చలో అసెంబ్లీకి సీపీఐ సై జేఏసీ పిలుపునకు స్పందించిన నారాయణ

హైదరాబాద్‌, మే 9 (జనంసాక్షి) :
తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి (టీ జేఏసీ) పిలుపునిచ్చిన చలో అసెంబ్లీకి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు సీపీఐ రాష్ట్ర కమిటీ కార్యదర్శి డాక్టర్‌ కె. నారాయణ అన్నారు. బుధవారం నగరంలోని సీపీఐ కార్యాలయం మగ్ధుం భవన్‌లో టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌, జేఏసీ నాయకులు నారాయణను మార్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా చలో అసెంబ్లీకి మద్దతివ్వాలని కోరారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహణపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం నారాయణ మాట్లాడుతూ కాంగ్రెస్‌ మోసాన్ని తీవ్రస్థాయిలో ఎండగడుతామన్నారు. చలో అసెంబ్లీకి తమపూర్తి మద్దతు ఉంటుందన్నారు. తెలంగాణపై కాంగ్రెస్‌ నాటకాలాడుతోందన్నారు. కాంగ్రెస్‌ అవకాశవాదపార్టీ అని దుయ్యబట్టారు. తెలంగాణపై కాంగ్రెస్‌ తేల్చకపోతే ప్రజలు తరిమికొడతారని ఆయన హెచ్చరించారు. చలో అసెంబ్లీతో తెలంగాణకు అనుకూలంగా ఎవరున్నారో, వ్యతిరేకులెవరనే విషయాలు బహిర్గతం అవుతాయన్నారు.
అసలు దొంగలు ఎవరో తేలే కాలం సమీపించిందని వ్యాఖ్యానించారు. ప్రజలు ద్రోహులను గుర్తించి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. కోదండరామ్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ కావాలనే తెలంగాణ విషయంలో తాత్సారం చేస్తోందని ఆరోపించారు. తెలంగాణ ఇచ్చేపరిస్థితిలో కాంగ్రెస్‌ లేదనే సమాచారం ఉండడంతో కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకే చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. పార్టీలన్నీ తెలంగాణకు అనుకూలంగా ఉన్నా కూడా కాంగ్రెస్‌ పార్టీతాత్సారం చేస్తోందన్నారు. చలో అసెంబ్లీకి తెలంగాణవాదులంతా స్వచ్ఛందంగా తరలిరావాలని పిలుపునిచ్చారు.
ఢిల్లీలో నిర్వహించిన సంసద్‌యాత్రతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్‌ మరోసారి కేంద్రాన్ని కదిలించిందని, అన్ని రాజకీయ పక్షాలు మద్దతిస్తున్నా కేంద్రం జాప్యం చేస్తోందన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను అవమానించే వారికి తగిన బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.