చట్టవిరుద్ధమైన అబార్షన్లను ఎవరు ప్రోత్సహించినా కఠిన చర్యలు

టేకులపల్లి,అక్టోబర్ 11 (జనం సాక్షి): చట్ట విరుద్ధమైన అబార్షన్లను ఎవరు ప్రోత్సహించిన కఠిన చర్యలు ఉంటాయని మండల వైద్యాధికారి డాక్టర్ విరుగు నరేష్ హెచ్చరించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సులానగర్ లో ఆశా కార్యకర్తలకు నెలవారి శిక్షణ సమావేశం మంగళవారం నిర్వహించారు. 2030 సంవత్సరం కల్లా కీటక జనిత వ్యాధులను 2025 సంవత్సరం కల్లా క్షయ వ్యాధిని అంతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి ఈ సీజన్లో వచ్చే వ్యాధులు ఆ వ్యాధులు రాకుండా ముందస్తుగా ప్రజలను అప్రమత్తం చేయడానికి కావలసిన నైపుణ్యతను ఈ సందర్భంగా వైద్యాధికారి విరుగు నరేష్ ఆశా కార్యకర్తలకుఅవగాహన కల్పించారు. సమాజంలో ఆడపిల్లలపై వివక్షత పెరుగుతూనే ఉందని ముఖ్యంగా జనాభా నిష్పత్తిలో ఆడపిల్లల సంఖ్య తగ్గుతూ ఉందని ముఖ్యంగా అన్ని రకాల అబార్షన్లపై గ్రామ స్థాయిలో ఆశా కార్యకర్తలు పూర్తి దర్యాప్తు చేయాలని కోరారు. తల్లి బిడ్డకు ప్రమాదం అని నిర్ధారణ జరిగితే తప్ప ఎట్టి పరిస్థితుల్లో గర్భ స్రావాలను ప్రోత్సహించవద్దని ఈ సందర్భంగా కోరారు. ఎవరైనా చట్టానికి వ్యతిరేకంగా గర్భ స్రావాలను చేసినట్లయితే భారతీయ శిక్షా స్మృతి ప్రకారం తీవ్రమైన చర్యలు తీసుకోబడును అని ఈ సందర్భంగా హెచ్చరించారు. అనంతరం సీజనల్ వ్యాధులపై మిగతా ఆరోగ్య కార్యక్రమాలపై శిక్షణ మరియు అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా మాస్ మీడియా అధికారి ఫయాజ్ మోహినుద్దీన్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సీతమ్మ, ఇల్లందు సబ్ యూనిట్ అధికారి హరికృష్ణ, క్షయ వ్యాధి సూపర్వైజర్లు శంకర్, సర్వన్, సూపర్వైజర్లు నాగు బండి వెంకటేశ్వర్లు, వీసం శకుంతల, గుజ్జ విజయ, ల్యాబ్ టెక్నీషియన్ సాజిదా బేగం, వైద్య సిబ్బంది ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.