చితికిపోయిన దేశ అర్థిక వ్యవస్థ

మూడు టైర్లు పంచరయిన కారులా ఉంది

మోడీ హయాం ఆర్థిక విధానాలను తూర్పార పట్టిన చిదంబరం

ముంబై,జూన్‌4(జ‌నం సాక్షి ): ప్రధాని నరేంద్రమోడీ హయాంలో భారత ఆర్థిక వ్యవస్థ చితికిపోయిందని కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం ఘాటుగా విమర్శించారు. ఇంతటి దారుణ పరిస్థితులు గంతోల ఎన్నడూ ఉత్పన్నం కాలేదన్నారు. కారు మూడు టైర్లు పంక్చరైన చందంగా ఆర్థిక స్థితి మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పెరుగుతున్న పెట్రోల్‌ ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయన్నారు. మహారాష్ట్ర కాంగ్రెస్‌ ముంబై లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న చిదంబరం.. ప్రైవేటు పెట్టుబడులు, ప్రయివేటు వినియోగం, ఎగుమతులు, ప్రభుత్వ ఖర్చులు భారత ఆర్ధిక వ్యవస్థకు నాలుగు ఇంజిన్ల లాంటివని చెప్పారు. ఐతే వీటిలో మూడింటిన పరిస్థితి ఆధ్వాన్నంగా ఉందన్నారు. పెట్రోల్‌, డీజిల్‌తో పాటు ఎల్పీజీ గ్యాస్‌ పైనా పన్నుల భారం వేస్తూ జనాన్ని మోడీ సర్కార్‌ దోచుకుంటుందని విమర్శించారు. మన ఆర్ధిక వ్యవస్థ విషయంలో… మూడు టైర్లకు పంక్చర్‌ పడింది…’ అని వ్యాఖ్యానించారు. కేవలం ఆరోగ్య సంరక్షణ, కొన్ని ఇతర సదుపాయాల్లో మాత్రమే ప్రభుత్వ ఖర్చులు కొనసాగుతున్నాయనీ… ఈ ఖర్చులు కొనసాగించేందుకు కేంద్రం పెట్రోల్‌, డీజిల్‌తో పాటు ఎల్పీజీ గ్యాస్‌ పైనా పన్నుల భారం వేసిందన్నారు. ప్రజల నుంచి ముక్కుపిండి మరీ పన్నులు వసూలు చేస్తున్న ప్రభుత్వం.. ప్రజా సౌకర్యాల కోసం మాత్రం కొద్ది మొత్తంలోనే విదిలిస్తోందన్నారు. ఇటీవల విద్యుత్‌ రంగంలో కేంద్రం ఖర్చు చేయడం చూశారా?’ అని చిదంబరం ప్రశ్నించారు. ఐదు శ్లాబుల జీఎస్టీ విధానానికి తోడు సెస్‌ వసూలు చేయడం పైనా చిదంబరం విమర్శలు సంధించారు. మిగతా దేశాల్లో జీఎస్టీ కింద ఒకే పన్ను వ్యవస్థ ఉంటుందనీ.. కానీ భారత్‌లో మాత్రం రెండు రకాల పన్నులు అమలు చేస్తున్నారన్నారు. నాన్‌ కార్పొరేట్‌, వ్యవసాయేతర చిన్న, సూక్ష్మ తరహా పరిశ్రమలకు రూ.10 లక్షల లోపు రుణాలు ఇచ్చేందుకు కేంద్రం తెచ్చిన ప్రధానమంత్రి ముద్ర యోజన పథకంపై స్పందిస్తూ… సరాసరిన ఓ వ్యక్తికి ముద్ర రుణం కింద దక్కేది రూ.43 వేలు మాత్రమే. పకోడా స్టాల్‌ పెట్టుకోవడానికి తప్ప.. ఇంత తక్కువ సొమ్ము ఏ పెట్టుబడికైనా పనికొస్తుందా..?’ అని చిదంబరం ప్రశ్నించారు.