ఘర్ వాపసీ జరగాలి
ముందు మోదీ నుంచే మొదలవ్వాలి
నారాయణ ఎద్దేవా
హైదరాబాద్,ఫిబ్రవరి2(జనంసాక్షి): ఘర్ వాపసీ ముందుగా నరేంద్ర మోడీ ఇంటినుంచే ప్రారంభం కావాలని సిపిఐ నారాయణ అన్నారు. ముందుగా ప్రధాని నరేంద్రమోడీ తన భార్యను తీసుకుని రావాలన్నారు. ఘర్‌వాపసీకి కట్టుబడి ఉంటే ప్రధాని నరేంద్ర మోదీ తన భార్యను ఇంటికి తెచ్చుకోవాలని సీపీఐ నేత నారాయణ డిమాండ్ చేశారు. సోమవారం నాడిక్కడ ఆయన మాట్లాడుతూ మోదీ పాలనపై నిప్పులు చెరిగారు. బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తోన్న ప్రజావ్యతిరేక విధానాలతో దేశ సమైక్యతకు భంగం కలుగుతోందని మండిపడ్డారు. సంఘ్ పరివార్ నేతలు హిందుత్వాన్ని రెచ్చగొడుతున్నారని విమర్శించారు. సెక్యులరిజం, సోషలిజం పదాలను తొలగించాలని వ్యాఖ్యలు చేసిన బీజేపీ మంత్రులను వారి పదవుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఒబామా పర్యటన కార్పొరేట్ సంస్థలకే తప్ప దేశ ప్రజలకు ఎలాంటి లాభం లేదని వివరించారు. ఆంధప్రదేశ్ ప్రజలు సమర్థవంతమైన పాలన కావాలని కోరుకుంటున్నారే తప్ప అందమైన భవనాలు కావాలని కోరుకుంటలేరని తెలిపారు. ఏపీ ప్రజలకు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఇచ్చిన హావిూలను నెరవేర్చాలని నారాయణ డిమాండ్ చేశారు. రెండు తెలుగు రాష్టాల్ర మధ్య ఏర్పడిన జలజగడాలను కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని పరిష్కరించాలని కోరారు.