చావుదెబ్బలతోనే బిజెపి ముందస్తు గానం

రాంమాధవ్‌ విమర్శలకు ట్వీట్‌ చేసిన లోకేశ్‌

అమరావతి,జూలై7(జ‌నం సాక్షి): ఇటీవల దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో భాజపాకు చావుదెబ్బ తగిలినందుకే ఆ పార్టీ ముందస్తు ఎన్నికలకు తొందరపడుతోందని మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. ప్రధాని మోదీకున్న జనాదరణను చూసే జమిలి ఎన్నికలకు భయపడుతున్నారంటూ భాజపా నేత రాంమాధవ్‌ చేసిన ట్వీట్‌పై లోకేశ్‌ ట్విటర్‌ వేదికగా ఈ విధంగా స్పందించారు. ఒకవేళ మోదీకి నిజంగానే జనాదరణ ఉంటే కర్ణాటక ఎన్నికల్లో ఆ పార్టీని ఎందుకు తిరస్కరించారని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లోనూ ఆ పార్టీకి చావుదెబ్బ తగలిందని విమర్శించారు. అందుకే ఇప్పుడు ముందస్తు ఎన్నికలంటూ తొందర పడుతున్నారని లోకేశ్‌ అన్నారు. ఇలా బీజేపీ నేత రాంమాధవ్‌ ట్వీట్‌కు మంత్రి నారా లోకేష్‌ కౌంటర్‌ ఇచ్చారు. ముందస్తు ఎన్నికలకు ప్రాంతీయ పార్టీలు ఒప్పుకోకపోవడమే మోదీ పాపులారిటీ పెరిగిందనడానికి నిదర్శనం అంటూ రాంమాధవ్‌ ట్వీట్‌ చేశారు. దీనికి స్పందించిన మంత్రి లోకేష్‌.. ధీటైన జవాబు ఇచ్చారు. కర్ణాటక ఎన్నికల్లో ప్రజల తిరస్కారానికి గురైన బీజేపీకి.. ఆ తరువాత దేశ వ్యాప్తంగా జరిగిన అన్ని ఎన్నికల్లో చావు దెబ్బ తగిలిందని లోకేష్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు. అందుకే ఇప్పుడు ముందస్తు ఎన్నికలు అంటూ తొందర పడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. ఇదేనా మోదీ పాపులారిటీ అంటూ లోకేష్‌ ప్రశ్నించారు. ఇటీవలి కాలంలో బీజేపీ నేతల ట్వీట్లకు మంత్రి లోకేష్‌ సూటిగా కౌంటర్లు ఇస్తున్నారు. విభజన హావిూలపైనా… కమలనాథులు చేసే కామెంట్లపైనా.. ఇప్పుడు జమిలి ఎన్నికలపైనా ట్విట్టర్‌ వేదికగా జవాబిచ్చారు. సోషల్‌ విూడియా వేదికగా బీజేపీ చేస్తున్న దాడిని తిప్పికొడుతున్నారు.