ఘనంగా గోదావరి పుష్కరాలు
సీఎం కేసీఆర్ సమీక్ష
హైదరాబాద్,ఫిబ్రవరి5(జనంసాక్షి): కొత్త రాష్ట్రం తెలంగాణలో తొలిసారిగా నిర్వహించబోయే గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ఇవాళ గోదావరి పుష్కరాలపై సీఎం కేసీఆర్ సవిూక్ష జరిపారు. ఈ సమావేశానికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హాజరయ్యారు. ఈ సమావేశంలో గోదావరి పుష్కరాలకు కేంద్రం నుంచి నిధులు కోరే అంశంపై చర్చించారు. అనంతరం దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి విూడియాతో మాట్లాడారు. గోదావరి పుష్కరాలకు నిధులను కేటాయించామని మంత్రి తెలిపారు. పుష్కరాలు జరుగనున్న అన్ని జిల్లాలకు నిధులు మంజూరు చేశామన్నారు. పుష్కరాల సందర్భంగా గోదావరి తీరంన ఉన్న ఆలయాల్లో సౌకర్యాలు మెరుగుపరుస్తామని తెలిపారు. గోదావరి పుష్కరాల నిర్వహణకు నిజామాబాద్ జిల్లాకు రూ.1.07 కోట్లు, ఆదిలాబాద్ జిల్లాకు రూ.4.25 కోట్లు, ఖమ్మం జిల్లాకు రూ.1.70 కోట్లు, కరీంనగర్ జిల్లాకు రూ.4.35 కోట్లు, వరంగల్ జిల్లాకు రూ.80 లక్షలు కేటాయించామని తెలిపారు. పుష్కరాల నిర్వహణకు సంబంధించి ఇప్పటికే రూ.12 కోట్ల పరిపాలనపరమైన అనుమతులు మంజూరు చేశామన్నారు. ఇప్పుడున్న 27 స్నాన ఘట్టాలకు అదనంగా 80 స్నాన ఘట్టాలను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. కేంద్రాన్ని రూ.750 కోట్లు పుష్కరాల కోసం కేటాయించాలని కోరుతామన్నారు. దేవాదాయశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న రూ.27 కోట్ల నిల్వ గల కామన్ గుడ్ ఫండ్(సీజీఎఫ్)కు సంబంధిత శాఖ మంత్రిని ఛైర్మన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయని మంత్రి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సీజీఎఫ్ కింద 124 పనులు పూర్తయినట్టు తెలిపారు. మరో 436 పనులు కొనసాగుతున్నాయని వాటి కోసం రూ.46 కోట్లు అవసరమని వివరించారు. పూర్తయిన 124 పనులకు రూ.30 కోట్లు చెల్లించామని తెలిపారు