చంద్రబాబు తీరుతో.. 

గోదావరి డెల్టాకు నష్టం
– పోలవరం ప్రాజెక్టులో ప్రభుత్వం చెప్పినట్లు పనులు లేవు
– మాజీ మంత్రి వట్టి వసంత్‌కుమార్‌
విజయవాడ, జులై5(జ‌నం సాక్షి) : చంద్రబాబు నిర్ణయాలతో గోదావరి డెల్టాకు నష్టం వాటిల్లుతుందని, పోలవరం ప్రాజెక్టుపై టీడీపీ సర్కార్‌ గొప్పలు చెప్పుకుంటోందని, కానీ వాస్తవానికి అక్కడ ముందుకు జరిగింది ఏం లేదంటూ మాజీ మంత్రి, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత వట్టి వసంతకుమార్‌ మండిపడ్డారు.   కృష్ణా జిల్లా విజయవాడలో గురువారం వట్టి వసంతకుమార్‌ విూడియాతో మాట్లాడారు. ప్రతిష్టాత్మక ప్రాజెక్టుపై టీడీపీ సర్కార్‌ చేస్తున్న అవినీతి అక్రమాలపై ప్రశ్నిస్తున్న వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని రాష్ట్ర మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు తీరుతో గోదావరి డెల్టా ప్రాంత ప్రజలు నష్టపోతున్నారని తెలిపారు. పట్టిసీమ ప్రాజెక్టుతో గోదావరి ప్రజలకు తీరని అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ సర్కార్‌ ఇష్టానుసారం గోదావరి నీటిని తరలిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. జీవో 51 ద్వారా 6,020 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ 73 టీఎంసీల నీటిని పెన్నానదికి తరలిస్తామని ఆంధప్రదేశ్‌ చెబుతోందన్నారు. అయితే బచావత్‌ ట్రిబ్యునల్‌ అవార్డ్‌ ప్రకారం గోదావరి నీటిని తరలించకూడదని పేర్కొన్నారు. నిబంధనలు తుంగలో తొక్కి చంద్రబాబు ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందంటూ మాజీ మంత్రి వట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు.