చిగురిస్తున్న ప్రజాస్వామ్యంయాభై ఏళ్ల తర్వాత

మయన్మార్‌లో మళ్లీ పత్రికల ప్రచురణ
యాంగన్‌, (జనంసాక్షి) :
తీవ్ర నిర్బంధం.. అణచివేతల తర్వాత మయన్మార్‌లో ప్రజాస్వామ్యం మళ్లీ చిగురిస్తోంది. ఐదు దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత బర్మా నుంచి మళ్లీ దినపత్రికల ప్రచురణ ప్రారంభమైంది. గత సోమవారం మొత్తం మయన్మార్‌ అంతా పండుగ వాతావరణం కనిపించింది. నడుస్తున్న చరిత్రను నమోదు చేసే పత్రికలు ప్రారంభమయ్యాయని ప్రజా స్వామికవాదులు సంబరాలు జరుపుకున్నారు. ఇది చరిత్రలో నిలిచిపోయే రోజని పలువురు పేర్కొన్నారు. ఇకపై తమ దేశంలో ఎక్కడ ఏం జరిగిందో అందరూ తెలుసుకునే అవకాశం కలుగు తుందని, ఈ చరిత్రను భవిష్యత్‌ తరాలు అధ్యయనం చేసేందుకు అవకాశం ఏర్పడుతుందని వారు తెలిపారు. 1960లో సైనిక నియంత నీ విన్‌ దినపత్రికల ప్రచురణ ను నిషేధిస్తూ ఏకపక్ష ఉత్తర్వులు జారీ చేశారు. అంత కుముందు నుంచే తీవ్ర నిర్బంధం ఉన్న మయన్మార్‌లో ప్రజా హక్కులను ప్రశ్నించే గొంతుకే లేకుండా పోయింది. అప్పటినుంచి అంతర్జాతీయ వేదికలపై పలువురు ప్రజాస్వామికవాదులు బర్మాలో మానవ హక్కుల ఉల్లంఘనను ఎలుగెత్తిచాటారు. మయన్మార్‌లో ప్రజా స్వామ్య పునరుద్ధరణకు, పత్రికల ముద్రణకు అంతర్జాతీయ హక్కుల వేదికలు చేసిన ప్రయత్నాలు అంతగా ఫలితాన్నివ్వలేదు. ఐదు దశాబ్దాలు సైనిక పాలనలోనే మగ్గిన మయన్మార్‌లో   ప్రజాస్వామిక పునరుద్ధరణ చర్యలు కొద్దికాలం క్రితమే ప్రారంభమయ్యాయి. ఈక్రమంలో పత్రికల ముద్రణకు ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు పలువురు ప్రజాస్వామికవాదులు ముందుకొచ్చారు. ఈ సందర్భంగా గోల్డెన్‌ ఫ్రెష్‌ల్యాండ్‌ సంపాదకుడు, 81 ఏళ్ల వృద్ధుడు ఖిన్‌ మాంగ్‌ మాట్లాడుతూ తాను ఈ రోజు కోసం ఐదు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నానని తెలిపారు. తాము తొలిరోజు ముద్రించిన 80 వేల కాపీలు కొద్దిసేపట్లోనే అమ్ముడయ్యాయని తెలిపారు. ప్రజలు ప్రజాస్వామ్యాన్ని, పత్రికలను ఎంతగా కోరుకుంటున్నారో తెలిపేందుకు ఈ ఒక్కటి చాలన్నారు. పత్రికలు కొనుగోలు చేసి చదువుతున్న ప్రజల కళ్లల్లో నీళ్లను తాను చూశానని చెప్పారు. పత్రిక స్వేచ్ఛ ఇన్నాళ్లకు నిజమైందని అన్నారు. ప్రజల పక్షాన వార్తలు ప్రచురించిన తనను అప్పటి సైనిక పాలకుడు ని విన్‌ మూడేళ్ల పాటు జైలుకు పంపాడని గుర్తు చేశారు. ఇప్పుడు పత్రికల నిర్వహణ చాలా సులభతరమైందని, ఎప్పటి సమాచారం అప్పుడే ఇంటర్నెట్‌ ద్వారా పాఠకులకు చేరిపోతుందన్నారు. నా ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. నేను, నా టీమ్‌ ఎంత వేగంగా పరుగెత్తుతూ అవరోధంగా ఉన్న హార్డిల్స్‌ను అధిగమిస్తూ స్ప్రింట్‌ కొనసాగించాల్సి ఉంది. అప్పుడే ప్రజలకు ఏం అవసరమో అది అందించగలం అన్నాడు. మయన్మార్‌ అధికార పార్టీ యూఎస్‌డీపీ ద యూనియన్‌ అనే పత్రికను ప్రారంభించింది. మయన్మార్‌ అధ్యక్షుడు థీన్‌ సేన్‌ మాట్లాడుతూ మార్చి 2011లో ప్రజాస్వామిక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రోజు చిరస్మరణీయమైనదన్నారు. ఆర్థిక సరళీకరణ విధానాల ద్వారా దేశాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తామన్నారు. అంతర్జాతీయ మీడియా ఏజెన్సీ ది అసోసియేటెడ్‌ ప్రెస్‌ మయన్మార్‌లో తన కార్యాలయాలను ప్రారంభించింది. మయన్మార్‌ ప్రభుత్వం గతేడాది ఆగస్టులో వార్త పత్రికల ప్రచురణపై నిషేధాన్ని ఎత్తివేసింది. డిసెంబర్‌ 2012లో ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. మయన్మార్‌ ప్రజల ముందుకు 2013 ఏప్రిల్‌ 1న వార్తా పత్రికలను తీసుకువస్తున్నట్లుగా వెల్లడించింది. మయన్మార్‌లో వస్తున్న మార్పులను అంతర్జాతీయ పౌరసమాజం స్వాగతించింది. పీడన, అణచివేతలో మగ్గిపోయిన ప్రజలు ఇకపై పూర్తిగా స్వేచ్ఛావాయువులు పీలుస్తారని పలువురు ఆశాభావం వ్యక్తం చేశారు.