గ్రామాల అభివృద్ధి ప్రభుత్వ ధ్యేయం
– అవినీతిలేని అభివృద్ధికి సర్పంచ్‌లు కృషిచేయాలి
– పంచాయతీరాజ్ చట్టాలు కఠినతరం చేశాం
– ఎవరు చిన్నతప్పు చేసినా చర్యలు తప్పవు
– పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
జనగామ, మార్చి4(జనంసాక్షి) : గ్రామాలను అభివృద్ధి పథంలో నిలుపడమే ద్యేయంగా కృషిచేస్తానని పంచాయతీరాజ్ శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. దేవరుప్పుల మండలం కేంద్రంలో తిరుమల గార్డెన్స్ లో టీఆర్‌ఎస్ పార్టీ అత్మీయ సభ సోమవారం జరిగింది. ఈ సభలో పాల్గొని మంత్రి
మాట్లాడారు.. భారీ విజయాన్ని అందించిన పాలకుర్తి ప్రజలకు పాదాభివందనం అంటూ కృతజ్ఞతలు చెప్పారు. గ్రామాల్లోని స్థితిగతులను ఎరిగినవాడిగా.. గ్రామాల సమస్యలు తీర్చేందుకు అహర్నిశలు కృషిచేసి సీఎం కేసిఆర్ తో శభాష్ అనిపించుకుంటానన్నారు. సర్పంచ్ లకు అధికారాలు, నిధులు ఇస్తున్నామని, గ్రామాల్లో అవినీతిలేని అభివృద్ధికి కృషిచేయాలని మంత్రి సూచించారు. సర్పంచ్‌లు, గ్రామ కార్యదర్శులు స్థానికంగా ఉండి.. గ్రామాల్లో సేవలందించి ప్రజల మన్ననలు పొందాలని మంత్రి తెలిపారు. నేడు పంచాయతీరాజ్ చట్టాలు కఠినంగా ఉన్నాయని, ఎవరైనా తప్పులు చేస్తే పదవి పోయినట్లేని మంత్రి హెచ్చరించారు. తనపై మరింత బాధ్యత పెరిగిందని, నాపై నమ్మకంతో సీఎం కేసీఆర్ ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని అన్నారు. పాలకుర్తి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాని ఎర్రబెల్లి తెలిపారు. నారాజకీయ జీవితంలో ఏ తప్పూ చేయలేదని, కార్యకర్తలు కూడా ఎలాంటి తప్పులు చేయవద్దని, నాకు చెడ్డపేరు తేవద్దంటూ ఎర్రబెల్లి విజ్ఞప్తి చేశారు. ఎవరికి ఏ ఇబ్బందులు ఎదరైనా నేనున్నానంటూ కార్యకర్తలకు బరోసా ఇచ్చారు.