చాపర్‌ ప్రమాదంలో 20 మంది మృతి

సహాయ చర్యలు కొనసాగుతాయి
ఎయిర్‌ చీఫ్‌ మర్షల్‌
గౌచూర్‌, జూన్‌ 26 (జనంసాక్షి) :
ఉత్తరాఖండ్‌లో సహాయక చర్యలు చేపడుతున్న భారత వైమానిక దళానికి చెందిన హెలికాప్టర్‌ కూలిన ఘటనలో మృతుల సంఖ్య 20కి చేరింది. నాలుగురి మృతదేహాలను బుధవారం వైమానిక దళ సిబ్బంది వెలికితీశారు. దీంతో ఇప్పటివరకు మొత్తం 12 మంది మృతదేహాల వెలికతీత పూర్తయింది. సహాయక చర్యల కోసం కేదార్‌నాథ్‌ వెళ్లి వస్తున్న వాయుసేన హెలికాప్టర్‌ ఎంఐ`17 మంగళవారం గౌరికూండ్‌ సమీపంలో కుప్పకూలిన విషయం తెలిసింది. మొదట ఈ ప్రమాదంలో 8 మంది మృతిచెందినట్లు ప్రకటించగా సాయంత్రానికి 19 మంది చనిపోయినట్లు ప్రకటించారు. 21 మందితో ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌లో 20 మంది మరణించారని అధికారులు తెలిపారు. హెలికాప్టర్‌లో ఐదుగురు ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన సిబ్బంది, ఆరుగురు ఐటీబీపీ జవాన్లు, మిగిలిన వారు ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎన్డీఎంఏలకు చెందిన వారు ఉన్నారు. ప్రమాదంలో వారంతా మృతి చెందారు. దీంతో వైమానిక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. మంగళవారం రాత్రి, బుధవారం సాయంత్రం వరకూ మృతదేహాల వెలికితీత కొనసాగింది. మధ్యాహ్నానికి మొత్తం 12 మంది మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతుల్లో ఐదుగురు వైమానిక సిబ్బందిని గుర్తించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో మరింత పట్టుదలతో సహాయక చర్యలు నిర్వహించేందుకు, పైలట్లు, సిబ్బందిలో మనోధైర్యం పెంచేందుకు గాను ఏయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ఎన్‌ఏకే బ్రౌన్‌ బుధవారం ఉత్తరాఖండ్‌కు చేరుకున్నారు. భారీ వర్షాలు, పొగమంచు, ప్రతికూల వాతావరణం వల్లే హెలికాప్టర్‌ ప్రమాదానికి గురై ఉంటుందని ఏయిర్‌ఫోర్స్‌ సీనియర్‌ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. బెంగాల్‌లోని బరాక్‌పూర్‌ ఏయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌కు చెందిన హెలికాప్టర్‌ ప్రమాదంపై న్యాయ విచారణకు ఆదేశించినట్లు ఐఏఎఫ్‌ అధికార ప్రతినిధి తెలిపారు. వదర బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతాయని ప్రకటించారు.
ప్రమాదానికి గురైన హెలికాప్టర్‌ నుంచి కాక్‌పీట్‌ వాయిస్‌ రికార్డర్‌ (సీవీఆర్‌), ఫ్లైట్‌ డేటా రికార్డర్‌ (సీడీఆర్‌)లను సిబ్బంది బుధవారం స్వాధీనం చేసుకున్నారు. 20 మందిలో ఎవరూ బతికి ఉండే అవకాశం లేదని ఐఏఎఫ్‌ చీఫ్‌ బ్రౌన్‌ తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై ఇప్పుడే వ్యాఖ్యానించడం తగదన్నారు. అయితే, ప్రతికూల వాతావరణం లేక సాంకేతిక సమస్యల వల్ల హెలికాప్టర్‌ ప్రమాదానికి గురై ఉండవచ్చన్నారు. ‘అదృష్టవశాత్తు కాక్‌పీట్‌ వాయిస్‌ రికార్డర్‌, ఫ్లైట్‌ డేటా రికార్డర్‌లను స్వాధీనం చేసుకున్నాం. ఏం జరిగిందనేది త్వరలోనే వెల్లడవుతుందని’ తెలిపారు. మరికొన్ని రోజుల్లో ప్రమాదానికి గల కారణాలు వెల్లడవుతాయన్నారు. కొండ ప్రాంతాల్లో, ప్రధానంగా వర్షాకాలంలో వాతావరణ పరిస్థితి చాలా ముఖ్యమైన అంశమని తెలిపారు. వాతావరణం వల్ల జరిగిందా? లేక సాంకేతిక సమస్యల వల్ల జరిగిందా? అన్నది ఇప్పటికిప్పుడు చెప్పలేమన్నారు. సహాయక చర్యల్లో పాల్గొంటున్నప్పుడు ప్రతికూల పరిస్థితులు కూడా ఉంటాయని, వీటిని చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు చెప్పారు. సహాయక చర్యలు కొనసాగుతాయని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 3`4 రోజులు వాతావరణం సహకరిస్తే సహాయక చర్యలు పూర్తవుతాయన్నారు. శుక్రవారం నుంచి వాతావరణ పరిస్థితుల్లో మార్పు వస్తే వచ్చే సోమ, మంగళవారాల కల్లా ఆపరేషన్‌ పూర్తవుతుందన్నారు. బాధితుతల తరలింపు పూర్తయ్యే వరకూ సహాయక చర్యలు కొనసాగుతాయని తెలిపారు. ‘ఆపరేషన్‌ కొనసాగుతుంది. వాస్తవానికి ఇప్పటికే చాలావరకూ పూర్తయింది. బద్రినాథ్‌, హర్షిల్‌ సెక్టార్లలో చిక్కుకున్న వారిని తరలించాల్సి ఉందని’ చెప్పారు. చివరి బాధితుడిని తరలించే వరకూ సహాయక చర్యలు కొనసాగుతాయని వైమానిక దళాల ప్రధానాధికారి బ్రౌనె తెలిపారు. బుధవారం డెహ్రాడూన్‌ చేరుకున్న ఆయన వరద మృతులు, సైనికుల మృతికి సంతాపం తెలిపారు. బాధితులను తరలించడంలో ఎడీఆర్‌ఎఫ్‌, ఐటీబీపీ, ఆర్మీ, నేవీ కీలక పాత్ర పోషిస్తున్నాయని చెప్పారు. బద్రీనాథ్‌, హర్షిల్‌ ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు వివరించారు. హెలికాప్టర్‌ ప్రమాద మృతులను వెలికితీసే కార్యక్రమం కొనసాగుతుందన్నారు.