చట్టాలు చేస్తేసరిపోదు.. చిత్తశుద్ధి కావాలి

సామాజిక సంస్కరణలకు నాందికర్త అయిన పూలే వర్ధంతి రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పేలవంగా జరిగినా, దళితులకు వెన్నుదన్నుగా నిలిచే ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక బిల్లుకు చట్టబద్దత కల్పించే దిశగా అడుగులు పడటం శుభపరిణామం. మూడు దశాబ్దాలుగా దళితులు చేస్తున్న పోరాటాల కల సాకారమవుతోంది.  ఏ ప్రభుత్వం చేయని విధంగా సాహసోపేతమైన, విప్లవాత్మకమైన నిర్ణయం మా ప్రభుత్వం తీసుకున్నదని నేతలు గొప్పలు చెప్పుకుంటున్నా, చట్టాలు చేయగానే సరిపోదు దాని అమలుకు చిత్తశుద్ధితో కృషి చేసినప్పుడే ఏ బిల్లు అయిన చారిత్రాత్మకమవుతుంది.

ఉప ప్రణాళిక బడ్జెట్‌ అంచనాలను 6 నెలల ముందుగానే రూపొందించి వెల్లడించాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి అధ్యక్షతన ఏర్పడే ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి మండలి ప్రతి ఆరు నెలలకొకసారి సమావేశమై ఉప ప్రణాళిక అమలును పర్యవేక్షించాల్సి ఉంటుందని ప్రభుత్వమే చెబుతోంది. అయితే రాష్ట్రాలు ఈ ఉప ప్రణాళికలను సమర్థవంతంగా అమలు చేస్తే ప్రోత్సాహక గ్రాంట్లు ఇస్తామని కేంద్రం గతంలో ప్రకటించింది. కాని కేంద్రం చెప్పిందొకటి, చేసిందొకటి. ఎస్సీ, ఎస్టీలకు ప్రణాళిక కేటాయింపులలో భారీగా తొర్రిపెట్టి తన చిత్తశుద్ధిని ఏ మేరకు వెల్లడించిందో అవగతమవుతోంది. 2001 లెక్కల ప్రకారం జనాభాలో ఎస్సీలు 16.5 శాతం, ఎస్టీలు 8.2 శాతం ఉన్నారు. మన రాష్ట్రానికి వచ్చే సరికి ఈ రెండు వర్గాలు కలిపి 28 శాతం ఉన్నారని అంచనా.

2006-07 ప్రణాళిక కేటాయింపులో 1,65,499కోట్ల రూపాయలు కాగా అందులో 4.25 శాతం అనగా కేవలం 7,031,86 కోట్ల రూపాయలనే దళితులకు కేటాయించారు. అలాగే 2007-08లో కేవలం 6.1 శాతం, 2010-11లో కేవలం 8.12 శాతం మాత్రమే కేటాయించి చేతులు దులుపుకున్నారు. మన రాష్ట్రంలో గత 19 ఏళ్లుగా 26వేల కోట్ల రూపాయలు సబ్‌ ప్లాన్‌ నిధులను ప్రభుత్వాలు దారి మళ్లించిన దాఖలాలు ఉన్నాయి. కళ్లముందు ఇలాంటి కఠోర వాస్తవాలు ఎన్నో ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ధి రంగాలన్నింటికీ చెందిన ప్రణాళిక నిధుల నుంచి ఎస్సీ, ఎస్టీ జనాభా దామాషా ప్రకారం నిధులు సేకరించి ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికను అమలు పరచాలనే సంకల్పంతో ప్రభుత్వం వీరికి ప్రత్యేక అభివృద్ధి కార్పొరేషన్లను, నోడల్‌ ఏజెన్సీలను ఏర్పాటు చేసి ఈ నిధులను పర్యవేక్షింపజేయాలని సంకల్పించారు. ఇలాంటి గొప్ప ఆలోచన ఆదిలోనే నీరుగారిపోయి, ఈ నిధులను వారికి ఖర్చు చేయకుండా హుస్సేన్‌సాగర్‌ సుందరీకరణకు మళ్లీంచారంటే రాష్ట్ర ప్రభుత్వ చరిత్ర ఏపాటి గొప్పదో తెలుసుకోవచ్చు.

దళిత మంత్రులు, ప్రజాప్రతినిధులు ఎంత మంది ఉన్నా ఏమి ప్రయోజనం. దళితులు, అణగారిన వర్గాల సంక్షేమం కోసం అంబేద్కర్‌ పలు ఆర్టికళ్లను రాజ్యాంగంలో చేర్చి వారికి రక్షణ కల్పించగలిగారు. సమసమాజాన్ని స్థాపించాలనే ఆ మహనీయుడు కన్న కలలు స్వాతంత్య్రం సిద్ధించి 6 దశాబ్దాలు దాటినా నెరవేరలేదు. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాలలో దళితులు అంటరానివారిగానే పరిగణింపబడుతున్నారు. అన్నింటికంటే సిగ్గుచేటైన విషయం రెండు గ్లాసుల పద్ధతి అనే హేయమైన చర్య మన మనస్సుల నుంచి తుడిపేయలేకపోతున్నాం. ఎస్సీలకు రాజ్యాంగపరంగా రాజ్యాధికార వాటా 1956, 26వ తేదీనే వచ్చేసింది. రాజ్యాంగ పరంగా దళితులు చట్టసభల్లో స్థానాలు కల్పించుకున్న కొంత మేరకైన స్వతంత్రంగా వ్యవహరించలేకపోతున్నారు. ఆర్థికంగా సామాజికంగా వీరు బలపడే వరకు చట్టసభల్లో సైతం వారి ప్రతినిధుల ప్రయోజనం కొన్ని పరిమితులకే లోబడి ఉండక తప్పదు. ఇలాంటి వివక్షత కొనసాగుతుండగా ప్రభుత్వం చేపట్టిన ఈ ఉప ప్రణాళికలో కూడా మార్పులు చేయాలని దళిత సంఘాలు కోరుతున్నాయి.

రాష్ట్ర బడ్జెట్‌లో ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికలకు, వారి జనాభా దామాషా మేరకు 28వేల కోట్ల రూపాయలు కేటాయించి విధిగా వారి కోసమే ఖర్చు చేయాలని దళిత సంఘాలు కోరుతున్నాయి. అదే విధంగా ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లన్నింటినీ రెసిడెన్షియల్‌ పాఠశాలలుగా మార్చాలని, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ రంగానికి ఇస్తున్నట్టుగానే దళితవాడలకు కూడా 24 గంటలు విద్యుత్‌ సరఫరా చేయాలని అందుకు గాను బకాయి నిధులలో వంద కోట్లు కేటాయించాలని, వీటి డిమాండ్‌ను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో శాసనసభా సమావేశాలను ఏర్పాటు చేసి తీసుకువస్తున్న ఈ చట్టానికి ఆచరణలో చిత్తశుద్ధి ప్రదర్శించినప్పుడే అక్కరకు రాని చుట్టాలుగా మారిపోవు. చట్టబద్దత కల్పించడమే కాకుండా సమగ్రంగా అమలు చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉన్నది. దళితులు, ఆదివాసీలతోపాటు వెనుకబడిన తరగతుల కోసం కూడా దామాషా ప్రకారం ప్రణాళిక నిధులు కేటాయించి వారి వికాసం కోసం ఖర్చు చేసినప్పుడే దేశంలో, రాష్ట్రంలో సామాజిక న్యాయం ప్రజలముంగిటకు వస్తుంది.

ఈ వర్గాల ప్రజలు ఆనందదాయకంగా జీవించాలంటే కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆమ్‌ ఆద్మీ అని చెప్పుకుంటే సరిపోదు. అదే విధంగా ఎస్సీ, ఎస్టీయేతర గ్రామీణ ప్రజలలో మూడింట ఒక వంతు మంది మాత్రమే భూమి లేని వారు కాగా, దళిత గ్రామీణులలో మూడింట రెండువంతుల మంది భూములులేని వారని మన గణంకాలు చెబతున్నాయి. అలాగే ఈ వర్గాల వారిలో 60 శాతం మంది దినసరి కూలిపైనే ఆధారపడి బతుకుతున్నారు. వీరందరికీ భూమి హక్కు కల్పించడంతో పాటు ఉపాధికి భరోసా ఇవ్వాల్సిన అవసరం కూడా ఉన్నది. వీరి సత్వర అభ్యున్నతి కోసం రాజ్యాంగంలో ఎన్ని సానుకూల చర్యలు తీసుకున్నా ఈనాటికీ అవి తీసుకట్టుగానే అమలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి కోసం ఒక ప్రత్యేక ప్రణాళికను అమలు చేయడానికి ముందుకు రావడంతో పాటు, వారి సంక్షేమానికి తిలోదకాలివ్వకుండా సంపన్న వర్గాల వారితో సమానంగా అడుగులు వేసేందుకు చేయాతనిస్తే ఏ చట్టానికైనా సార్థకత లభిస్తుంది.