చివరి రోజు కూడా తెలంగాణ
తీర్మానానికి సహకరించని సర్కారు
మిన్నంటిన తెలం’గానం’
అసెంబ్లీ నిరవధిక వాయిదా
హైదరాబాద్, సెప్టెంబర్ 22(జనంసాక్షి): అనుకున్నదే అయ్యింది. చివరి రోజు కూడా సభ సాగలేదు. వాయిదాలతోనే ‘వర్షాకాలం’ గడిచిపోయింది. మొక్కుబడిగా నిర్వహించిన అసెంబ్లీ సమావేశాలు ఎలాంటి కార్యకలాపాలు చేపట్టకుండానే మొక్కుబడిగా సాగింది. ఎలాంటి చర్చ లేకుండానే ముగిసింది. తెలంగాణ అంశం ఐదు రోజులుగా సభను కుదిపేసింది. తొలి రోజు నుంచి చివరి రోజు వరకూ తెలం’గానమే’ మిన్నంటింది. విపక్షాల నినాదాలతో సభ దద్దరిల్లింది. పట్టువీడని ప్రతిపక్షాలు, మెట్టుదిగని ప్రభుత్వం.. ఎట్టకేలకు ప్రజా సమస్యలు చర్చకు రాకుండా ఎవరికి వారు తమ వాంతు పాత్ర పోషించారు.అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో చివరి రోజైన శనివారం కూడా పరిస్థితిల మార్పు రాలేదు. సభ సజావుగా సాగలేదు. ఉదయం సభ ప్రారంభం కాగానే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోరుతూ టీఆర్‌ఎస్, నాగం జనార్దన్‌రెడ్డి వాయిదా తీర్మానాలు ఇవ్వగా, ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికపై బీజేపీ ఖరీఫ్‌లో వర్షాభావ పరిస్థితులు, రైతు సమస్యలపై టీడీపీ, గిరిజన సంక్షేమం-వ్యాధులపై వైఎస్సార్ సీపీ, ఓపెన్‌కాస్ట్ మైనింగ్‌పై సీపీఐ, గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలపై సీపీఎం, పోలీసు కానిస్టేబుళ్ల భర్తీపై మస్లిస్ వాయిదా తీర్మానాలిచ్చాయి. అయితే, విపక్షాల వాయిదా తీర్మానాలన్నింటినీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ తిరస్కరించారు. దీంతో విపక్ష సభ్యులు స్పీకర్ పోడియం చుట్టుముట్టి ఆందోళనకు దిగారు. తెలంగాణపై తీర్మానం ప్రవేశపెట్టాలంటూ టీఆర్‌ఎస్ సభ్యులు ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేశారు. సభ జరగకుండా అడ్డుపడ్డారు. మరోవైపు, కృష్ణా డెల్టాకు నీరివ్వాలని టీడీపీ సభ్యులు నిరసన చేపట్టారు. విద్యుత్, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై చర్చిద్దామని, సభ్యులు వెళ్లి తమ స్థానాల్లో కూర్చోవాలని స్పీకర్ పదే పదే విజ్ఞప్తి చేశారు. మరో మంత్రి శ్రీధర్‌బాబు, చీఫ్ విప్ గండ్ర వెంకటరమణరెడ్డి కూడా సభ్యులకు విజ్ఞప్తి చేసినా, వారు తమ పట్టు వీడలేదు. బీఏసీ సమావేశాలకు అనుగుణంగానే సభ నడుస్తోందని, అయనా విపక్షాలు సజావుగా సహకరించక పోవడం దురదృష్టకరమని శ్రీధర్‌బాబు అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణ అంశం కేంద్ర పరిధిలో ఉందని, వారే నిర్ణయం తీసుకుంటారని, సభ సజావుగా సాగేందుకు
సహకరించాలని చీఫ్ గండ్ర వెంకటరమణారెడ్డి కోరారు. సమావేశాల చివరి రోజైనా సహకరించాలని స్పీకర్ పదే పదే విజ్ఞప్తి చేసినా స్పందన లేకపోవడంతో సభను గంటపాటు వాయిదా వేశారు. సభ వాయిదా పడిన అనంతరం టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్‌ను కలిసి తెలంగాణ తీర్మానం ప్రవేశపెట్టాలని విజ్ఞప్తి చేశారు. అయితే, మనోహర్ స్పందించలేదని సమాచారం.
వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన సభ పది నిమిషాలు కూడా సాగలేదు. ప్రశ్నోత్తరాలు రద్దు చేసి, విద్యుత్ సమస్యపై స్వల్పకాలిక చర్చ చేపడదామని స్పీకర్ సూచించారు. కానీ, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, నాగం తదితరులు స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లారు. తెలంగాణ తీర్మానం ప్రవేశపెట్టాల్సిందేనని డిమాండ్ చేశారు. తెలంగాణపై తీర్మానం చేయడానికి ఐదు నిమిషాల సమయం మాత్రమే పడుతుందని, ఆ తర్వాత మిగతా సమస్యలపై చర్చిద్దామని పేర్కొన్నారు. పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ, సభ్యులు శాంతించకపోవడంతో సభ రెండోసారి వాయిదా పడింది. గంట తర్వాత మళ్లీ సమావేశమైనా సభ ఎక్కువ సేపు సాగలేదు. ఇటీవల మృతి చెందిన మాజీ శాసనసభ్యులకు సభ సంతాపం తెలిపింది. రెండు నిమిషాల పాటు మౌనం వహించింది. వాయిదా అనంతరం ప్రారంభమైన సభలో స్పీకర్ మనోహర్.. కొండా లక్ష్మణ్‌బాపూజీ సహా పలువురి మృతిపై సంతాప సందేశం చదివి వినిపించారు. ఆ వెంటనే విపక్ష సభ్యులు పోడియంలోకి దూసుకెళ్లి, తెలంగాణ నినాదాలతో ¬రెత్తించారు. తెలంగాణ తీర్మానం పెట్టాల్సిందేనని పట్టుబట్టారు. చివరి రోజు సభను సజావుగా సాగనీయాలని స్పీకర్ వారికి విజ్ఞప్తి చేశారు. తమ సభ్యులను వెనక్కు పిలవాలని ఫ్లోర్ లీడర్లకు పలుమార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయింది. దీంతో సభను అరగంట వాయిదా వేశారు. అనంతరం సభ ప్రారంభమైనా విపక్షాల ఆందోళన సద్దుమణగకపోవడంతో స్పీకర్ సభను నిరవధికంగా వాయిదా వేశారు.