చల్లా కిడ్నాప్‌పై ఉత్కంఠకొనసాగుతున్న దర్యాప్తు

ఆధారాలు లభ్యం.. త్వరలోనే చేధిస్తాం..: జార్ఖండ్‌ పోలీసులు
హైదరాబాద్‌, నవంబర్‌ 2 : ప్రకాశం జిల్లా డెయిరీ చైర్మన్‌ చల్లా శ్రీనివాసరావు జార్ఖండ్‌ రాష్ట్రంలో కిడ్నాప్‌నకు గురయ్యారు. గురువారం రాత్రి పదిన్నర గంటల సమయంలో ఆయన కిడ్నాప్‌ అయినట్టు ప్రకాశం జిల్లాలోని కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. ఆయనతో పాటు అకౌంటెంట్‌ నరసింహ, డ్రైవర్‌ సమ్‌ కూడా అపహరణకు గురైనట్టు తెలిసింది. జార్ఖండ్‌లోని సాహెబ్‌గంజ్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని లాల్‌మట్టియ ప్రాంతంలోని ఘాట్‌రోడ్డు వద్ద రాత్రి వీరు కిడ్నాప్‌నకు గురయ్యారు. ఈ సంఘటనకు సంబంధించి తమకు ఫిర్యాదు అందిందని, వారి కోసం గాలింపు చర్యలు చేపట్టామని సాహెబ్‌గంజ్‌ పోలీసుసూపరింటెండెంట్‌ విజయలక్ష్మి తెలిపారు. అపహరణకు గురైన వారి జాడలపై కొంత సమాచారం తెలుస్తోందని, త్వరలోనే చేదిస్తామని ఆమె తెలిపారు. శ్రీనివాసరావు స్వస్థలం.. ప్రకాశం జిల్లా కందుకూరు మండలంలోని ఓగూరు గ్రామం. ఈయన జార్ఖండ్‌లోని రూ.120 కోట్ల వ్యయంతో రోడ్డు కాంట్రాక్టు నిర్మాణ పనులను చేస్తున్నారు. ఈ పనులను పర్యవేక్షించేందుకు ఆయన జార్ఞండ్‌కు వెళ్లారు. అక్కడ నక్సల్స్‌ వారిని అపహరించారా.. లేక ఆయన స్వంత రాష్ట్రంలో ఆయనతో విభేదాలు ఉన్న వారు ఎవరైనా పాల్పడ్డారా అనే విషయంపై దర్యాప్తు కొనసాగుతోంది. అయితే జిల్లాలో ఆయనకు ఎవరితోను, ఎలాంటి విభేదాలు లేవని, అందరితో కలిసిపోయే వ్యక్తి అని చెబుతున్నారు. కాగా, శ్రీనివాసరావును విడిపించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రకాశం జిల్లా టీడీపీ నేతలు కరణం బలరామమూర్తి, జనార్ధన రెడ్డి తదితరులు డిమాండు చేశారు.