గ్రూప్‌వన్‌లో అవకతవకలపై హైకోర్టులో పిటిషన్లు..

విచారాణ నేటికి వాయిదా
` ఎలాంటి అక్రమాలు జరగలేదని ధర్మాసనానికి టీజీపీఎస్సీ వివరణ
హైదరాబాద్‌(జనంసాక్షి):తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ గ్రూప్‌-1 పిటిషన్లపై విచారణను హైకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. తెలుగు విూడియం అభ్యర్థులకు సరైన మార్కులు వేయలేదని పలువురు దాఖలు చేసిన పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం విచారణ జరిపింది. ఈ సందర్భంగా టీజీపీఎస్సీ తరఫున సీనియర్‌ న్యాయవాది ఎస్‌.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. పరీక్ష రాసిన అభ్యర్థుల సంఖ్య విషయంలో ఎలాంటి తేడా లేదన్నారు. నామినల్‌ రోల్స్‌, అభ్యర్థుల వేలిముద్రల ఆధారంగా పూర్తి వివరాలు వెల్లడిరచినట్లు చెప్పారు. కోఠిలోని ఓ కేంద్రంలో పరీక్ష రాసిన వారే ఎక్కువ మంది ఎంపికయ్యారనేది అవాస్తవం. అక్కడ ఉన్న రెండు కేంద్రాలలో 1500 మంది అభ్యర్థులు మెయిన్స్‌ రాశారు. మిగతా పరీక్షా కేంద్రాల్లో రాసిన వాళ్లలో అంతకంటే ఎక్కువ మందే ఎంపికయ్యారు. కోఠిలోని రెండు కేంద్రాలను కేవలం మహిళలకు కేటాయించడంతో సౌకర్యాలను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నాం. ఉద్యోగానికి ఎంపిక కాని అభ్యర్థులు ఏవేవో అనుమానాలతో పిటిషన్లు దాఖలు చేశారు. వారు చేస్తోన్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవాలు లేవు. కేవలం అపోహలు మాత్రమేనని వాదించారు. గ్రూప్‌ 1కు ఎంపికైన తెలుగు విూడియం అభ్యర్థులు 9.95 శాతం, ఆంగ్ల మాధ్యమం అభ్యర్థులు 89.88 శాతం, ఉర్దూ మాధ్యమంలో 0.1 శాతంగా ఉన్నారు. ఏపీలో రెండేళ్ల క్రితం నిర్వహించిన ఏపీపీఎస్సీ పరీక్షల్లోనూ ఆంగ్ల మాధ్యమ అభ్యర్థులే ఎక్కువగా ఉన్నారు. టీజీపీఎస్సీకి తెలుగు, ఇంగ్లిష్‌, ఉర్దూ మాధ్యమ అభ్యర్థుల పట్ల ఎలాంటి వివక్ష లేదు. అందరికీ నిపుణులు ఎంపిక చేసిన అంశాల ఆధారంగా మార్కులు వేశారని కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం.. ఎవాల్యుయేటర్‌కు ఏమైనా మార్గదర్శకాలున్నాయా అని ప్రశ్నించింది. టీజీపీఎస్సీ నుంచి వివరాలు తీసుకొని సీల్డ్‌ కవర్‌లో సమర్పిస్తామని నిరంజన్‌రెడ్డి కోర్టుకు తెలిపారు. దీంతో విచారణను ఉన్నత న్యాయస్థానం నేటికి వాయిదా వేసింది.