ఘనమైన సంప్రదాయాలు, వారసత్వం మన సొంతం
యువత వీటిని అధ్యయనం చేయాలి
హంపి శిల్పసౌందర్యం తిలకించిన వెంకయ్యనాయుడు
హంపి,అగస్టు21(జనంసాక్షి): ఘనమైన సంస్కృతి, వారసత్వాలకు నిలయమైన భారతదేశం గత వైభవం గురించి యువత తెలుసుకోవాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. కర్ణాటక పర్యటనలో ఉన్న ఆయన శనివారం కుటుంబ సమేతంగా చారిత్రక హంపి నగరాన్ని సందర్శించారు. చారిత్రక ప్రాధాన్యం ఉన్న ఇలాంటి ప్రదేశాల గురించి తెలుసుకోవడం ద్వారా యువతలో మనోబలం, ఆత్మవిశ్వాసం పెరిగి నవభారత నిర్మాణంలో భాగస్వాములు కాగలరని ఆకాంక్షించారు. ప్రపంచ వారసత్వ ప్రదేశంగా యునెస్కో గుర్తించిన హింపిలో విజయనగర సామ్రాజ్య గతవైభవపు ఆనవాళ్ళు ఉన్నాయన్నారు. మౌనంగా ఉండే రాళ్ళను, చైతన్యంతో కూడిన శిల్పాలుగా మలచిన శిల్పుల కళాచాతుర్యానికి ఈ నగరం నిదర్శనమని, ఇక్కడి ప్రతి రాయి ఓ చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తుందని తెలిపారు. వ్యక్తిగతంగా శ్రీ కృష్ణదేవరాయలును తాను ఎంతో అభిమానిస్తుంటానని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చెప్పారు. రాయల కాలంలో అంతర్జాతీయ వాణిజ్యాన్ని ప్రోత్సహించడమే కాకుండా, వ్యవసాయం ప్రాధాన్యతను గుర్తించి రైతుల కోసం చెరువులు తవ్వించిన విషయాన్ని గుర్తుచేశారు. సాహితీ సమరాంగణ సార్వభౌ మునిగా ప్రసిద్ధిగాంచిన రాయలు.. అష్టదిగ్గజ కవుల ద్వారా తెలుగు భాషాభివృద్ధికి కృషి చేశారని చెప్పారు. అద్భుతమైన సంస్కృతి వారసత్వాలకు పుట్టినిల్లు అయిన భారతదేశ చారిత్రక వైభవాన్ని తెలియజేసే ఇలాంటి ప్రదేశాల గురించి భావితరాలకు తెలియజేసేందుకు ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని సూచించారు. ఇలాంటి ప్రదేశాల చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలన్నారు. పర్యటనలో భాగంగా హంపిలోని విరూపాక్ష స్వామి ఆలయాన్ని కుటుంబసమేతంగా సందర్శించిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. దేశసౌభాగ్యం, ప్రపంచ శాంతి కోసం స్వామిని ప్రార్థించినట్లు తెలిపారు.