చక్కెర కర్మాగారం అమ్మకం.. తమ్మినేని చలువ!

టీడీపీ నేత రవికుమార్‌ ధ్వజం..
శ్రీకాకుళం, జూలై 29 : వేలాది కుటుంబాలకు ఉపాధి కల్పించిన ఆమదాలవలస సహకార చక్కెర కర్మాగారం అమ్మకానికి తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి తమ్మినేని సీతారాం కారణమని ఆ పార్టీ ఆమదాలవలస నియోజకవర్గ ఇన్‌ఛార్జి కోన రవికుమార్‌ ఆరోపించారు. ఆమదాలవలస పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ రైతులు, కార్మికులతో లేనిపోని సమావేశాలు నిర్వహించి వారిని తప్పుదారి పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. 30 కోట్ల రూపాయలు విలువ చేసే పరిశ్రమను అప్పట్లో అధికారంలో ఉన్న సీతారాం కమిషన్లకు ఆశపడి ఎలాంటి గుర్తింపు లేని అంబికా లే మిషన్‌ సంస్థకు అమ్మేశారని ఆరోపించారు. పోరాటాల పేరుతో ప్రజా హక్కులను పక్కదారి పట్టిస్తున్నారని, టీడీపీలోనే ఉంటూ ఆ పార్టీని దెబ్బ తీసే విధంగా ఆయన వ్యాఖ్యలు ఉంటున్నాయని మండిపడ్డారు. జిల్లాలోని థర్మల్‌, కొవ్వాడ విద్యుత్‌ కేంద్రాలను రద్దు చేయాలని, దూసి కాటన్‌ పరిశ్రమ కార్మికుల సమస్యలపై ప్రాణాలైనా అర్పిస్తానని ఆయన చేసిన ప్రకటనలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. పరిశ్రమను తెరిపించేందుకు పోరాటానికి సిద్ధమవుతుండగా ఉద్యమాన్ని పక్కదారి పట్టించే విధంగా ప్రకటనలు చేస్తున్నారంటూ దుయ్యబట్టారు. రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికైన బొడ్డేపల్లి సత్యవతి పరిశ్రమను తెరిచేందుకు కృషి చేయలేదన్నారు. ఇటువంటి నాయకులు రాజకీయాలకు స్వస్తి పలికి విశ్రాంతి తీసుకోవడమే మంచిదన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే పరిశ్రమను తెరిపించి మాట నిలబెట్టుకోవాలన్నారు. లేకుంటే పదవులకు రాజీనామా చేయాలని డిమాండు చేశారు.