” చందానగర్ ప్రభుత్వ భూమిలో చరిష్మా చూపిస్తున్న బిల్డర్…
“ఏకంగా రెండు కోట్ల విలువచేసే 200 గజాల స్థలం హామ్ ఫట్…”
” ప్రజా ప్రతినిధుల అండతో అధికారులకు బిల్డర్ బెదిరింపులు…?
” 2018 నుండి ఇప్పటివరకు యదేచ్ఛగా సాగుతునా టచ్ చేసే నాధుడేడి…!?”
” అదృశ్యం కానున్న చందానగర్ లో ప్రభుత్వ సర్వేనెంబర్ 174…!!”
శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 11( జనంసాక్షి): ‘అక్రమార్కులపై ఉక్కు పాదం మోపుతాం…’ ‘దళారులను కఠినంగా దండిస్తాం…’ ‘భూ కబ్జాలకు పాల్పడితే… ల్యాండ్ గ్రాబింగ్ కేసులు పెడతాం…’ ‘ప్రభుత్వ భూమిని స్వాహా చేస్తే… ఎంతటి వారినైనా కటకటాల పాలుచేస్తాం…’ ఇవి గ్రేటర్ పరిధి సహా యావత్ తెలంగాణ రాష్ట్రంలో రెవెన్యూ అధికారులు ఆయా ప్రాంతాలలో గుర్తించిన అక్రమ కట్టడాలను కూల్చేసిన రొటీన్ గా ఉచ్చరించే మాటలు…!” చాలా సందర్భాల్లో రెవెన్యూ అధికారులు అక్రమార్కులపై ఉక్కు పాదం మోపుతూ అక్రమ నిర్మాణాలను నేలమట్టంచేస్తూ తమ నిజాయితీని, చిత్తశుద్ధిని చాటుకున్న మాట నిజమే అయినా…
శేరిలింగంపల్లి మండలం చందానగర్ సర్కిల్ పరిధిలోమాత్రం ఎందుకో ఆ మాటల తూటాలు పేలుతున్న దాఖలాలు కనిపించడం లేదు… గత నాలుగేళ్లుగా ఓ బిల్డర్ కొనసాగిస్తున్న అక్రమ నిర్మాణం విషయంలో రెవెన్యూచట్టాలు ఎవరికి చుట్టాలవుతున్నాయో అంతుపట్టడం లేదు… ఫిర్యాదులు ఎన్ని అందినా…. అధికారులు స్వయానా నోటీసులు అందజేసినా ఫలితం శూన్యమే… ” ఏకంగా రెండు కోట్ల రూపాయల విలువ చేసే 200 గజాల ప్రభుత్వస్థలానికి యెసరు… ” వెయ్యి కాదు… లక్ష కాదు… అక్షరాల రెండు కోట్ల రూపాయల విలువ చేసే 200 గజాల ప్రభుత్వ స్థలాన్ని ఓ స్థానిక బిల్డర్ దర్జాగా కబ్జా చేసి తల అక్రమ నిర్మాణాన్ని సక్రమంగా సాగిస్తున్న వైనం ఒక ఎత్తైతే… గత నాలుగేళ్లుగా నగరం నడిబొడ్డున పట్టపగలే యదేచ్చగా అంతస్తులు అంతస్తులుగా నిర్మాణం సాగుతున్నా ఎలాంటి ఆటంకం కనిపించకపోవడం మరో విశేషం! సామాన్యుడి విషయంలో చిన్నపాటి విషయానికే కొరడా ఝళిపించే రెవెన్యూ అధికారులు సదరు అక్రమ నిర్మాణం విషయంలో ఏళ్లకు యేళ్లుగా నాన్చుతూ రెవెన్యూ చట్టాలను చట్టబండలుచేస్తున్నారనే విమర్శలు పెద్దఎత్తున చెలరేగుతుండడం గమనార్హం. మురికి కాల్వ పక్కన, మారుమూల ప్రాంతంలో గజం స్థలంలో వెలసిన అక్రమ నిర్మాణాన్ని చీల్చి చెండాడే రెవెన్యూ, జిహెచ్ఎంసి అధికారులు గజం స్థలం లక్షల్లో పలుకుతూ 200 గజాల స్థలం అక్రమార్కుల చేతిలో నలిగిపోతుంటే ఉలుకు పలుకు లేకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ వ్యవస్థను అప్రమత్తం చేసి భూ కబ్జాలను నిర్దాక్షిణ్యంగా అణచివేయాలని సంబంధిత రెవెన్యూ, జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ విభాగాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ చందానగర్ జోహార్ కాలనీ రోడ్డు నెంబర్ 6లో రేణుక అమ్మవారి ఆలయంం ఎదురుగా అక్రమ నిర్మాణం విషయంలో అధికారుల పవర్ ఎందుకు ముందుకు పడడంలేదనేది నేడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. అయితే విశ్వసనీయ వర్గాలు, స్థానికుల కథనంప్రకారం… సదరు బిల్డరు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికార పార్టీ నాయకులు అండదండలు పుష్కలంగా పునికిపుచ్చుకొని ఈ అక్రమ నిర్మాణానికి శ్రీకారం చుట్టారని తెలుస్తోంది. అందుకే ఇటు రెవెన్యూ అధికారులు, అటు జిహెచ్ఎంసి అధికారులు చేతులు పిసుక్కోవడంతప్ప చూస్తూసైతం ఏమి చేయలేకపోతున్నారనే వాదనలు లేకపోలేదు!! ఏది ఏమైనా సదరు అక్రమ నిర్మాణంపై కొరడా ఝళిపించకపోతే దానిని సాకుగా చూపుతూ మరి కొంతమంది దళారులు రెచ్చిపోయే ప్రమాదం ఉందని విపక్షాలుకూడా హెచ్చరిస్తున్నాయి. “2018 లో మొదలుపెట్టి ఫిర్యాదులతో ఆగినా… మళ్లీ యదేచ్చగా అక్రమం సాగుతున్నా టచ్ చేసే నాథుడేడి…!?” శేరిలింగంపల్లి మండలం చందానగర్ సర్కిల్ పరిధి సర్వేనెంబర్ 174 లోవున్న ప్రభుత్వ స్థలంలోని 200 గజాల స్థలాన్ని 2018 వ సంవత్సరంలో ఓ ప్రైవేట్ బిల్డర్ తాను నిర్మిస్తున్న భవనంలోకి అప్పనంగా ఆక్రమించి యదేచ్చగా బహులంతస్తుల నిర్మాణాన్ని కొనసాగిస్తుండగా ప్రభుత్వ భూమి విషయంలో పలు ఫిర్యాదులు అందడంతో శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులు నోటీసులు అందజేసి రెండు పిల్లర్లను తూతూ మంత్రంగా కూల్చివేసి అప్పటివరకు ఆపినా… ఈ మధ్యకాలంలో సదరు అక్రమ నిర్మాణాన్ని తిరిగి మొదలుపెట్టి ఎలాంటి అడ్డంకి లేకుండా ముందుకు తీసుకెళ్తుండడంవెనక పెద్ద కథనే నడిచిందని పుకార్లు షికారు చేస్తున్నాయి. పట్టపగలే ఒక అక్రమ నిర్మాణం నాటినుండి నేటివరకు నిరాటంకంగా సాగుతున్నా ఇప్పటివరకు ఒక్కరూ దాన్ని టచ్ చేయకపోవడంవెనుక ఆంతర్యం ఏమిటని, ఇందులో పెద్దతలల పాత్ర ఎంతని పరిసర ప్రాంతాల ప్రజలు పెద్దయెత్తున ప్రశ్నిస్తున్నారు. నాలుగేళ్ల క్రితమే రెవెన్యూ అధికారులు, జిహెచ్ఎంసి అధికారులు సదరు అక్రమ నిర్మాణాన్ని నిలిపేసినప్పటికీ ఈ మధ్యకాలంలో తిరిగి ఊపందుకోవడం స్థానికులను విస్మయానికి గురిచేస్తుంది. కేవలం బయట నుంచి అందిన ఫిర్యాదుల మేరకు బిల్డర్ కు నోటీసులుఇచ్చి చేతులు దులుపుకున్నారా…? లేక రెవెన్యూ అధికారులను సైతం తన పలుకుబడిన ఉపయోగించి స్థానిక ప్రజా ప్రతినిధులు అండతో అధికారుల చర్యలకు బిల్డర్ ముకుతాడు వేశాడాఅనేది ఇప్పటికీ మిస్టరీగానే మారింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటి శాఖ మంత్రి కేటీఆర్ భూకబ్జాలపై సహజంగానే కన్నెర్ర చేస్తుంటారని, మరి రెండు కోట్ల రూపాయల విలువ చేసే 200 గజాల ప్రభుత్వ స్థలం విషయంలో పట్టించుకోకపోవడంవెనుక స్థానిక ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకుల ఒత్తిడే కారణమనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మధ్యకాలంలో రెవెన్యూ అధికారులు, జిహెచ్ఎంసి అధికారులు పలు దఫాలుగా అక్రమ నిర్మాణంపై చర్యలు చేపట్టేందుకు పూనుకొని సంఘటనా స్థలాన్ని సందర్శించేందుకు వెళ్లగా ముందుగానే సమాచారం తెలుసుకున్న సదరు బిల్డర్ అధికారులనే తీవ్ర బెదిరింపులకు గురి చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తుండడం శేరిలింగంపల్లి పరిధిలో తీవ్ర చర్చనీయాంశంగా మారడం విశేషం.
” కనుమరుగు కానున్న చందానగర్ లో ప్రభుత్వ సర్వేనెంబర్ 174…!!? “
ప్రజా ప్రయోజనాలు, ప్రభుత్వ అవసరాలను ఎంతో ముందు చూపుతో పసిగట్టి భవిష్యత్తు అవసరాలకోసం చందానగర్ సర్కిల్ పరిధి సర్వేనెంబర్ 174 లో ఉన్న వందల ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రభుత్వం కాపాడుతూ వస్తోంది. అయితే హైదరాబాద్ విశ్వ నగరంగా అవతరించడం… ఇక్కడి భూములకు విపరీతంగా ధరలు పెరిగి రెక్కలు తొడగడంతో అప్పటినుండి అక్రమార్కులు, భూ కబ్జాదారులు, దళారులు చెదలు గా చేరి సర్వేనెంబర్ 174 లో కొద్దికొద్దిగా ఆక్రమిస్తూ ఇప్పటికే కర్పూర హారతిలా కరిగించేశారు!!! కాగా మిగిలిన కొద్దిపాటి భూమినిసైతం తమ పకడ్బందీ చర్యలతో కాపాడాల్సిన రెవెన్యూ, జిహెచ్ఎంసి అధికారులు మరోవైపు స్థానిక ప్రజా ప్రతినిధులు కాసులకు కక్కుర్తి పడుతూ పరిపాలనావిధానంలోని లొసుగులను సాకుగా మలుచుకొని కబ్జారాయుళ్ళకు కొమ్ముగాస్తుండడంతో సర్వే నెంబర్ 174 తన ఉనికిని పూర్తిగా కూలిపోయి కనుమరుగయ్యే దుస్థితికి చేరుకుంది. దీంతో మిగిలిపోయిన ఒకటి అరా ఎకరం ప్రభుత్వ స్థలంలో ఇలాంటి అక్రమాలు వెలుగు చూస్తుంటే ఇక ప్రభుత్వ భూమి మిగిలేదేముంటుందని, త్వరలోనే దీన్ని పుస్తకాలలో చూసుకోవాల్సి ఉంటుందని చందానగర్ వాసులు దుయ్యబడుతున్నారు. ‘ కంచ చేనును మేసిన చందం’గా రక్షించాల్సిన పాలకులు, అధికారులు… ‘దొంగలు దొంగలు కలిసి ఊర్లు పంచుకున్న చందం’గా అక్రమార్కులకు కట్ట పెడుతుంటే భవిష్యత్ తరాలకు ఏం మిగులుతుందని… అప్పటి ప్రభుత్వాలు ఏం చేయగలుగుతాయని విద్యావంతులు మేధావులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ విభాగం ఉన్నతాధికారులు సర్వే నెంబర్ 174 లోని అక్రమ నిర్మాణం పై ఉక్కుపాదం మోపాలని, రెవెన్యూ చట్టాలు ఎవరికి చుట్టాలు కావని తమ నిజాయితీని నిరూపించుకోవాల్సిన అవసరాన్ని, బాధ్యతను ఎత్తి చూపిస్తున్నారు. సామాజిక బాధ్యత కలిగిన ఒక మీడియా గా శేరీలింగంపల్లి ప్రజలతో కలిసి ‘జనం సాక్షి’ మంచి పరిణామాన్ని కోరుకుంటుంది.