటించారు. మోదీ, రాహుల్ ఇద్దరూ పారిశ్రామిక వేత్తలకు కొమ్ము కాస్తున్నారని నేను ఎన్నికల సమయంలోనే అన్నానని అన్నా హజారే ఈ సందర్భంగా గుర్తు చేశారు. వీళ్లు దేశ భవిష్యత్తుకు దిశానిర్దేశం చేయలేరని నేను అనాడే చెప్పానని ఆయన అన్నారు. వీరి నెత్తిన పారిశ్రామిక వేత్తలు తిష్టవేశారని అన్నా విమర్శించారు.