ఘరానా మోసగాడు శివ అరెస్టు
హైదరాబాద్,జూన్ 17(జనంసాక్షి): లక్ష్మీపూజ ద్వారా డబ్బును డబుల్ చేస్తానని, రైస్ పుల్లింగ్ కాయిన్ కూడా ఉందని, దీన్ని విదేశాల్లో అమ్మితే వందల కోట్లు వస్తుందని శివ నమ్మించడంతో లొంగిపోయిన మధుసూదన్ రెడ్డి తన ఇంట్లో పూజ చేయించుకోడానికి 14వ తేదీన బెంగళూరు నుంచి టాక్సీ బుక్ చేసి అక్కడి నుంచి శివను రప్పించాడని హైదరాబాద్ పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి తెలిపారు. బురిడీ బాబా శివను పిలిపించి, తన ఇంట్లో పూజ చేయించినది లైఫ్‌స్టైల్ భవన యజమాని మధుసూదన్ రెడ్డేనని తెలిపారు. శివతో పాటు ఈ కేసులో అరెస్టుచేసిన మరో ఇద్దరిని విూడియా ముందు శుక్రవారం సాయంత్రం ప్రవేశపెట్టారు. మోహన్ రెడ్డి అనే మరో వ్యక్తికి కూడా ఈ కేసులో సంబంధం ఉందని, అసలు అతడే తొలుత శివను మధుసూదన్ రెడ్డికి పరిచయం చేసి, అతడికి అతీంద్రియ శక్తులు ఉన్నట్లు చెప్పాడని, ప్రస్తుతం అతడు పరారీలో ఉండటంతో గాలిస్తున్నామని ఆయన అన్నారు. ఈ ఘరానామోసం కేసులో ముగ్గురిని అరెస్టు చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి ప్రకటించారు. ప్రధాన నిందితుడు శివతో పాటు దామోదర్, శ్రీనివాస్‌రెడ్డిలను ఈ కేసులో అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. మరో ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలిపారు. కేసుకు సంబంధించిన విషయాలను సీఎస్ విూడియాకు వివరించారు. డబ్బును రెట్టింపు చేస్తానని మధుసూధన్‌రెడ్డిని శివ నమ్మించాడు. తొలుత రూ.1.5 లక్షను రూ.3 లక్షలు చేసి చూపించాడు. మధుసూదన్‌రెడ్డి దృష్టి మరల్చి రూ.1.5 లక్షలను రెట్టింపు చేశాడు. గతంలో బెంగళూరు గోల్ఫ్ క్లబ్బులో కలిసినప్పుడు శివ లక్ష రూపాయలను రెండు లక్షలుగా చేసినట్లు మభ్యపెట్టి మధుసూదన్ రెడ్డిని నమ్మించాడన్నారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం ఈ ఘటన ఇలా జరిగింది… బెంగళూరు గోల్ఫ్ క్లబ్ ఘటన తర్వాత నుంచి ఇద్దరి పరిచయం కొనసాగింది. అతడితో పూజలు చేయించేందకు హైదరాబాద్ రప్పించి హైదరాబాద్ బంజారాహిల్స్ ఓహ్రీ ¬టల్లో రూం బుక్ చేశారు. మధుసూదన్ రెడ్డికి తెలియకుండానే మరో ఇద్దరు రంగప్రవేశం చేశారు. దామోదర్, శ్రీనివాసరెడ్డి అనే ఇద్దరూ 1.75 లక్షలు తెచ్చి శివకు ఇచ్చారు. పూజ తర్వాత వాళ్లకు 3 నుంచి 4 రెట్లు డబ్బు ఇస్తానని శివ వారికి చెప్పాడు. వాళ్లిద్దరూ కూడా ఓహ్రీస్ ¬టల్లోనే రూం తీసుకున్నారు. 14వ తేదీన మధుసూదన్ రెడ్డి శివను తీసుకుని, ఎంజే మార్కెట్‌లో పూజ సామగ్రి తీసుకుని, అక్కడి నుంచి ఉదయం 10.30 -11 గంటల మధ్యలో ఇంటికి తీసుకెళ్లారు. ముందుగా పూజలో 1.5 లక్షలు పెట్టించాడు. దానికి దామోదర్, శ్రీనివాసరెడ్డి ఇచ్చిన డబ్బును కలిపి, 3 లక్షలుగా చూపించాడు. ఇంకా పెద్ద మొత్తంలో డబ్బు పెడితే చాలా రెట్లు అవుతుందని చెప్పాడు. దాంతో, ఈ పూజ కోసమే తాను తెప్పించిన రూ. 1.30 కోట్లను మధుసూదన్ రెడ్డి పూలరేకుల వద్ద పెట్టారు. పూజ మధ్యాహ్నం వరకు కొనసాగినా డబ్బు మాత్రం రెట్టింపు కాలేదు. దాంతో మరో పూజ చేయాల్సి ఉంటుందని, ఇంకో పూజ చేయాల్సి ఉంటుందని, దగ్గరలోని ఆలయానికి డబ్బు తీసుకెళ్లి పూజ చేయాలన్నాడు. బయటకు వెళ్లేముందు మధు సూదన్ రెడ్డికి, ఆయన భార్యకు, కుమారుడు సందేశ్ రెడ్డికి అక్కడ తాను తయారుచేసిన ప్రసాదాన్ని పంచాడు. ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం ఉమ్మెత్త ఆకులు, సీసం లాంటి పదార్థాలతో దాన్ని తయారుచేశాడు. దంపతులను ఇంట్లోనే ఉంచి, కేవలం సందేశ్‌రెడ్డిని మాత్రం తనవెంట తీసుకెళ్లాడు. అక్కడ పూజ చేసిన తర్వాత తన చేతులు కడుక్కోవాలని అతడిని ¬టల్ వద్దకు తీసుకెళ్లాడు. వాళ్లిద్దరూ పైకి వెళ్లినప్పుడు సందేశ్ రెడ్డి కారు లాక్ చేశారు. పైకి వెళ్లిన తర్వాత డబ్బు ఎలా తీసుకోవాలన్న ఆలోచనతో.. కాసేపు మెడిటేషన్ చేద్దాం, అందుకోసం మెటల్ వస్తువులు ఏమైనా ఉంటే అన్నీ తీసి పక్కన పెట్టాలన్నాడు. దాంతో సందేశ్ రెడ్డి కారు తాళాలు, ఫోను, ఇతర వస్తువులన్నీ పక్కన పెట్టారు. కాస్త మగతగా ఉన్న అతడిని ఏమార్చి కారు తాళాలు తీసుకుని, నేరుగా కిందకు వచ్చి కారులో ఉన్న రూ. 1.30 కోట్ల మొత్తాన్ని టాక్సీలోకి మార్చేశాడు. తర్వాత కారు తీసుకుని సందేశ్ రెడ్డి వెళ్లిపోయారు. కాసేపటికి శివ పైకి వెళ్లి గది ఖాళీ చేసి టాక్సీ ఎక్కి, వేరే వైపు వెళ్లిపోయాడు. తీరా ఇంటికి వెళ్లిన తర్వాత సందేశ్ రెడ్డి చూసుకుంటే కారులో డబ్బు లేదని తెలిసింది. లోపల తల్లిదండ్రులు ఇద్దరూ స్పృహతప్పి ఉండటంతో వారిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. శివ తాను బయల్దేరిన టాక్సీలోనే కొంతదూరం వెళ్లి, దామోదర్, శ్రీనివాసరెడ్డిలను జీవీకే మాల్ వద్దకు పిలిపించాడు. తనవద్ద ఉన్న రూ. 1.30 కోట్ల లోంచి రూ. 12 లక్షలు తీసి వాళ్లకు ఇచ్చాడు. తర్వాత అక్కడినుంచి ఆటోలో ఆరాంగఢ్ చౌరస్తాకు వెళ్లాడు. అక్కడ బ్యాగులు కొనుక్కుని, డబ్బు వాటిలో ప్యాక్ చేసి బెంగళూరుకు బస్సులో వెళ్లిపోయాడు. శివపై గతంలో కేపీహెచ్‌బీ, బెంగళూరు, అలిపిరి, రాజంపేటలో మోసాలకు పాల్పడ్డాడు. అలిపిరిలో రూ.17 లక్షలు తీసుకెళ్లినట్లు కేసు నమోదైంది. శివపై చాలాచోట్ల కేసులు ఉన్నయి. రైస్ పుల్లింగ్ పేరుతో ఎంతో మందిని మోసం చేశాడని, బాధితుల ఫిర్యాదు అందిన 24 గంటల్లో కేసు ఛేదించామని సీపీ తెలిపారు.