చిదంబరానికి ఊరట 

– ఎయిర్‌ సెల్‌ -మాక్సిస్‌ కేసులో మధ్యంతర బెయిల్‌ మంజూరు
న్యూఢిల్లీ, మే30(జ‌నం సాక్షి) : ఎయిర్‌సెల్‌-మాక్సిస్‌ మనీలాండరింగ్‌ కేసులో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి స్వల్ప ఊరట లభించింది. ఈ కేసు విచారణ నిమిత్తం అరెస్టు చేయకుండా ఉండేందుకు చిదంబరం ముందస్తు బెయిల్‌ కోరుతూ ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్‌ను బుధవారం విచారించిన ప్రత్యేక న్యాయమూర్తి ఓపీ.సైని ముందస్తు బెయిలు ఇచ్చేందుకు అంగీకరించారు. జూన్‌ 5లోగా ఈ కేసుకు సంబంధించిన వివరాలు తెలియజేయాల్సిందిగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) నివేదికను కోరింది. అప్పటి వరకు చిదంబరంపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని ఈడీ అధికారులను ఆదేశించింది. మరోవైపు జూన్‌ 5న విచారణకు హాజరు కావాల్సిందిగా చిదంబరానికి ఈడీ ఇప్పటికే సమన్లు పంపించింది. కేసుకు సంబంధించిన ఇప్పటికే చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరానికి జులై 10 వరకు ముందస్తు బెయిల్‌ ఇచ్చారు. నిబంధనలకు వ్యతిరేకంగా ఎయిర్‌సెల్‌-మాక్సిస్‌ ఒప్పందానికి అప్పటి ఆర్థికమంత్రి చిదంబరం అనుమతి ఇచ్చారని సీబీఐ, ఈడీ వాదిస్తోంది. ఇందుకు గాను ఆయన కుమారుడు కార్తీ చిదంబరానికి భారీ మొత్తంలో ముడుపులు అందాయని సీబీఐ ఆరోపిస్తుంది. దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది.