చక్కెర కర్మాగారం అమ్మకానికి ప్రధాన పార్టీలే కారణం
లోక్సత్తా ఆమదాలవలస నియోజకవర్గ కన్వీనర్ అన్నంనాయుడు
శ్రీకాకుళం, జూలై 30 : ఆమదాలవలస చక్కెర కర్మాగారం అమ్మకానికి తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలే కారణమని లోక్సత్తా ఆమదాలవలస నియోజకవర్గ కన్వీనర్ తమ్మినేని అన్నంనాయుడు పేర్కొన్నారు. ఆమదాలవలస పట్టణంలోనిలోని లోక్సత్తా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2003లో కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం దేశంలోని160 చక్కెర కర్మాగారాలను అమ్మకానికి సిద్ధం చేసిందని ఆరోపించారు. అప్పట్లో రాష్ట్రంలో అధికార తెలుగుదేశం పార్టీ అడ్డుకోలేకపోయిందని ఆయన మండిపడ్డారు. జిల్లాలోని ఏకైక చక్కెర కర్మాగారం అమ్మకం చేసేటప్పుడు అప్పటి ఎంపీ కింజరాపు ఎర్రన్నాయుడు, మంత్రి తమ్మినేని సీతారాం ఎందుకు అడ్డుకోలేకపోయారని ప్రశ్నించారు. అంతే కాకుండా జిల్లా నుంచి అనేక మంది టిడిపి తరపున ఎమ్మెల్యేలుగా ఉన్నా పరిశ్రమ అమ్మకం అడ్డుకోలేకపోయారని ఆయన ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబునాయుడు కూడా సహకార రంగంలో ఉండే ఈ కర్మాగారం తిరిగి తెరిపించేందుకు ప్రయత్నించకపోవడంలో ఆంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు. ఇరు పార్టీల నాయకులు రైతులను మభ్యపెట్టి రాజకీయ స్వార్థం కోసం కర్మాగారాన్ని తెరపైకి తెచ్చారని ఆయన విమర్శించారు. 2004లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా పరిశ్రమను తిరిగి తెరిపించకపోవడంలో జిల్లా నాయకుల తప్పు కూడా ఉందన్నారు. రాష్ట్రంలో పలు కర్మాగారాలు తెరిపించి దీనిని ఎరదుకు తెరిపించలేదన్నారు. స్వయాన ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖరరెడ్డి కూడా కర్మాగారాన్ని తెరిపిస్తామని రైతులకు హామీ ఇచ్చి చివరకు చేతిలెత్తేశారని ఆయన తెలిపారు. ఈ జిల్లా మంత్రిగా ఉన్న ధర్మాన ప్రసాదరావు గానీ, స్థానిక ఎమ్మెల్యే బొడ్డేపల్లి సత్యవతి గానీ తిరిగి తెరిపించేందుకు ఆలోచన చేయలేదన్నారు. తమ రాజకీయ స్వార్థం కోసం మాజీ మంత్రి తమ్మినేని సీతారాం, ఆయన మేనల్లుడు కూన రవికుమార్ కర్మాగార సమస్యను తిరిగి తెరపైకి తెచ్చి హైడ్రామా ఆడుతున్నారంటూ దుయ్యబట్టారు. కర్మాగారం అమ్మకం సమయంలో పరిష్కరించలేని సమస్యను ప్రస్తుతం ఉద్దరిస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు.