చరిత్రలో మొదటిసారి

అవిశ్వాసంపై బాబు డొంకతిరుగుడు
ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉన్న కాపాడే యత్నం
తటస్థంగా ఉండమంటూ ఎమ్మెల్యేలకు విప్‌
ప్రభుత్వానికి అండగా ప్రధాన ప్రతిపక్షం
అసెంబ్లీ సాక్షిగా కనీవినీ ఎరుగని బరితెగింపు
ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలను పౌరులే ఎన్నుకుంటారు. ఏ పార్టీ అయితే ప్రజల విశ్వాసం పొంది అత్యధిక స్థానాలు దక్కించుకుంటుందో ఆ పార్టీనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. రెండో స్థానంలో నిలిచిన పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉంటుంది. ప్రజలిచ్చిన అధికారంతో వారికి సేవ చేసే అవకాశం పాలక పక్షానికి ఉండగా, పాలకపక్షం ప్రజాసేవలో ప్రదర్శించే అలసత్వం, అభివృద్ధి కార్యక్రమాల్లో జాప్యం, అవినీతి, బంధుప్రీతి తదితర వ్యవహారాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజల పక్షాన పోరు సల్పాల్సిన బాధ్యత ప్రతిపక్షానిది. ప్రజలు తమను ఎందుకు తిరస్కరించారో గుర్తించి వారికి చేరువయ్యేందుకు అధికారపక్షం చేసే తప్పిదాలను ఎత్తిచూపుతూ తర్వాతి ఎన్నికల్లో అధికారంలోకి రావాలని ఏ ప్రతిపక్షపార్టీ అయినా కోరుకుంటుంది. అదే ప్రధాన ప్రతిపక్షానికైతే అదే లక్ష్యంగా ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం పూర్తి భిన్నమైన పరిస్థితి నెలకొంది. అధికారపార్టీ, ప్రధాన ప్రతిపక్షం చెట్టాపట్టాలేసుకు తిరుగుతున్నాయి. శుక్రవారం అసెంబ్లీలో టీఆర్‌ఎస్‌ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం సాక్షిగా వారి కుమ్మక్కు రాజకీయాలు బట్టభయలయ్యాయి. పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారం చేజిక్కించుకొని సంచలనం సృష్టించిన తెలుగుదేశం పార్టీ ఆ పని చేయడాన్ని ప్రజాస్వామికవాదులు జీర్ణిం చుకోలేకపోతున్నారు. అవిశ్వాసంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆ పార్టీనేతలు చేస్తున్న వ్యాఖ్యలు వింతగానూ, విచిత్రంగానూ ఉన్నాయి. అవిశ్వాసం తాను పెట్టి ప్రభుత్వాన్ని కూల్చడట. పెట్టిన వారికి మద్దతు ఇవ్వడట. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇప్పుడు బాబు వ్యూహం ఇదే. ఈ సర్కార్‌కు కొనసాగే హక్కులేదంటూ పాదయాత్రలో ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూ, అవిశ్వాసం అనే సరికి వెనక్కి తగ్గతున్న తీరు ఆయన నిజాయితీని శంకించాల్సి వస్తోంది. గతంలో ఒకసారి అవిశ్వాసం పెడితే ఎమ్మెల్యేలు అమ్ముడయ్యారు. సూట్‌కేసుల కోసం, ఖరీదైన కార్ల కోసం ఆశపడి పోయారు. మరోసారి .
ఆ తప్పు నేను చేయలేను. ఇప్పుడు మళ్లీ అవిశ్వాసం అంటున్నారు. ఆ తీర్మానం నెగ్గాలంటే కచ్చితంగా ఎమ్మెల్యేలను కొనాలి. ప్రజాస్వామ్యాన్నీ కొనేయాలి. ఆ పని నేను చేయలేనంటూ కుంటిసాకులు చెబుతూ చంద్రబాబు వచ్చిన అవకాశాన్ని వదులుకుంటున్నారు. ఇక్కడ ఎవరు ఎవరిని కొంటున్నారనేది అర్థం కావడం లేదు. ఎందుకు కొంటారో చెప్పడం లేదు. పాదయాత్రలో ఉన్న చంద్రబాబు ప్రతినిత్యం అధికారపక్షంపై దుమ్మెత్తిపోస్తూనే ఉన్నారు. రెండు వేల కిలోమీటర్లకు పైగా నడక సాగించిన ఆయన ప్రతి చోట ప్రభుత్వంపై చేయని విమర్శ లేదు. కరెంటు ఇవ్వాల్సిన వేళ.. సర్కారు చార్జీల షాకులు ఇస్తోందని, ఇది సర్కారు కాదు.. దోపిడీదారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇన్ని మాటలు మాట్లాడుతూ సర్కార్‌ను సాగనంపడానికి ఉన్న అవకశాలను ఎందుకు వదులుకుంటున్నారనేది అర్థం కాని ప్రశ్న. ఇక టీడీపీ నేతల వాదన కూడా బాబుకు అనుగుణంగానే ఉంది. అవిశ్వాసం పెట్టదల్లచుకున్న వారు ఒక్కటిగా ఎందుకు రాలేదని ఓ యువ ఎమ్మెల్యే అనుమానం. విద్యుత్‌ సర్‌చార్జీలు మరోసారి పెంచాలన్న రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనను చంద్రబాబు, పార్టీనేతలు తీవ్రంగా తప్పుబట్టారు. ‘భవిష్యత్‌లో మరో పదమూడు వేల కోట్ల మేర సర్‌చార్జీల వసూలుకు సర్కారు సిద్ధమవుతోంది. అసలీ ప్రభుత్వానికి దిశాదశా లేదు. ప్రజలను పీడించడం, పన్నులు వేసి దోపిడీ చేయడమే పనిగా పెట్టుకొందని బాబు తన యాత్రలో మండిపడ్డారు. అయినా అవిశ్వాసం విషయంలో మాత్రం ఆయన రాజీపడడం లేదు. దీన్నిబట్టే ఆయన నిజాయితీని శంకించాల్సి వస్తోంది. టీఆర్‌ఎస్‌ అవిశ్వాసం నిర్ణయాన్ని ఆయన తోసిపుచ్చారు. ఎమ్మెల్యేలను పశువుల మాదిరిగా కొంటున్నారు. అలాంటివాళ్లు అవిశ్వాస తీర్మానం పెడితే టీడీపీ సమర్థించాలా అని ఎదురు ప్రశ్నించారు. చీకటి రాజకీయాలు, సూట్‌కేసు రాజకీయాలకు టీడీపీ దూరమని చెప్పుకొచ్చారు. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల తొలిరోజునే అవిశ్వాసం అంటూ ఆ రెండు పార్టీలు చీకటి రాజకీయాలతో ముందుకొచ్చాయని ఆరోపించారు. అయితే టీడీపీయే అవిశ్వాసం ప్రతిపాదించాలన్న టీఆర్‌ఎస్‌, వైసీపీల డిమాండ్‌ను ఆయన పట్టించుకోవడం లేదు. తెలంగాణ ప్రాంతంలో పాదయాత్ర జరిగినంత కాలం తెరాసను తిడుతూ తెలంగాణకు వ్యతిరేకం కాదన్న బాబు ఇప్పుడు తెరాస జోలికి వెళ్లకుండా తెలంగాణ మట్టి అంటకుండా జాగ్రత్త పడుతున్నారు. టీఆర్‌ఎస్‌ పెట్టిన అవిశ్వాసానికి మద్దతు ఇవ్వబోమని చంద్రబాబు తానేదో ఘనకార్యం చేసినట్లుగా చెప్పుకుంటున్నారు. కానీ ఆయనకు మధ్యంతర భయం పట్టుకుందని రాజకీయ విశ్లేషకుల అంచనా. ఇప్పటికిప్పుడు ఎన్నికలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా లేని చంద్రబాబు అవిశ్వాసానికి దూరంగా ఉంటున్నట్లు స్పష్టమవుతోంది. ఇక టీడీపీ నేతల వాదన కూడా వితండంగా ఉంది. అవిశ్వాస తీర్మానం విషయంలో తటస్థంగా వ్యవహరించాలని తెలుగుదేశం పార్టీ తన శాసన సభ్యులకు విప్‌ జారీ చేసింది. పార్టీకి దూరంగా ఉంటున్న, వైసీపీలో చేరిన ఎమ్మెల్యేలతో కలిపి మొతం 85 మందికి ఈ విప్‌ అందించింది. వైసీపీ, టీఆర్‌ఎస్‌ గురువారం విడివిడిగా అవిశ్వాస తీర్మానం ఇచ్చాయి. ఈ తీర్మానాన్ని సభలో సభాపతి చదివి దానికి మద్దతుగా కనీసం 30మంది ఉంటే ఆ తర్వాత చర్చ, ఓటింగ్‌కు అనుమతిస్తారు. అవిశ్వాస తీర్మానంపై ఈ నెలలో శాసనసభా సభాపతి లీవ్‌ ఆన్‌ మోషన్‌ తీసుకోవచ్చు. ఆ సందర్భంలో పార్టీ ఎమ్మెల్యేలంతా సభకు రావాలి. ఆ తీర్మానానికి మద్దతుగా కానీ, వ్యతిరేకంగా కానీ వ్యవహరించవద్దు. పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు ఈ విప్‌ జారీచేసారు. దీనికి విరుద్ధంగా ఎవరైనా వ్యవహరిస్తే తగిన చర్య తీసుకుంటాం అని తెలుగుదేశం విప్‌ దూళిపాళ నరేంద్ర విప్‌లో పేర్కొన్నారు. పార్టీ గుర్తుపై గెలిచి, పార్టీకి దూరంగా ఉంటున్న ఎమ్మెల్యేలు, ఇతర పార్టీల్లో చేరిన వారికీ విప్‌ ఇచ్చారు. పిరియ సాయిరాజ్‌, వనిత, రామకోటయ్య, కొడాలి నాని, బాలనాగిరెడ్డి, అమర్‌నాథ్‌రెడ్డి, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, హరీశ్వర్‌రెడ్డి, వేణుగోపాలాచారికి విప్‌ అందించారు. ఈ ప్రతిని సభాపతికి కూడా అందించింది. విప్‌ను ఉల్లంఘిస్తే సభాపతి వారిపై అనర్హత వేటు వేసే అవకాశాన్ని కల్పించారు. బాబు ఇంతగా ఎందుకు దిగజారిపోయారు? పాలక పక్షానికి అండగా ఎందుకు నిలిచారు? అని సగటు టీడీపీ కార్యకర్త తనను తానే ప్రశ్నించుకునే స్థాయి కల్పించాడు. నెలల తరబడి మధ్యలో ఉన్న నాయకుడు, పాదయాత్ర ద్వారా లక్షలాది మందిని స్వయంగా కలిసిన తర్వాత కూడా టీడీపీ అధినేత ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా లేడంటే పార్టీ క్యాడర్‌కు ఆయన ఎలాంటి సంకేతాలు పంపుతున్నట్టు? ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఎదుర్కొనే పరిస్థితి లేకుంటే ఎంతోకాలం నుంచి వాయిదా పడుతూ వస్తున్న పంచాయతీ ఎన్నికలకు ఎలా సిద్ధమవుతారు. క్షేత్రస్థాయిలోనూ ఇప్పుడు ప్రజల్లో చైతన్యం పెరిగిపోయింది.. స్థానిక ఎన్నికల్లో అభ్యర్థి గుణగణాలు, అందుబాటులో ఉంటాడా? లేడా? అనే అంశాలతో పాటు ఆయన ఏ పార్టీవాడు, ఆ పార్టీ విధానాలు ఉన్నాయి అనే అంశాలు కూడా చూస్తారు. ఇష్టారాజ్యంగా ధరలు పెంచి, వ్యవసాయ ఉత్పత్తులకు ధర లేకుండా చేసి, కరెంట్‌ కోసి, వడ్డనలపై వడ్డనలతో ప్రజల నడ్డివిరుస్తున్న ప్రభుత్వంతో పాటు ఆ ప్రభుత్వానికి అండగా ఉన్న వారికి వ్యతిరేకంగా తీర్పునిచ్చిన సంఘటనలు కోకొల్లలు. ఏడాదిలో ఎన్నికలు ఉన్నప్పుడు వ్యవహరించాల్సిన తీరులో టీడీపీ నడుచుకోలేదు. దీనిని ప్రజలు ఎలా స్వీకరిస్తారో వేచిచూడాలి.