చెన్నమనేనికి కన్నీటి వీడ్కోలు

3

హైదరాబాద్‌,మే10(జనంసాక్షి): అనారోగ్యంతో సోమవారం తెల్లవారుజామున కన్నుమూసిన ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, సీనియర్‌ రాజకీయ నాయకుడు చెన్నమనేని రాజేశ్వరరావు అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య ముగిశాయి. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసం నుంచి అంతిమయాత్ర నిర్వహించి.. అనంతరం ఫిలింనగర్‌లోని మహాప్రస్థానంలో అధికార లాంఛనాలతో ఆయన భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించారు. చెన్నమనేని కుమారుడు రమేష్‌ చితికి నిప్పంటించారు. ఈ సందర్భంగా పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపి శ్రద్ధాంజలి ఘటించారు. రాజేశ్వర్‌రావు అంత్యక్రియలను అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.అంత్యక్రియలకు మంత్రులు కేటీఆర్‌, నాయిని నర్సింహరెడ్డితోపాటు పలువురు రాజకీయ నేతలు, ప్రముఖులు హాజరయ్యారు.అంత్యక్రియలకు ఆయన సోదరుడు, మహారాష్ట్ర గవర్నర్‌ విద్యాసాగర్‌రావు, తెలంగాణ మంత్రులు కాంగ్రెస్‌, తెదేపా ముఖ్యనేతలు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.