చిత్తశుద్ధి కొరవడిన టీ ఎంపీల సత్యాగ్రహం

టీ కాంగ్రెస్‌ ఎంపీలు సత్యాగ్రహ దీక్ష పేరిట పార్లమెంట్‌ ఆవరణలో 48 గంటల పాటు సాగించిన నిరసన ప్రక్రియ అనేక సందేహాలకు వేదికగా నిలిచింది. తెలంగాణ ప్రాంతం నుంచి గెలిచిన పలువురు కాంగ్రెస్‌ ఎంపీలు మొదట్లో ప్రత్యేక రాష్ట్రం కోసం వీరోచిత పోరాటం సాగించారనడంలో ఎలాంటి సందేహం లేదు. వారు ప్రస్తుతం అనుసరిస్తున్న పంథానే అనేక సందేహాలకు తావిస్తోంది. ప్రజల ఆకాంక్ష కోసం పదవులను గడ్డిపోచల్లా వదులుకున్న వారిని గుండెల్లో పెట్టుకొని చట్ట సభలకు పంపిన చరిత్ర తెలంగాణ ప్రజలది. ఇది ఒకటి రెండు సందర్భాల్లో వ్యక్తుల ప్రభావంతో ప్రతికూల ఫలితాలను ఇవ్వచ్చేమో కాని ఉద్యమానికి ప్రజలు సదా అండగా నిలుస్తూనే ఉన్నారు. కొన్నిసార్లు తెలంగాణ త్యాగధనులను రికార్డు మెజార్టీ చట్టసభలకు పంపి తెలంగాణ వ్యతిరేక పార్టీలకు కనీసం డిపాజిట్‌ కూడా దక్కకుండా చేశారు తెలంగాణ ప్రజలు. అలాంటి ప్రజల ఆకాంక్షలు వ్యక్త పరచడంలో తెలంగాణ ప్రాంతం నుంచి చట్టసభలకు ఎన్నికైన వారిలో పలువురు సొంత ఎ’జెండా’లు మోస్తున్నారు. మరికొందరు సీమాంధ్ర పెత్తందారుల చేతుల్లో కీలుబొమ్మలుగా మారి మాతృగడ్డకు దూరం చేస్తున్నారు. ఓట్లేసి గెలిపించిన ప్రజలను నిలువునా ముంచేస్తున్నారు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన పిడికెడు మంది పెట్టుబడిదారుల ప్రయోజనం కోసం నాలుగున్నర కోట్ల ప్రజల హక్కులను పణంగా పెడుతున్నారు. తద్వారా వాళ్లు కొంత మేరకు ఆస్తులు కూడగట్టుకోగలుగుతున్నారేమో కానీ తెలంగాణ ప్రాంతానికి తీరని అన్యాయం చేస్తున్నారు. అలాంటి వారి పల్లకీలు మోస్తూ వారి సేవలో తరిస్తున్న ద్రోహులు తెలంగాణ ప్రాంతంలో ఎంతో మంది ఉన్నారు. వారు ఎన్నికల సమయంలో తలెత్తే వివిధ పరిణామాలను ఆసరాగా చేసుకొని ఎలాగోలా చట్టసభలకు చేరుతున్నారు. వారిని గుర్తించడంలోనే కొంత జాప్యం జరిగింది. 2009 నవంబర్‌, డిసెంబర్‌లో వెల్లువెత్తిన తెలంగాణ ప్రజా ఉద్యమం కేంద్ర ప్రభుత్వాన్నే దిగివచ్చేలా చేసింది. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. సీమాంధ్ర శక్తులకు వెన్నతోపెట్టిన మేనేజ్‌మెంట్‌ విద్యను ఇక్కడ సంపూర్ణంగా ప్రయోగించారు. ఆ విద్యకు తెలంగాణలోని పలువురు ప్రజాప్రతినిధులు దాసోహమయ్యారు. తెలంగాణ కోసం బయటికి ఏదో మాట్లాడినా లోపల్లోపల వాళ్లు చేసిన ద్రోహం మాములుది కాదు. కొన్నాళ్లకు వాళ్ల ముసుగులు తొలగి అసలు రూపం బయటపడింది. నిస్సిగ్గుగా, నిర్లజ్జంగా వారు మాతృగడ్డకు చేస్తున్న ద్రోహం తేటతెల్లమైంది. కాంగ్రెస్‌ పార్టీ తమను గుర్తించడం కోసం, మంత్రి పదవుల కోసమో తెలంగాణవాదం ఎత్తుకున్న ప్రబుద్ధులూ లేకపోలేదు. వారు అనుకున్న లక్ష్యానికి చేరువైన తర్వాత, ఇప్పట్లో చేరుకోలేమని తెలుసుకున్నాక తెలంగాణవాదాన్ని పూర్తిగా విస్మరించారు. ఢిల్లీలో ఏదైనా కదలిక తలెత్తితే తప్ప వారు తెలంగాణ గురించి మాట్లాడలేనంతగా బిజీ అయిపోయారు. అలాంటి సందర్భంలోనూ తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ ఎంపీలు ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌ను వినిపించేందుకు, ప్రజల ఆకాంక్షను వ్యక్త పరిచేందుకు పార్లమెంట్‌నే వేదికగా మలుచుకున్నారు. పార్టీ అధినేత్రి సమక్షంలోనూ తెలం’గానం’ ఆలపించారు. ప్రతిపక్ష సభ్యుల మాదిరిగా వెల్‌లోకి దూసుకువచ్చి జై తెలంగాణ నినాదాలు చేశారు. సోనియాగాంధీ ఎదురుగా నిలబడి మాట్లాడేందుకే జంకే మహామహుల హెచ్చరికలను సైతం భేఖాతరు చేశారు. ఎంపీలు ఒక్కమాట నిలబడటంతో కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం స్పందించక తప్పనిసరి పరిస్థితి కల్పించారు. లోక్‌సభలో ఎఫ్‌డీఐలపై నిర్వహించిన ఓటింగ్‌కు టీ ఎంపీల మద్దతు అవసరమైన సందర్భంలో బెట్టు చేసి తెలంగాణపై అఖిలపక్ష సమావేశం నిర్వహించేలా చేశారు. అప్పటి వరకూ టీ ఎంపీల చిత్తశుద్ధిని శంకించిన వారే లేరు. ఎంపీలను చూసైనా మంత్రులు, ఎమ్మెల్యేలు బుద్ధి తెచ్చుకోవాలని గడ్డిపెట్టిన వాళ్లూ లేకపోలేదు. కానీ అదే ఎంపీలు అఖిలపక్షం తర్వాత చతికిలపడ్డారు. నెలరోజుల్లోగా తెలంగాణను తేల్చేస్తామని యూపీఏ ప్రభుత్వంతో ప్రకటింపజేసిన ఎంపీలు దాని నుంచి కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం వెనక్కి తగ్గితే అంతేస్థాయిలో నిరసన తెలుపలేకపోయారు. స్పీకర్‌ ఫార్మాట్‌లో రాజీనామాలు సమర్పిస్తున్నట్లు ప్రకటించినా వాటిని ఆమోదింపజేసుకునే ప్రయత్నమే చేయలేదు. ఆ తర్వాత పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో పాల్గొని తెలంగాణ గొంతు వినిపించినా ఆ డిమాండ్‌లో మునుపటి దిక్కారం లోపించింది. ఎంతసేపు 2014 ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ప్రయాసే కనిపించింది. అదేసమయంలో టీ ఎంపీల గుంపు పలుచనైంది. వివిధ కారణాలతో కొందరు ఎంపీలు ఆ గుంపునకు దూరమయ్యారు. అందులో ఇదివరకు వీర తెలంగాణవాదులుగా గుర్తింపు పొందిన వారూ ఉన్నారు. ఏం జరిగినా ఎంపీల గుంపును చీల్చడంలో కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం విజయవంతమైంది. సోమ, మంగళవారాల్లో పార్లమెంట్‌ ఆవరణలో నిర్వహించిన 48 గంటల సత్యాగ్రహ దీక్షలో కరీంనగర్‌, నాగర్‌కర్నూల్‌, నల్గొండ, పెద్దపల్లి, వరంగల్‌ ఎంపీలు పొన్నం ప్రభాకర్‌, మందా జగన్నాథం, గుత్తా సుఖేందర్‌రెడ్డి, డాక్టర్‌ జి. వివేకానంద, సిరిసిల్ల రాజయ్య మాత్రమే పాల్గొన్నారు. తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్‌ పార్టీకి 12 మంది ఎంపీలుండగా, వారిలో ముగ్గురు కేంద్ర మంత్రులుగా పనిచేస్తున్నారు. సికింద్రాబాద్‌, జహీరాబాద్‌ ఎంపీలు ఆదినుంచి ఉద్యమానికి దూరంగానే ఉంటున్నారు. భువనగిరి, నిజామాబాద్‌ ఎంపీలు టీ ఎంపీల గ్యాంగ్‌కు దూరమయ్యారు. అయితే తెలంగాణ కోసం దీక్షకు దిగిన ఎంపీల్లోనూ ప్రత్యేక రాష్ట్రం సాధించాలనే చిత్తశుద్ధి స్థానే 2014 ఎన్నికల్లో గెలుపొందడమే లక్ష్యంగా కనిపించింది. అది నిజం కాదని ఇప్పటికైనా ఎంపీలు నిరూపించుకోవాలనుకుంటే పదవులను త్యజించాలి. ప్రజాక్షేత్రంలోకి వచ్చి వారి తరపున కొట్లాడాలి. ఐదుగురు ఎంపీలు రాజీనామా చేస్తే ఆ ప్రభావం కాంగ్రెస్‌ పార్టీపై, యూపీఏ సర్కారుపై కొద్దిగా ఉండదు. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఎంపీలు కీలక నిర్ణయం తీసుకుంటే కేంద్రం ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌కు తలొగ్గక మానదు. ఇప్పటికైనా కంటితుడుపు దీక్షలు కట్టిపెట్టి, స్వార్థాన్ని వీడి అసలైన పోరు సాగించాలి. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ముందు వరుసలో నిలువాలి.