‘చనాఖా కోరాటా’ బారేజ్‌కి మహారాష్ట్ర అనుమతులు

5

– హర్షం వ్యక్తం చేసిన మంత్రి హరీశ్‌

హైదరాబాద్‌,మే 21(జనంసాక్షి): అటవీ, వన్యమృగ సంరక్షణ , గనులకు సంబంధించి మహారాష్ట్ర శనివారం నాడు ఎన్‌ఓసిలను జారీ చేసింది.560 కోట్ల వ్యయంతో మహారాష్ట్ర సరిహద్దుల్లో కొరటా గ్రామం వద్ద  బ్యారేజీని  తెలంగాణ ప్రభుత్వం తల పెట్టింది. చనాఖ కోరట బ్యారేజీ, పెనుగంగ ప్రాజక్టుల ద్వారా మొత్తం 51 వేల ఎకరాలకు సాగునీరందించాలని కెసిఆర్‌ సర్కారు సంకల్పించింది. ఇటీవల మంత్రులు హరీష్రావు , ఇంద్రకరణ్‌ రెడ్డి, జోగురామన్న ఎంపీ నగేష్‌, ఇతర ప్రజా ప్రతినిధులు కోరటా బ్యారేజీ సైట్‌ దగ్గర రాత్రి బస చేశారు. ఈ బ్యారేజీ పనులు 2018 జూలై కల్లా పూర్తి చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీష్‌ రావు శనివారం అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. చనాఖా కోరాటా బ్యారేజీ గేట్లు,పంపు హవుజ్‌, కెనాల్‌ పనులన్నీ షెడ్యూలు లోగా పూర్తి చేయాలన్నారు. మహారాష్ట్ర అటవీ, పర్యావరణ, గనులకు సంబంధించిన ఎన్‌ ఓ.సి లు రావడం పట్ల మంత్రి హర్షం వెలిబుచ్చారు.వైల్డ్‌ లైఫ్‌ కు సంబంధించిన ఎన్‌.ఓ. సి సంపాదించేందుకు ఆదిలాబాద్‌ జిల్లా అటవీ అధికారుల కృషిని ఇరిగేషన్‌ మంత్రి హరీష్‌ అభినందించారు.తెలంగాణ ఉధ్యమంలో సహకరించినట్లుగానే తెలంగాణ పునర్నిర్మాణంలోనూ అదే స్పూర్తిని కొనసాగించాలని ఉద్యోగులు, అధికారులను మంత్రి కోరారు. ఆదిలాబాద్‌ జిల్లాలో సాగునీటి పారుదల రంగానికి అపారమైన సానుకూల పరిస్థితులు ఉన్నాయని భూసేకరణ సహా వివిధ అంశాలపై ఇరిగేషన్‌ అధికారులు రెవిన్యూ తదితర అన్ని శాఖలను సమన్వయం చేసుకొని పనిచేయాలని మంత్రి సూచించారు. జిల్లాలో మంచి క్రియాశీల అధికారులున్నారని, సాగునీటి పధకాలను విజయవంతం చేస్తే ఆదిలాబాద్‌ ,రాష్ట్రంలోనే మోడల్‌ జిల్లాగా మారుతుందని హరీష్‌ అన్నారు. చనాకా కోరాటా బ్యారేజీ పనుల కోసం మొత్తం 770 ఎకరాల భూమిని సేకరించవలసి ఉండగా ఇంకా 290ఎకరాలు భూసేకరణ పెండింగ్లో ఉందన్నారు. తహ సీల్దార్లు  క్రియాశీల పాత్ర పోషించాలని మంత్రి కోరారు.