చలిగాలులతో ఆరోగ్యం జాగ్రత్త
నిజామాబాద్,జనవరి30(జనంసాక్షి): వాతావరణంలో మార్పులు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని, జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈదురు గాలులు, చలి ప్రభావం పంటలపై సైతం ఉంటుందని, దిగుబడులు తగ్గే అవకాశముందని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఈదురు గాలులు వణికిస్తున్నాయి. మూడు రోజులుగా వాతావరణంలో పెను మార్పులు చోటు చేసుకోవడంతో చలి గాలుల ప్రభావం తీవ్రంగా ఉంటోంది. ఇంట్లో నుంచి బయటకు రావాలంటేనే ప్రజలు జంకుతున్నారు. ఆకాశం మేఘావృతమై ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతున్నాయి. ఇటీవల పలుచోట్ల జల్లులు పడ్డాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రజలు ఇంటికే పరిమితమవుతున్నారు. దీంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. వృద్ధులు, పిల్లలు చలికి తట్టుకోలేకపోతున్నారు. రైతులు, కూలీలు సైతం చలి తీవ్రతకు భయపడుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఉన్ని దుస్తులతో బయటకు వెళ్తున్నారు.ఇదే తరహా వాతావరణం మరో రెండు రోజుల వరకు ఉంటుందని, వాతావరణ శాఖ నిపుణులు తెలిపారు.