గ్లోబల్‌ సిటీగా హైదరాబాద్‌


– టీఆర్‌ఎస్‌ తీసుకువచ్చిన విధానాలతోనే సాధ్యమైంది
– శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్‌ ఒకటి
– ఆర్ధిక వృద్ధిరేటులో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచాం
– శంషాబాద్‌ వరకు మెట్రోరైలును పొడగిస్తాం: కేటిఆర్‌
హైదరాబాద్‌, డిసెంబర్‌1(జ‌నంసాక్షి) : హైదరాబాద్‌ అన్ని రకాలుగా అనుకూలమైన నగరమని, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పారిశ్రామిక విధానాలతో హైదరాబాద్‌ గ్లోబల్‌ సిటీగా మారిందని ఆపద్ధర్మ మంత్రి కేటిఆర్‌ అన్నారు. శనివారం మాదాపూర్‌ లో నిర్వహించిన స్పిరిట్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ కార్యక్రమంలో ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్‌ పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి ఐటీ కంపెనీల సీఈవోలు, బిజినెస్‌ హెడ్స్‌, ఐటీ ఉద్యోగులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. దేశంలోనే హైదరాబాద్‌ కు ఓ ప్రత్యేకత ఉందన్నారు.  ప్రపంచంలోనే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్‌ ఒకటన్నారు.
మైక్రోసాఫ్ట్‌ లాంటి ప్రముఖ కంపెనీలు హైదరాబాద్‌ లో తమ సేవలు విస్తరించాయని కేటీఆర్‌ తెలిపారు. దేశ జీడీపీలో అధిక శాతం మెట్రో పాలిటన్‌ నగరాలదే అని చెప్పారు. క్వాలిటీ ఆఫ్‌ లివింగ్‌ లో హైదరాబాద్‌ ది బెస్ట్‌ అని కేటీఆర్‌ స్పష్టం చేశారు. ఏడాదిలోనే హైదరాబాద్‌ మెట్రోలో మూడు కోట్ల మందికి పైగా ప్రయాణించారన్నారు. హైదరాబాద్‌ లో మెరుగైన మౌలిక వసతులు కల్పిస్తామని కేటీఆర్‌ తెలిపారు. నగరంలో కాలుష్యం తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టు వరకు మెట్రో లైన్‌ పొడిగిస్తామని చెప్పారు. మెట్రోలో ఎలివేటెడ్‌ బస్‌ ట్రాన్స్‌ పోర్టు సిస్టమ్‌ తెస్తామన్నారు.
రాష్ట్ర ఆదాయంలో 43శాతం సంక్షేమం కోసం వినియోగిస్తున్నామని పేర్కొన్నారు. ఆర్థిక వృద్ధి రేటులో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని స్పష్టం చేశారు. జిల్లాల్లోనూ ఐటీ కారిడార్లు విస్తరించి యువతకు ఉపాధి కల్పిస్తామన్నారు. కరెంట్‌ కోతల కాలం నుంచి మిగులు విద్యుత్‌ దిశగా రాష్ట్రాన్ని తీసుకొచ్చామని తెలిపారు. జూన్‌ లోగా కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తవుతుంది. ప్రాణహిత – చేవెళ్లను 16 టీఎంసీల సామర్థ్యంతో డిజైన్‌ చేశారన్నారు. రీ డిజైనింగ్‌ తో 160 టీఎంసీల సామర్థ్యంతో ప్రాజెక్టులు కడుతున్నామని తెలిపారు. టీఆర్‌ఎస్‌ తీసుకువచ్చిన విధానాలతోనే హైదరాబాద్‌ గ్లోబల్‌ సిటీగా మారిందని కేటీఆర్‌ స్పష్టం చేశారు. విభిన్న రంగాల్లో యువతను ప్రోత్సహిస్తున్నామని, యువ పారిశ్రామికవేత్తలకు సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. ఇతర నగరాలతో పోల్చుకుంటే మౌలిక వసతులు బాగా ఉండటంతో ట్రాఫిక్‌ సమస్య లేదని తెలిపారు.  నైపుణ్యమున్న ఐటీ నిపుణులు ఉండటంతో హైదరాబాద్‌ ఐటీకి అడ్వాంటేజ్‌ అని పేర్కొన్నారు. బ్యాడ్మింటన్‌ క్రీడాకారులు సైనా నెహ్వాల్‌, కశ్యప్‌లు తనను కలిసి వారి వివాహానికి ఆహ్వానించారని కేటీఆర్‌ తెలిపారు. ‘దేశంలోని ఇతర పట్టణాలతో పోల్చితే ఐటీ ఫాస్ట్‌ గ్రోయింగ్‌ సిటీ హైదరాబాద్‌. త్వరలో ఐటీ కారిడార్‌లో మొత్తం ఎలక్టాన్రిక్‌ వాహనాలను ఉపయోగిస్తామన్నారు. క్రీడలతో పాటు ఐటీ కారిడార్లను విస్తరిస్తాం, యువతకు ఉద్యోగాలు కల్పిస్తాం. వివిధ రంగాల్లో యువతను ప్రోత్సహిస్తున్నాం. భవిష్యత్తు తరాలకు ఉపయోగపడేలా మా నిర్ణయాలు ఉంటాయని కేటీఆర్‌ తెలిపారు. ఈ ఎన్నికల్లో ప్రజలు టిఆర్‌ఎస్‌నే గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని కేటీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు.