ఘనంగా నూలు పౌర్ణమి వేడుకలు
సిరిసిల్ల: శ్రావణ శుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని నేతన్నల క్షేత్రం వస్త్రోత్పత్తికి కేంద్రమైన సిరిసిల్లలో గురువారం నూలుపౌర్ణమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచి సాయంకాలం వరకు వివిధ కార్యక్రమాలతో సిరిసిల్లలో సందడి నెలకొంది. శ్రీ మార్కండేయస్వామి రథయాత్ర పురవీధుల్లో కన్నుల పండువగా సాగింది. పద్మశాలి సంఘం, యువజన సంఘం, అనుబంధ వస్త్రవ్యాపార సంఘాలు, పద్మశాలి కులబాంధవుల నేతృత్వంలో శ్రీ మార్కండేయస్వామి ఆలయం నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనంపై మగ్గం ఏర్పాటు చేసి పట్టువస్త్రాల్ని నేస్తూ పట్టణంలో వూరేగింపు నిర్వహించారు. చిన్నారులు కోలాటాలు వేశారు. ఉదయం శ్రీమార్కండేయస్వామి ఆలయంలో యజ్ఞం, యజ్ఞోపవీతధారణ, జంద్యాల పంపిణీ కార్యక్రమాలు సాగాయి. శ్రీమళయాల సద్గురు గీతాశ్రమం, శ్రీ శ్రీధరానందగిరి స్వాములవారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సిరిసిల్లలోని నేతన్న విగ్రహానికి మహాత్మాగాంధీ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలకు పద్మశాలి సంఘ నాయకులు పూలమాలలు వేశాలు వస్త్రాలు సమర్పించారు. వూరేగింపులో పద్మశాలి సంఘం అధ్యక్ష, కార్యదర్శులు కె.లక్ష్మీనారాయణ, బి.నవీన్‌కుమార్, ఆడెపు రవీందర్, గుడ్ల మంజుల తదితరులు పాల్గొన్నారు.