గ్రామాల్లో పరిష్కరించబడని సమస్యలెన్నో

మొండి గౌరెల్లి గ్రామంలోని 5 వార్డులో తిరిగి ప్రజల  సమస్యలు తెలుసుకున్న బిఎస్పీ  నాయకులు
రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం, జులై     (జనంసాక్షి): గ్రామాల అభివృద్ధికై ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి పనుల్లో పరిష్కరించబడని పల్లె పనులెన్నో గ్రామాల్లో తిష్టవేశాయని బిఎస్పి నాయకులు పేర్కొన్నారు.  ఆదివారం మొండిగౌరెల్లిలోని 5వ వార్డులో నెలకొని ఉన్న ఆయా సమస్యలను గ్రామ బీఎస్పీ కన్వీనర్ మండల భాస్కర్, కో కన్వీనర్ కట్టెల నరేష్ ఆధ్వర్యంలో పలు సమస్యలను గడపగడపకు తిరుగుతూ గుర్తించారు. ఈ మేరకు వారు మాట్లాడుతూ వివిధ విడతలలో పల్లె ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించినా అధికారులు సమస్యలు గాలికి వదిలేశారన్నారు. వార్డులో  ఓ ఇంటి పైనుంచి కరెంటు వైర్లు కదులుతున్నాయని వర్షాకాలంలో కరెంటు స్తంభాలు ఎప్పుడు కూలిపోతాయోనన్న ఆందోళనలో  అక్కడి కుటుంబాలవాళ్ళు  ఉన్నారన్నారు. మరో ఇంటి ముందు డ్రైనేజీలు  లేకపోవడంతో విపరీతంగా దోమల బెడద పెరిగిందని ఇంకో ఇంటి పక్క ప్రమాదకరంగా నెలకొని  ఉన్న బావితో పాములు, తేళ్లకు ఆవాసమైందని గత మూడు నాలుగు నెలలుగా మరో ఇంటి వద్ద విద్యుత్ స్తంబానికి వీది లైటు వెలగడం లేదని పలు చోట్ల గడ్డి, పిచ్చి మొక్కలు పెరిగి పాములకు, తేళ్లకు ఆవాసలయ్యాయని ఆ నాయకులు పేర్కొన్నారు. గ్రామ అభివృద్ది, సంక్షేమం కోసమే సమస్యలు గుర్తించామని వారు అన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ బీవీఎఫ్ కన్వీనర్ లోకేష్, మండల కన్వీనర్ జీ. ప్రవీణ్, మండల సెక్టార్ అధ్యక్షులు కె. ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
గ్రామ సర్పంచ్ బండిమీద కృష్ణ మాట్లాడుతూ
పంచాయతీ సిబ్బందితో రోడ్డుకు ఇరువైపులా ఉన్న పిచ్చి మొక్కలను ఎప్పటికప్పుడు తొలగింప చేస్తున్నాం. ఖాళీ స్థలాలు ఉన్న ఇంటి యజమానులకు అనేకమార్లు నోటీసులు ఇవ్వడం జరిగింది. సమస్యలు పట్టించుకోవడం లేదన్నది అవాస్తవం. గతంలో కన్నా పంచాయతీలో మెరుగైన అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం. వర్షం వచ్చినప్పుడు ఖాళీ స్థలాల్లో పిచ్చి మొక్కలు మొలవడాన్ని ప్రజలు గమనించాలి. ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని అన్నారు