చెక్కుల పంపిణీ కసరత్తు పూర్తి
జిల్లాలో ప్రారంభించనున్న మంత్రులు
గ్రామాల్లో ఇప్పటికే సమాచారం చేరవేత
ఆదిలాబాద్,మే9(జనం సాక్షి): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చెక్కలు పంపిణీలకి సర్వం సిద్దం చేశారు. మంత్రులు జోగురామన్న, ఇంద్రకరణ్ రెడ్డిలు తమ జిల్లాల్లో కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ మేరకు కలెక్టర్ దివ్య ఏర్పాట్లను సవిూక్షించారు.చెక్కులు, పాసు పుస్తకాల పంపిణీలో భాగంగా రైతులకు ముందస్తు సమాచారం ఇచ్చారు. ఆ గ్రామంలో ఏ రోజు పంపిణీ చేస్తున్నామో తెలియజేసారు. ఎండల తీవ్రత అధికంగా ఉండడంతో ఉదయం, సాయంత్రం పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఉదయం 7 గంటల నుంచి 11 గంటలకు లేదా సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటలకు గ్రామాల్లో ఈ ప్రకియ పూర్తి చేస్తారు. రైతులకు పాసు పుస్తకాలు, చెక్కులను తీసుకున్న రైతుల సంతకాలు తీసుకుంటారు. పంపిణీ రోజు రైతులు అందుబాటులో లేకుంటే చెక్కులు పాసుపుస్తకాలను మూడు నెలల పాటు మండల కార్యాలయాల్లో ఉంచుతారు. జిల్లాలోని 508 రెవెన్యూ గ్రామాల్లో రైతులకు చెక్కులతో పాటు కొత్తగా ముద్రించిన పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేయనున్నారు. రైతు సమగ్ర సర్వే ప్రకారం 18 మండలాల్లోని లక్షా16 వేల మంది రైతులు ఉండగా ఎకరాకు రూ. 4వేల చొప్పున చెక్కులను రైతులకు వారికి పంపిణీ చేయనున్నారు. రైతులకు పంపిణీ చేయాల్సిన చెక్కులు, పాసు పుస్తకాలు ఇప్పటికే ఆయా మండలాలకు చేరుకున్నాయి. చెక్కుల పంపిణీ ఎలా నిర్వహించాలనే విషయాన్ని కలెక్టర్ ఆదిలాబాద్ మండలం బట్టి సవర్‌గాంలో రెండ్రోజుల కిందట పరిశీలించారు. ఇటీవల జిల్లా వ్యాప్తంగా భూ సమగ్ర సర్వే నిర్వహించగా రైతులు సాగుచేసే భూముల వివరాలు, రైతుల సంఖ్యను అధికారులు గుర్తించారు. దీంతో జిల్లాలోని పట్టాదారు పాసుపుస్తకాలు, రైతుబంధు చెక్కుల పంపిణీకి అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. పంపిణీ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించేందుకు 82 బృందాలను ఏర్పాటు చేశారు. ఒక్కో బృందం రోజూ 300 చొప్పును పాసు పుస్తకాలు, చెక్కులను పంపిణీ చేస్తుంది. ఒక గ్రా మంలో 300 మందికంటే ఎక్కువ మంది రైతులు ఉంటే రెండు లేదా మూడు బృందాలను ఏర్పాటు చేస్తున్నారు. గ్రామాల్లోని పంపిణీ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కౌంటర్లు ఏర్పాటు చేసి రైతులకు నీటి వసతి, కుర్చీలు, నీడ కల్పించడంతో పాటు రెవెన్యూ సిబ్బంది సలహాలు, సూచనలు అందిస్తారు. రైతులందరూ ఒకేసారి వస్తే గందరగోళం ఏర్పాడే అవకాశం ఉండటంతో పంపిణీ రోజుకు ముందుగానే రైతులకు చీటీలను పంపిణీ చేస్తున్నారు. ఇందులో రైతు పేరు, సర్వే నంబరు, లిస్ట్‌లోని క్రమ సంఖ్య తదితర వివరాలు ఉంటాయి. కౌంటర్ వద్ద రైతు చీటీని చూపిస్తే సిబ్బంది వాటిని ధృవీకరించుకుని పంపిణీ చేస్తారు. చెక్కులను రైతులకు మాత్రమే ఇస్తారు. ఏవరైనా అనారోగ్యంతో ఉంటే గ్రామాల్లోని వారి ఇంటికి వెల్లి అధికారులు స్వయంగా అందజేస్తారు. పాసుబుక్కుల కోసం ఆధార్‌కార్డులు చూపించాల్సి ఉంటుంది.
——