గ్రీన్‌హౌజ్‌ల తో కూరగాయల సాగు
వరంగల్,జూన్15(జనంసాక్షి): ఉద్యానపంటలను ప్రోత్సహించేందుకు పలు మండలాల పరిధిలోని
రైతులకు గ్రీన్‌హౌజ్ పథకం అమలుచేస్తున్నట్లు ఉద్యానశాఖ అధికారులు పేర్కొన్నారు. ఒక రైతుకు గరిష్టంగా మూడు ఎకరాల వరకు మాత్రమే ఇస్తున్నట్లు తెలిపారు. గ్రీన్ హౌజ్ నిర్మాణానికి బిందు పరికరాలు, ప్లాంటు సామగ్రి కింద ఇందులో 75శాతం రాయితీకింద ప్రభుత్వం చెల్లిస్తుంది. మిగితా 25శాతంలో రైతు వాటాకింద చెల్లించాల్సి ఉంటుంది. రైతులనుంచి వచ్చే డిమాండ్‌ను బట్టి యూనిట్లను కేటాయిస్తామని తెలిపారు. ఆయా మండలాల రైతులు మాత్రమే సంబంధిత ఉద్యానశాఖ అధికారుల వద్ద దరఖాస్తు చేసుకోవాలన్నారు. నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ తరహా పంటలను ప్రోత్సహిస్తారు. జిల్లాలో కరవు ప్రాంత మండలాల్లో అమలు కోసం జిల్లాకు మొదటిసారి గ్రీన్‌హౌజ్ యూనిట్లను ప్రభుత్వం మంజూరుచేసింది. రైతులకు గ్రీన్‌హౌజ్‌లను అందుబాటులోకి తెచ్చేందుకు 75శాతం రాయితీపై ఈ యూనిట్‌లను మంజూరుచేస్తుంది. వివరాలకు హన్మకొండలోని జిల్లా ఉద్యాన శాఖ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. ఇదిలావుంటే తెలంగాణ రాష్ట్రంలో చెరువుల పూడికతీత పనులకు మంచి స్పందన వచ్చిందని, జిల్లాలో అనేక చెరువుల్లో తవ్వకాలు విజయవంతంగా చేపట్టామని అధికారులు చెప్పారు. రైతులు ట్రాక్టర్లను ఏర్పాటుచేసుకుని పూడిక మట్టిని పొలాలకు తరలించుకున్నారు. మిషన్ కాకతీయలో ఎంపిక చేసిన చెరువుల్లో పూడికతీత చేపట్టారు. చెరువుల పూడికతీత పనులు ఏటా చేపడుతామన్నారు.